9 June, 2026 | 1:24 AM

బీసీ ఉద్యమాన్ని దారిమళ్లించే కుట్ర!

09-06-2026 12:00 AM

టీ చిరంజీవులు :

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పన్నెండు సంవత్సరాలు పూర్తయ్యాయి. రాష్ట్ర విభజన సమయంలో ఉద్ధృతంగా కనిపించిన ప్రాంతీయ భావోద్వేగాలు, రాజకీయ ఉద్రిక్తతలు క్రమంగా తగ్గుముఖం పట్టి, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు తమ అభివృద్ధి, ఉపాధి, విద్య, ఆరోగ్యం, సంక్షేమం వంటి అంశాలపై దృష్టి కేంద్రీకరించే దశకు చేరుకున్నారు.

కొందరు రాజకీయ నాయకులు ఇటీవల చేస్తున్న వ్యాఖ్యలు, చేప డుతున్న రాజకీయ కార్యక్రమాలు చూస్తుం టే మరోసారి ప్రాంతీయ భావోద్వేగాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ‘తెలంగాణ’ అనే పదం న్యాయ నిఘంటువులో లేదన్న వ్యాఖ్యలు, తెలంగాణ ఉద్యమ చరిత్రను తక్కువ చేసి చూపే ప్రయత్నాలు, రెండు రాష్ట్రాల ప్రజల మధ్య అపోహలు సృష్టించే ప్రకటనలు ప్రజాస్వామ్య రాజకీయాలకు మేలు చేసే అంశా లు కావు.

ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు సహజమే. కానీ, ఒక ప్రాంత ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడటం రాజకీయ సంస్కృతికి విరుద్ధం. అదేవిధంగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజునే జనసేన సమావేశాన్ని నిర్వహించడం, తెలంగాణ పోటీచేస్తామని ప్రకటించ డం కూడా రాజకీయ చర్చకు దారితీసింది. ఇది తెలంగాణ ప్రజలకు సవాలు విసిరేలా గా ఉంది. భారత రాజ్యాంగం ప్రకారం దేశంలోని ఏ పౌరుడైనా, ఎక్కడి నుంచైనా ఎన్నిక ల్లో పోటీచేసే హక్కు ఉంది.

ఆ హక్కును ప్రశ్నించే పరిస్థితి లేదు. గతంలోనూ జనసేన తెలంగాణలో పోటీచేసింది. కాబట్టి, ఎన్నికల్లో పోటీ చేయడంపై అభ్యంతరం లేదు. కానీ, రాజకీయ లబ్ధి కోసం ప్రాంతీయ ఉద్రిక్తతలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం, తెలంగాణ ప్రజల మనోభావాలను గాయపరిచే విధంగా వ్యవహరించడం మాత్రం సమర్థనీయమైనది కాదు.

ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలను పరిశీలిస్తే తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా కొన్ని రాజకీయ శ క్తులు వ్యవహరిస్తున్నాయనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. తెలంగాణ నేలపై తెలంగాణ చరిత్రకు, ఉద్యమానికి సంబంధించిన నాయకులను పక్కనపెట్టి ఇతర ప్రాంతాల నాయకుల విగ్రహాలను ఆవిష్కరించడం, ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిని కలవడం, తెలంగాణ బీజేపీ నాయకత్వానికి అదే స్థాయిలో ప్రాధాన్యం ఇవ్వకపోవడం వంటి పరిణామాలు అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.

ఇలాంటి చర్యలు తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీయడమే కాకుండా, మళ్లీ ప్రాంతీయ భావోద్వేగాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నాలుగా కనిపిస్తు న్నాయి. తెలంగాణ అస్తిత్వానికి, ఆత్మగౌ రవానికి భంగం కలిగినప్పుడు తెలంగాణవాదులు తగిన రీతిలో స్పందించడం సహజం, అవసరం కూడా. తెలంగాణలో ఒక సామెత ఉంది: ‘ఇటుకతో కొడితే, నువ్వు రాయితో సమాధానం చెప్పు’ (ఈట్ కా జవాబ్ పత్తర్ సే దేనా) అని.

అంటే మన ఆత్మగౌరవాన్ని కాపాడుకునే స్థాయిలో ప్రతిస్పందించాల్సిన అవసరం ఉంటుంది. అయితే అదే సమయంలో మనం ఒక విషయాన్ని మరవకూ డదు. ప్రాంతీయ ఉద్రిక్తతలు, భావోద్వేగాలు పెరిగిన ప్రతిసారి సామాజిక న్యాయం, బీసీ ల రాజకీయ సాధికారత, బహుజన హక్కుల వంటి అసలు ప్రశ్నలు చర్చ నుంచి పక్కకు వెళ్లిపోయే ప్రమాదం ఉంటుంది. పాలక వర్గాలు కూడా చాలాసార్లు ఇలాంటి వివాదాలను ముందుకుతెచ్చి ప్రజల దృష్టిని మౌలిక సమస్యల నుంచి మళ్లించే ప్రయ త్నం చేస్తుంటాయి.

అందువల్ల తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుతూనే, బీసీ ఉద్యమం లక్ష్యాలను, సామాజిక తెలంగాణ సాధన అనే ప్రధాన ఎజెండాను విస్మరించకూడదు. ప్రాంతీయ భావోద్వేగాల ప్రవాహంలో కొ ట్టుకుపోకుండా, సామాజిక న్యాయం, ప్రాతినిధ్యం, రాజకీయ సాధికారత అనే బీసీ ఉద్యమం ప్రధాన లక్ష్యాలపై దృష్టిని నిలబెట్టుకోవడం నేటి అవసరం. తెలంగాణ అస్తి త్వ పరిరక్షణతో పాటు సామాజిక తెలంగాణ నిర్మాణమూ సమాంతరంగా సాగాలి. అదే బహుజన సమాజానికి మేలు చేసే మార్గం. 

ఇప్పటికే ఒక వర్గం మీడియా రాజకీయ నా యకుల మధ్య జరిగే వ్యక్తిగత విమర్శలు, వివాదాలు, వైరాలను అతిగా ప్రదర్శిస్తూ అసలు ప్రజా సమస్యలను మరుగునపడేస్తోంది. ఫలితంగా బహుజనులు తమ నిజ మైన సమస్యలు ఏమిటో, వాటి పరిష్కారానికి ఎలా పోరాడాలో మర్చిపోయి, రాజకీ య నాయకుల పరస్పర కొట్లాటలకు ప్రేక్షకులుగా మారుతున్నారు. తమ హక్కులు, అవకాశాలు, జీవన సమస్యలపై సంఘటితంగా పోరాడాల్సిన ప్రజలు, రాజకీయ నాటకాలలో భాగస్వాములై కాలం గడుపుతున్నారు.

ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇస్తా యి. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీల అమలులో విఫలమైనప్పుడు ప్ర జల దృష్టిని అసలు సమస్యల నుంచి మళ్లించేందుకు భావోద్వేగ అంశాలను ముందుకు తెచ్చే ప్రయత్నాలు చేస్తుంటాయి. మతం, ప్రాంతం, భాష, కులం వంటి అంశాలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించడం భారత రాజకీయాల్లో కొత్త విషయమే మీ కాదు. నిరుద్యోగం, రైతుల ఆత్మహత్యలు, ధరల పెరుగుదల, విద్యా సంక్షోభం, వైద్య సేవల లోపాలు వంటి ప్రజా సమస్యలకు సమాధానాలు చెప్పాల్సిన సందర్భం లో కొందరు నాయకులు వివాదాస్పద వ్యా ఖ్యల ద్వారా చర్చను దారిమళ్లిస్తుంటారు. 

ఇదే సమయంలో తెలంగాణలోనూ ప్రజల దృష్టి మరొక కీలకమైన అంశంపై కేం ద్రీకృతమవుతోంది. అది బీసీల రాజకీయ, సామాజిక, ఆర్థిక హక్కుల ప్రశ్న. రాష్ట్ర జనాభాలో అత్యధిక శాతం ఉన్న బీసీలు తమ జనాభాకు అనుగుణంగా రాజకీయ ప్రాతిని ధ్యం, అధికార వ్యవస్థల్లో భాగస్వామ్యం, వి ద్యా అవకాశాలు, ఆర్థిక వనరులలో వాటా కోరుతున్నారు. జనగణనలో కులగణన, 42% బీసీ రిజర్వేషన్లు, చట్టసభల్లో వాటా, చట్టసభలలో బీసీ మహిళలకు రిజర్వేషన్లు వంటి అంశాలు ప్రజా చర్చలోకి వస్తున్నా యి.

ఇది యాదృచ్ఛికంగా వచ్చిన చైతన్యం కాదు. శతాబ్దాలుగా కొనసాగిన సామాజిక వివక్షకు వ్యతిరేకంగా వచ్చిన సహజ ప్రతిస్పందన. ఉద్యమం సమయంలో ‘నీళ్లు, నిధులు, నియామకాలు’ అనే నినాదం బ లంగా వినిపించింది. రాష్ట్రం ఏర్పడిన తర్వా త మరో ప్రశ్న ముందుకు వచ్చింది. ‘ఆ నీళ్లు ఎవరికొచ్చాయి? ఆ నిధుల ప్రయోజనం ఎవరికి దక్కింది? ఆ నియామకాలలో భాగస్వామ్యం ఎవరికుంది? అభివృద్ధి ఫలాలు సమాజంలోని అన్ని వర్గాలకు సమానంగా చేరాయా? లేక కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతమయ్యాయా?’ ఈ  ప్రశ్నలకు సమాధా నాలు వెతికే క్రమంలోనే బీసీ ఉద్యమం మ రింత బలపడుతోంది.

ఈ ఉద్యమం ఏ ఒక్క నాయకుడి పిలుపుతో పుట్టింది కాదు. గ్రా మాల్లో, పట్టణాల్లో, విద్యార్థుల్లో, యువత లో, ఉద్యోగుల్లో, మేధావుల్లో పెరుగుతున్న సామాజిక చైతన్యానికి ఇది ప్రతిబింబం. అందుకే కొందరు రాజకీయ విశ్లేషకులు ఒక ప్రశ్న లేవనెత్తుతున్నారు. బహుజన రాజకీయ చైతన్యం బలపడుతున్న సమయంలో ప్రాంతీయ వివాదాలను మళ్లీ ముందుకు తేవడం యాదృచ్ఛికమా? లేక ప్రజల దృష్టిని సామాజిక న్యాయ అంశాల నుంచి మరల్చే రాజకీయ వ్యూహమా? ఎందుకంటే ప్రజలు సామాజిక న్యాయం గురించి మాట్లాడడం ప్రారంభిస్తే అధికార భాగస్వామ్యంపై చర్చ మొదలవుతుంది.

జనాభాకు అనుగుణంగా ప్రాతినిధ్యం గురించి ప్రశ్నలు వస్తాయి. రాజకీయ పార్టీల అభ్యర్థుల ఎంపిక, పదవుల పంపిణీ, ఆర్థిక వనరుల కేటాయింపు వంటి అంశాలు పరిశీలనకు వస్తాయి. ఇవి అధికార వర్గాలకు అసౌకర్యం కలిగించే ప్రశ్నలు. అందుకే కొన్నిసార్లు భావోద్వేగ రాజకీయా లు అసలు సమస్యలను కప్పిపుచ్చే సాధనం గా మారుతాయి. భారతచరిత్ర చెబుతున్న ఒక గొప్ప సత్యం ఏమిటంటే సామాజిక న్యా య ఉద్యమాలను శాశ్వతంగా ఎవరూ అణచలేరు.

జ్యోతిరావు ఫూలే, ఛత్రపతి సాహూ మహారాజ్, పెరియార్, అంబేద్కర్, రామ్ మనోహర్ లోహియా, కాన్షీరాం వంటి మ హనీయులు ప్రారంభించిన ఉద్యమాలు ఎన్నో అడ్డంకులను ఎదుర్కొన్నప్పటికీ మరిం త బలంగా ముందుకు సాగాయి. ఎందుకంటే అవి ప్రజ ల జీవిత వాస్తవాల నుంచి పుట్టిన ఉద్యమాలు. అవి కేవలం రాజకీయ నినాదా లు కాదు; సమానత్వం, గౌరవం, అవకాశాల కోసం జరిగిన పోరాటాలు.

నేడు తెలంగాణలో వినిపిస్తున్న ‘హిస్సా, ఇజ్జత్, హుకుమత్’ అనే నినాదం కూడా అదే భావజాలానికి ప్రతీక. హిస్సా అంటే వాటా, ఇజ్జత్ అంటే గౌరవం, హుకుమత్ అంటే అధికార భాగస్వామ్యం. ఇది ఎవరికై నా వ్యతిరేకంగా చేసే ఉద్యమం కాదు. రాజ్యాంగం కల్పించిన సమాన అవకాశాల కోసం చేసే ప్రజాస్వామ్య డిమాండ్ మాత్ర మే. జనాభాలో అత్యధికంగా ఉన్న వర్గాలు కేవలం ఓటర్లుగానే కాకుండా విధాన నిర్ణయాలలో భాగస్వాములుగా మారాలని కోరుతున్నాయి.

ప్రాంతీయ విద్వేషాలు ప్రజలను తాత్కాలికంగా భావోద్వేగాలకు గురిచే యవచ్చు. కానీ, అవి నిరుద్యోగ యువకుడికి ఉద్యోగం ఇవ్వవు, రైతు సమస్యలను పరిష్కరించవు, విద్యా అవకాశాలను పెంచవు, సామాజిక అసమానతలను తొలగించవు. ప్రజల జీవితాలను మెరుగుపరిచేవి అభివృ ద్ధి, సామాజిక న్యాయం, సమాన అవకాశా లు, ప్రజాస్వామ్య భాగస్వామ్యమే. అందువల్ల తెలంగాణ సమాజం ముందు నేడు ఒక కీలకమైన ప్రశ్న ఉంది.

మనం మళ్లీ ప్రాంతీ య విద్వేషాల రాజకీయాల్లో చిక్కుకుపోవాలా? లేక సామాజిక న్యాయం, సమాన ప్రాతినిధ్యం, ప్రజాస్వామ్య భాగస్వామ్యం, ఆర్థిక అభివృద్ధి వంటి మౌలిక అంశాలపై చర్చను ముందు కు తీసుకెళ్లాలా? గతంలో జరిగిన ప్రాంతీ య ఉద్యమాలలో రోడ్లపైకి ఎక్కింది బహుజన యువత, లాఠీ దెబ్బలు తిన్నది బహుజన యువత, ఆత్మాహుతి చేసుకున్నది బహుజన యువత. కానీ, లాభం పొం దింది ఆధిపత్య కులాలు. 

చరిత్ర చెబుతున్న పాఠం ఏమిటంటే, భావోద్వేగాలతో నడిచిన ఉద్యమాల్లో త్యాగాలు బహుజనులు చేస్తే, ఫలాలు మాత్రం తరచుగా ఆధిపత్య వర్గాల చేతుల్లో కి వెళ్లాయి. ప్రాంతీయత, భాష, సంస్కృతి వంటి అంశాలను ముందుకు తెచ్చి ప్రజల ను సమీకరించడం ఒక రాజకీయ వ్యూహం కావచ్చు; కానీ ఆ ఉద్యమాల అనంతరం సామాజిక న్యాయం, సమాన ప్రాతినిధ్యం, అధికార భాగస్వామ్యం ఎంత మేరకు సాధించారన్నదే అసలు కొలమానం.

తెలంగాణ ఉద్యమం భౌగోళిక రాష్ట్రాన్ని సాధించింది. ఇప్పుడు సామాజిక తెలంగాణను సాధించాల్సిన బాధ్యత మిగిలి ఉంది. భౌగోళిక తెలం గాణ సాధించడం ఒక చారిత్రక విజయం. కానీ, సామాజిక తెలంగాణ నిర్మాణమే ఆ విజయానికి సంపూర్ణతను ఇస్తుంది.

ప్రాంతీయ భావోద్వేగాలు తాత్కాలిక రాజకీయ లాభాలను ఇవ్వవచ్చు. కానీ సామాజిక న్యాయం మాత్రమే శాశ్వత సామాజిక శాంతి, సమాన అభివృద్ధి, ప్రజాస్వామ్య బలోపేతానికి దారితీస్తుంది. ప్రాం తీయ విద్వేషాలు బీసీల అసలు శత్రువు కావు; బీసీల రాజకీయ, సామాజిక ఎదుగుదలను అడ్డుకునే ఆధిపత్య శక్తులే అసలు సవాలు. అందువల్ల బీసీ సంఘాలు, బహుజన నాయకులు భావోద్వేగాలకు లోనుకా కుండా, బీసీ ఉద్యమాన్ని పక్కదారి పట్టించే కుట్రలను తిప్పికొట్టాలి. మన లక్ష్యం ప్రాంతీయ ఘర్షణలు కాదు; హిస్సా, ఇజ్జత్, హుకుమత్ సాధన.

ఆధిపత్య కులాలవారు తెలుసుకోవాల్సింది ఏమిటంటే బీసీ ఉద్యమం ఆగేది కాదు. మీ కుట్రలు ఇప్పుడు, ఇక్కడ పని చేయవు. ఎందుకంటే ఇది రాజకీయ కార్యాలయాల్లో పుట్టిన ఉద్యమం కాదు, ప్రజల గుండెల్లో పుట్టిన ఉద్యమం. వారి శ్రమ, వారి ఆశలు, వారి ఆత్మగౌరవం కలిసిన ఉద్యమం. భౌగోళిక తెలంగాణను సాధించిన ఈ నేల, సామాజిక తెలంగాణను కూడా సాధించే దిశగా ముందుకుసాగుతుంది. అదే అసలైన తెలంగాణ భవిష్యత్తు.

 వ్యాసకర్త: విశ్రాంత ఐఏఎస్, 

బీసీ ఇంటెలెక్చువల్ ఫోరమ్ చైర్మన్