11 July, 2026 | 1:48 AM

వివాహేతర సంబంధం వల్లే మహిపాల్ ఆత్మహత్య

11-07-2026 12:45 AM
  1. రాత్రి భార్య, ఆమె ప్రియుడి రిమాండ్
  2. మహిపాల్ మరణం మొదట స్థానికంగా తీవ్ర కలకలం రేపింది

బోధన్,జూలై10(విజయ క్రాంతి): ఎడపల్లి మండలం అంబం (వై) గ్రామానికి చెందిన ఓనే మహిపాల్ (28) అనుమానాస్పద మృతి కేసు ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. వివాహేతర సంబంధం కారణంగానే మహిపాల్ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు నిర్ధారించారు.ఈ కేసులో నిందితులైన మృతుడి భార్య ఓనే స్వరూప, ఆమె ప్రియుడు గోవరి సుమన్లను పోలీసులు బోధన్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా, న్యాయస్థానం వారికి రిమాండ్ విధించింది.

నిందితులను నిజామాబాదు సెంట్రల్ జైలుకు తరలిస్తున్నట్లు బోధన్ రూరల్ సీఐ విజయ్ బాబు పేర్కొన్నారు. మహిపాల్ మరణం మొదట స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మహిపాల్ మృతికి కోడలే కారణమంటూ మృతుడి తల్లి ఆరోపించడంతో పోలీసులు తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇటీవల అందిన పోస్టుమార్టం నివేదిక ఆధారంగా మహిపాల్ హత్యకాదని, ఆత్మహత్యేనని ప్రాథమికంగా తేలింది.

దర్యాప్తులో భాగంగా పోలీసులు మృతుడి భార్య స్వరూప తో పాటు, బుధవారం గ్రామానికి చెందిన మరికొంత మందిని పిలిపించి లోతుగా విచారించారు. మహిపాల్ భార్య స్వరూప కు, గోపరి సుమన్ కు మధ్య ఉన్న వివాహేతర సంబంధం వల్లే మహిపాల్ తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్ప డ్డాడని,వారు అతడిని ఆత్మహత్యకు ప్రోత్సహించారని ఆధారాలతో సహా నిరూపితమైందని సీఐ తెలిపారు. దీంతో వీరిద్దరిని నిందితులుగా గుర్తిస్తూ పోలీసులు గురువారం రాత్రి కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం వారికి రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చింది.