15 July, 2026 | 4:17 AM

కన్నీళ్లు మిగిల్చిన కల్తీ సారా

23-06-2024 12:27 AM
  1. తమిళనాడులోని కరుణాపురంలో విషాద ఛాయలు

మృతుల కుటుంబాల్లో అంతులేని వేదన

కన్నవారిని పోగొట్టుకోవడంతో అనాథలుగా మిగిలిన చిన్నారులు

వారిని ఎలా పోషించాలో తెలియక వృద్ధుల దైన్యం

చెన్నై, జూన్ 22: కల్తీ సారా తాగి ఇటీవల తమిళనాడులోని కళ్లకురిచ్చి జిల్లా కరుణాపురంలో కల్తీసారా తాగి 55 మంది మృతిచెందగా, మరో 88 మంది ఆసుపత్రి పాలయ్యారు. వీరిలో కొందరు మృత్యువుతో పోరాడుతున్నారు. ఈ ఘటన తమిళనాడును కుదిపేస్తున్నది. కుటుంబాలను పోషించే వారు మృత్యువాత పడడంతో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. కన్నవారు మృతిచెందడంతో కొందరు బాలలు అనాథలుగా మిగాలారు.

వారిని ఎలా పోషించాలో తెలియక వృద్ధులు తల్లడిల్లుతున్నారు. ఒకే కుటుంబంలో భార్యాభర్తలు మృతిచెందడంతో ముగ్గురు బాలలు అనాథలు మిగిలారు. ఆ ముగ్గురి భవిష్యత్తు ఇక ఎలా ఉంటుందోనని వారి నాయనమ్మ ఆందోళన చెందుతున్నది. కొడుకును కోల్పోయిన మరో తల్లి మాట్లాడుతూ.. ‘నా కుమారుడు కల్తీ సారా తాగడంతో కడుపునొప్పి వచ్చింది. తీవ్ర అస్వస్థతతో ఓ ఆస్పత్రికి వెళితే, ఆ ఆస్పత్రి యాజమాన్యం చికిత్స అందించేందుకు నిరాకరించింది. దీంతో నా కుమారుడు మృతిచెందాడు. రాష్ట్రప్రభుత్వమే దీనికి బాధ్యత తీసుకోవాలి. సారా తయారీదారులపై ఉక్కుపాదం మోపాలి’ అని డిమాండ్ చేసింది.

కలెక్టర్, ఎస్పీపై వేటు..

కళ్లకురుచ్చి ఘటనపై తమిళనాడు సీఎం స్టాలిన్ తీవ్రంగా స్పందించారు. ఘటన తనకు దిగ్భ్రాంతి కలిగించిందన్నారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల, చికిత్స పొందుతున్న వారికి రూ.50 వేల చొప్పున పరిహారం అందిస్తామన్నారు. నిందితులను విడిచిపెట్టేదిలేదని ప్రకటింంచారు. ఈ మేరకు సారా తయారీ, విక్రయంతో ప్రమేయం ఉన్న పదిమందిని ఇప్పటికే పోలీసులతో అరెస్టు చేయించారు. కళ్లకురుచ్చి కలెక్టర్ శ్రావణ్‌కుమార్ స్థానంలో ఎంఎస్ ప్రశాంత్‌ను, ఎస్పీ సమయ్‌సింగ్ మీనా స్థానంలో రజత్ చతుర్వేదిని నియమించారు. డీఎస్పీ స్థాయి ర్యాంక్ పోలీస్ అధికారితో పాటు ముగ్గురు సీఐలు, మరికొంత మంది పోలీస్ సిబ్బందిపై వేటు వేశారు. విచారణను వేగవంతం చేసేందుకు కేసును సీబీఐకి కేసును అప్పగించారు.

ప్రతిపక్ష నేత విమర్శల దాడి

కల్తీ సారా ఘటనలో సామాన్యుల మృతిపై తమిళనాడు అసెంబ్లీ దద్దరిల్లింది. డీఎంకే ప్రభుత్వంపై ఏడీఎంకే ఎమ్మెల్యేలు విరుచుకుపడ్డారు. ప్రభుత్వ వైఫల్యంతోనే మరణాలు సంభవించాయని నిప్పులు చెరిగారు. ‘కల్తీ సారా, మద్యం విక్రయాలను అడ్డుకోవడంలో రాష్టప్రభుత్వం విఫలమైంది’ అని ప్రతిపక్షనేత ఎడప్పాడి పళనిస్వామి మండిపడ్డారు. 

నటుడు సూర్య విమర్శనాస్త్రాలు..

కల్తీ సారా విషయంపై ప్రముఖ సినీనటుడు సూర్య కూడా తమిళనాడు ప్రభుత్వంపై సోషల్‌మీడియా ద్వారా పరోక్షంగా విమర్శలు చేశారు. తుఫానులు, వరదలు, వానలు వచ్చి కూడా ఇంతమంది మృతిచెందరని ఆందోళన వ్యక్తం చేశారు. కల్తీ సారా వికుయాన్ని కట్టడి చేయకుండా పాలకులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. మృతుల కుటుంబాల ఆక్రందనలను కలచివేస్తున్నాయన్నారు. గతేడాది విల్లుపురంలో నూ కల్తీ మద్యం తాగి 22 మంది మృతిచెందారని, ప్రభుత్వ విధానాల్లో అప్పటి ఇప్పటికీ ఎలాంటి మార్పుల లేకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న మద్యం షాపుల్లో రూ.150 పెట్టి మద్యం కొనలేని పేదలంతా రూ.50కి కల్తీ మద్యం తాగుతున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వ విధానాల్లో మార్పులు రావాలని కోరుకుంటున్నానన్నారు.