సమగ్ర భూ సర్వే పకడ్బందీగా నిర్వహించాలి
20-02-2026 01:17 AM
బెల్లంపల్లి, ఫిబ్రవరి 19 : సమగ్ర భూ సర్వేను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి.చంద్రయ్య తెలిపారు. గురువారం తాండూరు మండలం రాంపూర్ గ్రామ శివారులో కొనసాగుతున్న సమగ్ర భూ సర్వే ప్రక్రియను రెవెన్యూ, సర్వే అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ సమగ్ర భూ సర్వే వలన కలిగే ప్రయోజనాలను రైతులకు వివరించి సర్వే ప్రక్రియ పూర్తి స్థాయిలో చేపట్టేందుకు సహకరించాలని కోరారు.
సర్వే పనులను పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని, ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా సర్వే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సర్వే అధికారి శ్రీనివాస్, మండల తహసిల్దార్, గ్రామ సర్పంచ్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.






