11 July, 2026 | 2:11 AM

క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి సరిహద్దులు నిర్ధారించాలి

11-07-2026 12:30 AM

కలెక్టర్ స్నేహ శబరిష్

మహబూబాబాద్, జూలై10 (విజయక్రాంతి): భూ వివాదాలను పరిష్కరించడానికి, భూముల హద్దులను కచ్చితంగా గుర్తించడానికి భూదార్ (భూభారతి) సర్వేను ప్రభుత్వం చేపట్టిందని, రాష్ట్రంలో ప్రతి జిల్లాలో 70 గ్రామాలు ఎంపిక చేయబడగా, శుక్రవారం జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ రెవెన్యు, సర్వే అధికారులతో డోర్నకల్ మండలంలో ఎంపిక చేసిన గుర్రాలకుంట, బూర్గంపాడు, ముల్కలపల్లి, బొద్దుగొండ నాలుగు  గ్రామాలలో  శుక్రవారం గుర్రాలకుంట గ్రామ పంచాయతీ పరిధి సరిహద్దులను రెవెన్యు, సర్వే అధికారులతో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా సర్వే అధికారులు గ్రామ సరిహద్దులను తెలిపే వివరాలను మ్యాప్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డీజీపీఎస్ రోవర్స్ ద్వారా సరిహద్దు తగాదాలు లేకుండా క్షేత్రస్థాయిలో పక్కాగా హద్దుల నిర్ధారణ జరుగుతోందని, ఈ సర్వే పూర్తయిన తర్వాత ప్రతి భూమికి ప్రత్యేకమైన ఐడెంటిఫికేషన్ నంబర్గా ’భూదార్’ కేటాయించబడుతుందని కలెక్టర్ అన్నారు.

గ్రామం లోని భూములకు సంబంధించి హద్దులు నిర్ధారిస్తామని, తద్వారా గ్రామానికి సంబంధించిన భూమి స్పష్టత వస్తుందని, ప్రభుత్వ భూముల సైతం నిర్ధారణ అవుతాయన్నారు. భూసర్వే సమగ్రంగా నిర్వహించి మ్యాపింగ్ చేస్తామన్నారు. మ్యాపింగ్ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించేందుకు రెవెన్యూ అధికారులు, సర్వే అధికారులు సమన్వయంతో క్షేత్రస్థాయిలో గ్రామసభలు నిర్వహించి రైతులకు అవగాహన కల్పించాలని గ్రామ సరిహద్దులు నిర్ణయించేటప్పుడు చుట్టు ప్రక్కల రైతులకు సమాచారం, నోటీసులు అందించాలని, సర్వే అధికారులు ముందస్తు ప్రణాలికలు తయారు చేసుకొని సరిహద్దులను నిర్ణయించాలని అన్నారు.

సరిహద్దుల సర్వే త్వరగా, పకడ్బందీగా నిర్వహించాలని అన్నారు. ఖచ్చితమైన బౌండరీ మ్యాపింగ్ ఉండటం వల్ల భవిష్యత్తు లో ఎలాంటి భూ ఆక్రమణ సమస్యలు, వివాదాలు తలెత్తవని, క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి, పొరుగు రైతుల సమక్షంలో సరిహద్దులు నిర్ధారించాలని కలెక్టర్ తెలిపారు. ఈ పరిశీలనలో జిల్లా కలెక్టర్ వెంట మహబూబాబాద్ ఆర్.డి.ఓ రాజేశ్వరీ, సర్వే ల్యాండ్ అధికారి శ్రీనివాసులు, డోర్నకల్ తహసిల్దార్ రఘువీరారెడ్డి, లైసెన్స్ సర్వేయర్లు, రెవెన్యు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.