17 April, 2026 | 3:22 AM

జావిద్‌కు అంతిమ వీడ్కోలు..

17-04-2026 12:00 AM
  1. కన్నీటిపర్వంతమైన కాంగ్రెస్ శ్రేణులు
  2. నివాళ్ళు అర్పించిన డిప్యూటీ సీఎం, మంత్రి తుమ్మల, చైర్మన్లు, నాయకులు 
  3. పార్టీ ఆఫీస్ కు పార్థివదేహం.. నివాళులు అర్పించిన అధ్యక్షుడు 
  4. రెడ్ హిల్స్ నుంచి భారీ అంతిమ యాత్ర.. పాల్గొన్న వేలాది మంది జనం
  5. ఖమ్మం ఖిల్లాలో అంతిమ దహన సంస్కారాలు

ఖమ్మం, ఏప్రిల్ 16 (విజయక్రాంతి): పిసిసి సభ్యులు, ఖమ్మం నగర కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు మొహమ్మద్ జావిద్ కు భావోద్వేగం, కన్నీటి పర్వతం నడుమ కాంగ్రెస్ శ్రేణులు అంతిమ వీడ్కోలు పలికారు. సూర్యాపేటలోని పిల్లలమర్రి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన జావిద్ కు  గురువారం కాంగ్రెస్ శ్రేణులు కన్నీటి వీడ్కోలు పలికారు.

రెడ్ హిల్స్ నుంచి ఇస్లామిక్ సంప్రదాయం ప్రకారం దహన సంస్కారాలు నిర్వహించారు. రెడ్ హిల్స్ నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వరకు భారీగా ర్యాలీ అంతిమ యాత్ర నిర్వహించారు. వేలాది మంది కార్యకర్తలు అంతిమ యాత్రలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ఆఫీస్ లో జిల్లా అధ్యక్షుడు, జావిద్  పార్థివదేహానికి నివాళ్ళు అర్పించారు. అనంతరం ర్యాలీగా ఖమ్మం ఖిల్లాలో దహన సంస్కారాలు చేపట్టారు. 

భావోద్వేగానికి లోనైన డిప్యూటీ సీఎం 

డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క జావిద్ భౌతికకాయానికి నివాళులు అర్పించారు. ఈ క్షణంలో భావోద్వేగాని లోనై కన్నీటి పర్యంతమయ్యారు. అంతిమయాత్రలో పాల్గొన్నారు. దహన సంస్కారాలు పూర్తి అయ్యే వరకు అక్కడే ఉన్నారు. స్నేహితుడికి అంతిమ వీడ్కోలు పలికారు. 

నివాళ్ళు అర్పించిన మంత్రి తుమ్మల, చైర్మన్లు 

  రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం మేయర్ పూనకొల్లు నీరజ, మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్, విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి, గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు జావేద్ భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.  కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు. జావేద్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని వేడుకున్నారు.  జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్, మాజీ అధ్యక్షుడు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, కాంగ్రెస్ నాయకులు మద్ది శ్రీనివాస రెడ్డి, శైరీ, సాదు రమేష్ రెడ్డి, జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకులు నివాళ్ళు అర్పించారు.