11 July, 2026 | 2:44 AM

కాంగ్రెస్ నేతలకు.. కంటి పరీక్షలు చేయించాలి

11-07-2026 01:53 AM
  1. ఫాతిమా కాలేజీ చెరువులో లేదని నమ్మించే యత్నం చేస్తున్నారు
  2. కేంద్రమంత్రి బండి సంజయ్ మండిపాటు

హైదరాబాద్, జూలై 10 (విజయక్రాంతి): ఓవైసీ కళాశాల చెరువులో లేదని కాంగ్రెస్ ప్రభుత్వం నమ్మించే ప్రయత్నం చేస్తోందని కేంద్రమంత్రి బండి సంజయ్ విమర్శించారు. కాంగ్రెస్ నేతలకు కంటి పరీక్ష తర్వాత కూడా చెరువు కనిపించకపోతే సమస్య కంటి చూపులో కాదు.. రాజకీయాల్లో ఉందన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఎంఐఎం పార్టీని లక్ష్యంగా చేసుకుని బండి సంజయ్ ఎక్స్ వేదికగా శుక్రవారం విమర్శలు చేశారు.

ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీకి చెందిన ఫాతిమా మహిళా కళాశాల సల్కం చెరువు పరిధిలో ఉంద ని బండి సంజయ్ మరోసారి ఆరోపించారు. ఇది ప్రపంచమంతా చూస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం చూసీచూడనట్లు నటిస్తోందని మండిప డ్డారు. పేదల ఇళ్లను హైడ్రా పేరుతో కూల్చివేస్తున్న ప్రభు త్వం, అందరికీ కనిపిస్తున్న ఈ ఆక్రమణను మాత్రం ఎందుకు గుర్తించలేకపో తోందని నిలదీశారు.

కాంగ్రెస్ ప్రభుత్వానికి కంటి చూపు సమస్యా? లేక రాజకీయ సంకల్పం లోపించిందా? అని నిలదీశారు. ప్రతి బీజేపీ కార్యకర్త కాంగ్రెస్ నాయకుల కోసం ఉచిత కంటి పరీక్ష శిబిరాలు నిర్వహించాలని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ రాజకీయ అవసరాలకనుగుణంగా ఎఫ్‌టీఎల్ (ఫుల్ ట్యాంక్ లెవెల్) గీతలు మారుతున్నాయనే అనుమానాలు బలపడుతున్నాయన్నారు.

పేదలకు ఒక న్యాయం, అధికార పక్షానికి దగ్గరగా ఉన్నవారికి మరో న్యాయమా? అని ప్రశ్నించారు. చట్టం అందరికీ సమానంగా అమల వ్వాలని, ఎంపిక చేసుకుని కాదన్నారు. చెరువులు, ఎఫ్‌టీఎల్‌ల విషయంలో ప్రభుత్వం ద్వంద్వ వైఖరిని వీడాలన్నారు. ప్రజలకు కనిపిస్తున్న నిజం ప్రభుత్వానికి ఎందుకు కనిపించడంలేదో కాంగ్రెస్ సమాధానం చెప్పాలన్నారు. 

ఫాతిమా కాలేజీ చుట్టూ వివాదం..

ఫాతిమా కాలేజీ ఎఫ్‌టీఎల్ అంశం రోజురోజుకూ వివాదంగా మారుతోంది. దీనిపై రాజకీయ రంగు పులుముకుంటుం ది. ఈ విద్యాసంస్థ భవనం సల్కం చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో లేదని విచారణ సందర్భంగా హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం తెలియజేసింది. రెవెన్యూ, నీటి పారుదల శాఖ సంయుక్తంగా నిర్వహించిన సర్వే నివేదికను కూడా అదనపు అడ్వకేట్ జనరల్ (ఏఏజీ) ఇమ్రాన్‌ఖాన్ హైకోర్టుకు సమర్పించారు.

అంతేకాకుండా గత ప్రభుత్వ హయాంలో మిషన్ కాకతీయ కింద సల్కం చెరువు కట్టను అభివృద్ధి చేశారని, ప్రస్తుతం ఎఫ్‌టీఎల్‌లో ఎలాంటి నిర్మాణాలు లేవని కోర్టుకు నివేదికను సమర్పించారు. అయితే ఈ నివేదికను, సంబం ధించిన మ్యాపులను పరిశీలించిన న్యాయస్థానం ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించింది. చెరువుల్లోకి అక్రమ నిర్మాణాలు చొచ్చుకొని వచ్చినట్లు మ్యాపుల్లో స్పష్టంగా కనిపిస్తున్నప్పటికి ఎఫ్‌టీఎల్ ఆక్రమణకు గురి కాలేదని ఎలా చెబుతారని? ప్రశ్నించింది.

ప్రభుత్వం, ప్రభుత్వ సంస్థలు నచ్చినవారి పట్ల ఒక విధంగా ఇతరుల పట్ల మరో విధంగా వ్యవహరిస్తున్నట్లుగా ఉందని ధర్మాసనం ఆక్షేపించింది. చెరువుల ఆక్రమణలు తొలగిస్తున్నామని చెబుతున్న హైడ్రా కూడా ఈ చెరువు విషయంలో ఏం చర్యలు తీసుకుందని నిలదీసింది.

ఈ విషయంలో ఇటు హైడ్రా, అటు ప్రభుత్వ తీరుపై బీజేపీ తీవ్రంగా మండిపడుతోంది. సామాన్యులకు ఒక న్యాయం, పెద్దలకు మరో న్యాయమా? అంటూ నిలదీస్తోంది. పేదల ఇళ్లను కూల్చిన హైడ్రా, కాంగ్రెస్ ప్రభుత్వం మరీ ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్న ఓవైసీ విద్యాసంస్థపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదో సమాధానం చెప్పాలని మండిపడుతోంది. ఇది తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.