తగ్గిన జననాల రేటు!
దేశవ్యాప్తంగా జనగణనకు సన్నాహాలు జరుగుతున్న వేళ భారత్‌లో జననాల రేటు క్రమంగా తగ్గుతూ, జనాభా స్థిరంగా ఉండేందుకు అవసరమైన స్థాయి 2.1 కంటే దిగువకు చేరుకున్నట్టు కేంద్ర ప్రభుత్వ నివేదిక వెలువడటం చర్చనీయాంశంగా మారింది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న భారత జననాల రేటు 1.9కి పడిపోవడం దేశ భవిష్యత్తుకు సంబంధించిన అనేక ప్రశ్నలను ముందుకు తెస్తున్నది. జననాల రేటు తగ్గడమంటే ఒక మహిళ తన జీవితకాలంలో కనే పిల్లల సగటు సంఖ్య తగ్గడమని తెలిసిందే.
మహిళల విద్యాభివృద్ధి, పట్టణ జీవనం, పెళ్లిళ్లు ఆలస్యంగా జరగడం, జీవన వ్యయం పెరగడం, కుటుంబ నియంత్రణపై అవగాహన వంటి అనేక కారణాలు దీని వెనుక ఉన్నాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత దశాబ్దకాలంగా భారతీయులు చిన్న కుటుంబాల వైపు మొగ్గుచూపడమూ మరో కారణం. అయితే ఐఫోన్లకు, జననాల రేటు తగ్గుదలకు సంబంధం ఉండొచ్చని అమెరికా పరిశోధకులు సూచనప్రాయంగా చెప్పినప్పటికీ; 2008లో ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన ఆర్థిక సంక్షోభం, జీవనశైలి మార్పులు, ఆర్థిక పరిస్థితులు వంటి కీలక అంశాలను విస్మరించలేం.
కాగా, జననాల రేటు తగ్గుదలపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యావంతుల్లో ఈ ధోరణి చాలా కాలం కిందటే ప్రారంభమైందని ప్రముఖ పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్ అభిప్రాయపడటం గమనార్హం. మరోవైపు జనాభా నిపుణులు మాత్రం ఈ మార్పును పూర్తిగా ప్రతికూలంగా చూడటం లేదు. మహిళా సాధికారత, ఆరోగ్య సేవల విస్తరణ, కుటుంబాల ఆర్థిక స్థితిగతుల్లో వచ్చిన మార్పులకు ఇది ఒక స్పష్టమైన సంకేతమని వారు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే జనగణన అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నది.
దక్షిణాది, ఉత్తరాది రాష్ట్రాల మధ్య ఉన్న జనాభా వ్యత్యాసం ఇప్పటికే రాజకీయ ప్రభావాన్ని చూపుతుండటాన్ని మనం చూస్తూనే ఉన్నాం. ఏదేమైనప్పటికీ జననాల రేటు తగ్గుదల అనేది భారత సమాజంలో చోటుచేసుకుంటున్న లోతైన మార్పులకు ప్రతిబింబంగా నిలుస్తున్నది. వృద్ధుల జనాభా పెరుగుతున్న ప్రాంతాల్లో భవిష్యత్తులో ఆరోగ్య సేవలు, సామాజిక భద్రతకు ప్రాధాన్యమివ్వాల్సి ఉండగా; యువ జనాభా అధికంగా ఉన్న ప్రాంతాల్లో విద్య, నైపుణ్యాభివద్ధి, ఉపాధి అవకాశాలపై ప్రభుత్వం దృష్టిసారించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తు భారత్ ఏ దిశగా సాగాలో నిర్దేశించనున్న ‘మార్పు’ అసలు చిత్రాన్ని బయటపెట్టే రాబోయే జనగణన అత్యంత కీలకమని చెప్పక తప్పదు.






