17 April, 2026 | 3:22 AM

పేద విద్యార్థులకు రూ.51.35 లక్షల చెక్కులు పంపిణీ

17-04-2026 12:00 AM

 స్ఫూర్తి ఫౌండేషన్ సేవలకు ఎమ్మెల్యే ప్రశంసలు

కల్లూరు,ఏప్రిల్ 16(విజయ క్రాంతి): కల్లూరు మున్సిపాలిటీలోని స్ఫూర్తి ఫౌండేషన్ కార్యాలయంలో పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించే కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా స్ఫూర్తి ఫౌండేషన్ సభ్యులు వరకా రామారావు, మున్సిపాలిటీ చైర్మన్ ధరావత్ మోహన్ నాయక్,ఏఎంసీ చైర్మన్ భాగం నీరజ ప్రభాకర్ చౌదరి, పసుమర్తి చందర్రావు, వార్డు కౌన్సిలర్లు పాల్గొని, వారి చేతుల మీదుగా ఐఐటీ,ఎన్‌ఐటీ, ఎంబీబీఎస్, బీడీఎస్,వెటర్నరీ, నర్సింగ్,బీటెక్ వంటి ఉన్నత విద్యలను అభ్యసిస్తున్న 75 మంది పేద విద్యార్థులకు రూ.51,35,550 విలువైన చెక్కులను వారి తల్లిదండ్రులకు అందజేశారు.

సహాయం పొందిన విద్యార్థులు భవిష్యత్తులో మరో పేద విద్యార్థికి చేయూతనివ్వాలనే సామాజిక బాధ్యతను గుర్తించాలని రామారావు ఎమ్మెల్యే డాక్టర్ రాగమయి దయానంద్ తెలిపారు. పేద విద్యార్థులకు ఆర్థికంగా, విద్యాపరంగా అండగా నిలవడం అత్యంత ప్రశంసనీయమని అన్నారు. వరకా రామారావు సతీమణి సీత రత్నకుమారి దంపతులను ఎమ్మెల్యే శాలువాతో సన్మానించారు.

అదేవిధంగా రఘునాథ బంజారా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ.1,30,000 విలువైన 14 డ్యూయల్ డెస్క్ బెంచీలను ఎమ్మెల్యే రాగమయి,సర్పంచ్ సుధారాణి రానా,ప్రతినిధి వరకా రామారావు కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ వైస్ చైర్మన్ శీలం కోటేశ్వరి, రఘునాథగూడెం సర్పంచ్ కుక్క సుధారాణి రానా, ఉప సర్పంచ్ కర్నాటి కోటేశ్వరి రామకృష్ణారెడ్డి, ఎస్త్స్ర హరిత,హెచ్‌ఎం సురేష్ బాబు,మున్సిపల్ కౌన్సిలర్లు, ఫౌండేషన్ సభ్యులు, ఉపాధ్యాయులు,ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు,గ్రామ పెద్దలు, విద్యార్థులు,తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.