ఎన్టీఏ డీజీకి ఉద్వాసన
- సుబోధ్‌కుమార్ సింగ్‌ను తొలగించిన కేంద్రం
కొత్త డీజీగా ప్రదీప్‌సింగ్ కరోలా నియామకం
లీకేజీలపై ఏడుగురు సభ్యులతో కమిటీ
ఇస్రో మాజీ చైర్మన్ రాధాకృష్ణన్ నేతృత్వం
నీట్ లీక్ నిజమే.. అయినా పరీక్ష రద్దు చేయం
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
నీట్ పీజీ ప్రవేశ పరీక్ష వాయిదా
న్యూఢిల్లీ, జూన్ 22: నీట్, నెట్ పరీక్ష పత్రాల లీక్ నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు చేపట్టింది. ఈ పరీక్షల నిర్వహణ సంస్థ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) డైరెక్టర్ జనరల్ (డీజీ) సుబోధ్ కుమార్ సింగ్‌ను పదవి నుంచి తప్పించింది. ఆయన స్థానంలో 1985 బ్యాచ్ ఐఏఎస్ అధికారి ప్రదీప్‌సింగ్ కరోలాను ఎన్టీఏ డీజీగా నియమిస్తూ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీచేసింది. సుబోధ్‌కుమార్‌ను కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖకు అటాచ్ చేసింది.
‘ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ చైర్మన్ అండ్ మేనేజింగ్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డైరెక్టర్ ప్రదీప్‌సింగ్ కరోలాకు ఎన్టీఏ డీజీగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ కేంద్ర క్యాబినెట్ అపాయింట్‌మెంట్స్ కమిటీ నిర్ణయం తీసుకొన్నది. ఎన్టీఏకు పూర్తిస్థాయి డీజీని నియమించేవరకు లేదా తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఈ నియామకాం కొనసాగుతుంది’ అని ప్రభుత్వం ఓ ప్రకటనలో వెల్లడించింది. మరోవైపు పేపర్ లీక్‌ల భయంతో ఎన్టీఏ మరో పరీక్షను వాయిదా వేసింది. ఆదివారం నిర్వహించాల్సిన నీట్ పీజీ పరీక్షను వాయిదా వేసినట్టు ప్రకటించింది. ఈ పరీక్షను మళ్లీ ఎప్పుడు నిర్వహించేది త్వరలోనే ప్రకటిస్తామని విద్యాశాఖ తెలిపింది.
ఇస్రో మాజీ చైర్మన్ నేతృత్వంలో నిపుణుల కమిటీ
పేపర్ లీక్‌లు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. ఏగురు సభ్యుల కమిటీని నియమిస్తూ కేంద్ర విద్యాశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ‘ఎన్టీఏ ద్వారా పరీక్షలను పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు విద్యాశాఖ, ఉన్నత విద్యా విభాగం నేతృత్వంలో ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని నియమించటం జరిగింది. పరీక్షల నిర్వహణ మెకానిజాన్ని మరింత అభివృద్ధి చేయటం, డాటా సెక్యూరిటీ ప్రొటోకాల్, నిర్మాణం, ఎన్టీఏ కార్యాచరణపై ఈ కమిటీ తగు సూచనలు చేస్తుంది’ అని విద్యాశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. రెండు నెలల్లో ఈ కమిటీ నివేదిక సమర్పిస్తుందని వెల్లడించింది.
ఈ కమిటీకి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మాజీ చైర్మన్ రాధాకృష్ణన్ నేతృత్వం వహిస్తారు. ఈయన ఐఐటీ ఖర్‌గ్‌పూర్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చైర్మన్‌గా కూడా ఉన్నారు. ఈ కమిటీలో డాక్టర్ రణ్‌దీప్ గులేరియా (ఢిల్లీ ఎయిమ్స్ మాజీ డైరెక్టర్), ప్రొఫెసర్ బీజే రావ్ (సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వైస్ చాన్స్‌లర్), ప్రొఫెసర్ కే రామమూర్తి (ఐఐటీ మద్రాస్‌లోని సివిల్ ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్‌లో ప్రొఫెసర్ ఎమిరిటస్), పంకజ్ బన్సల్ (పీపుల్ స్ట్రాంగ్ సహవ్యవస్థాపకుడు, కర్మయోగి భారత్ బోర్డు మెంబర్), ఆదిత్య మిట్టల్ (ఐఐటీ ఢిల్లీ విద్యార్థి వ్యవహారాల విభాగం డీన్), గోవింద్ జైస్వాల్ (కేంద్ర విద్యాశాఖ సంయుక్త కార్యదర్శి) సభ్యులుగా ఉంటారు. కమిటీకి గోవింద్ జైస్వాల్ మెంబర్ సెక్రటరీగా కూడా వ్యవహరిస్తారు. ఈ కమిటీ ఎన్టీఏ ప్రస్తుత పరీక్షల నిర్వహణ విధానాన్ని క్షుణ్ణంగా పరిశీలించనున్నది. ఆ సంస్థ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (ఎస్‌వోపీ)ను రివ్యూ చేస్తుంది. అన్ని అంశాలను పరిశీలించిన అనంతరం పరీక్షలను పటిష్టంగా నిర్వహించటంపై పలు సూచనలు చేస్తూ రెండు నెలల్లో కేంద్ర విద్యాశాఖకు నివేదిక అందజేస్తుంది.
లీకేజీల ప్రభావం తక్కువే
నీట్, నెట్ పేపర్ల లీక్‌ను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తేలిగ్గా తీసుకొన్నా రు. నీట్ ప్రశ్నపత్రం లీకైన మాట నిజమేనని, అయినా పరీక్షను రద్దుచేయబోమని తెగేసి చె ప్పారు. పేపర్ లీక్ ప్రభావం చాలా కొద్దిమం ది విద్యార్థులపైనే పడిందని తెలిపారు. అందువల్ల పరీక్ష రద్దుచేయటం వల్ల లక్షల మందికి ఇబ్బంది కలుగుతుందని పేర్కొన్నారు.
పేపర్ లీక్ చేస్తే పదేండ్ల జైలు
పేపర్ లీకులను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. ‘పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) యాక్ట్ 2024ను శుక్రవారం నుంచి అమల్లోకి తెచ్చింది. ఈ చట్టం ప్రకారం నేరం రుజువైతే నిందితులకు పదేండ్లవరకు జైలు శిక్ష పడుతుంది. గరిష్ఠంగా రూ.కోటి వరకు జరిమానా విధించే అవకాశం ఉన్నది.
కీలక నిందితుడు మైండ్ అరెస్టు
నీట్ పేపర్ లీక్‌లో కీలక నిందితుడిగా అనుమానిస్తున్న రవి ఆత్రిని ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. గ్రేటర్ నోయిడాలోని నీమ్‌కా గ్రామానికి చెందిన ఇతడు బీహార్‌లో నీట్ పేపర్ లీక్ చేసిన ముఖియా స్వాల్ గ్యాంగ్‌లో కీలక సభ్యుడని గుర్తించారు. బీహార్‌లో పేపర్ లీకేజీపై దర్యాప్తు జరుపుతున్న పోలీసులకు.. ఈ లీకేజీ ముఠా నాయకుడు సంజీవ్ ముఖియాతో అత్రికి సన్నిహిత సంబంధాలున్నట్టు గట్టి ఆధారాలు దొరికాయి. అత్రి కూడా మెడికల్ విద్యార్థే. 2007లో కోటాలో మెడికల్ పరీక్ష కోసం కోచింగ్ తీసుకొన్న అతడు.. 2012లో అందులో పాసై రోహ్‌తక్‌లోని పీజీఐ కాలేజీలో చేరాడు. అయితే, చివరి సంవత్సరం పరీక్షలు మాత్రం రాయలేదు. అతడు పేపర్ లీకేజీ మాఫియాలో చేరాడని గుర్తించారు.






