6 March, 2026 | 6:04 AM

మున్సిపల్ పోరులో ‘బోగస్’ ఓట్ల కలకలం

06-03-2026 02:29 AM

ప్రజాస్వామ్యానికే సవాల్!

రికార్డుల్లో లేని ఇల్లు.. జాబితాలో 18 ఓట్లు! 

కోర్టు మెట్లెక్కిన కాంగ్రెస్ అభ్యర్థి కృష్ణ నాయక్

కోర్టు నిర్ణయం పై ప్రజల్లో ఉత్కంఠ 

ఆమనగల్లు, మార్చి 5 (విజయక్రాంతి): ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం.. కానీ అదే ఓటు అక్రమ మార్గంలో నమోదైతే అది నిజమైన ప్రజా తీర్పును వెక్కిరిస్తుంది. ఆమనగల్లు మున్సిపాలిటీలో ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలపై ఇప్పుడు ఇలాంటి నీలినీడలే కమ్ముకున్నాయి. అక్రమ ఓట్లు, ద్వంద్వ ఓటింగ్ విధానం మున్సిపల్ పీఠాన్ని శాసించాయని బాధితులు గళమెత్తుతున్నారు. కేవలం ఒక వార్డులోనే కాదు, మున్సిపాలిటీ వ్యాప్తంగా వేల సంఖ్యలో బోగస్ ఓట్లు ఉన్నాయనే ఆరోపణలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.

అసలు ఉనికిలో లేని ఇంటి నెంబర్.. విస్తుపోయే నిజాలు!..

మున్సిపల్ ఎన్నికల్లో జరిగిన అక్రమాలకు 7వ వార్డు ఒక నిదర్శనంగా నిలుస్తోంది. మున్సిపల్ రికార్డుల ప్రకారం అసలు ఉనికిలోనే లేని 14-182 అనే ఇంటి నెంబ్ప ఏకంగా 15 నుండి 18 ఓట్లు నమోదయ్యాయి. సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన వివరాల ప్రకారం, ఆ నెంబర్ గల ఇల్లు మున్సిపాలిటీ పరిధిలో లేదని అధికారులు స్వయంగా ధృవీకరించడం గమనార్హం. లేని ఇంటికి ఓట్లు ఎలా వచ్చాయన్నది ఇప్పుడు అధికారుల పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.

బోగస్ ఓట్ల తోనే తాను ఓటమిపాలయ్యానని  కృష్ణ నాయక్ హైకోర్టును ఆశ్రయించాడు. 7వ వార్డులో కేవలం 23 ఓట్ల స్వల్ప తేడాతో ఓటమి పాలైన కాంగ్రెస్ అభ్యర్థి కృష్ణ నాయక్ ఈ అక్రమాలపై సమరశంఖం పూరించారు. ఈ వార్డులోమొత్తం ఓట్లు 956 ఉండగా 751 ఓట్లు పోల్ అయ్యాయి.ప్రధాన అభ్యర్థులకు వచ్చిన ఓట్ల వివరాలను పరిశీలిస్తే నిరంజన్ (బీజేపీ) 292 ఓట్లు,కృష్ణ నాయక్ (కాంగ్రెస్) 269 ఓట్లు,కిషోర్ (బిఆర్‌ఎస్)182 ఓట్లు వచ్చాయి. అయితే బోగస్ ఓట్ల వల్లే తన విజయావకాశాలు దెబ్బతిన్నాయని, అర్హత లేని వ్యక్తులు ఓటు హక్కు వినియోగించుకున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆయన బుధవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

పంచాయతీలోనూ..  మున్సిపాలిటీలోనూ..

ఆమనగల్లు మున్సిపాలిటీ వ్యాప్తంగా 15 వార్డు ల్లో దాదాపు 2,000 నుండి 3,000 బోగస్ ఓట్లు ఉన్నట్లు ఓడిపోయిన అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. సమీప గ్రామ పంచాయతీలకు చెందిన ఓటర్లు అటు పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేయడమే కాకుండా, ఇటు మున్సిపల్ ఎన్నికల్లోనూ అక్రమంగా ఓట్లు నమోదు చేయించుకున్నారు. కొందరు ఓటర్లు ఒకేసారి రెండు వార్డుల్లో ఓటు హక్కువినియోగించుకున్నట్లు ప్రాథమిక ఆధారాలు వెల్లడిస్తున్నాయి.ఈ అక్రమాలపై కృష్ణ నాయక్ పోరాటాన్ని ఉధృతం చేశారు. గురువారం ఆయన ఆదివాస సంఘాల నాయకులతో కలిసి ఎన్నికల కమిషన్ సూపరింటెండెంట్తో పాటు జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ని కలిసి వినతిపత్రం అందజేశారు. ఒకే ఇంటి నెంబ్ప 18 ఓట్లు ఎలా వచ్చాయో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

ఉత్కంఠలో ఆమనగల్లు ప్రజలు..

మొత్తం 15 వార్డులకు గానూ బీ ఆర్ ఎస్ 8, బీజేపీ 6 స్థానాలు దక్కించుకోగా అధికార కాంగ్రెస్ పార్టీ కేవలం ఒకే ఒక స్థానానికి పరిమితం కావడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు సైతం దారితీసింది. ఓటరు జాబితా రూపకల్పనలో క్షేత్రస్థాయి పరిశీలన లోపించడం వల్లే ఈ అరాచకం జరిగిందని బాధితులు మండిపడుతున్నారు. హైకోర్టు ఈ వ్యవహారాన్ని ఎలా పరిగణనలోకి తీసుకుంటుంది? విచారణ చేపట్టి బోగస్ ఓట్లను తొలగిస్తారా? లేక రీ-పోలింగ్కు ఆదేశిస్తారా? అనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.