వాడీవేడిగా సర్వసభ్య సమావేశం
అధికారుల అలసత్వంపై ప్రజాప్రతినిధుల నిలదీత
విద్య, వైద్యం, విద్యుత్ శాఖల రివ్యూలో తీవ్ర వాగ్వాదం
జెడ్పీ చివరి సమావేశంలో సభ దృష్టికి అనేక సమస్యలు
హాజరైన చైర్‌పర్సన్ తీగల అనితా రెడ్డి, కలెక్టర్ శశాంక
రంగారెడ్డి, జూన్ 11 (విజయక్రాంతి) : రంగారెడ్డి జిల్లా సర్వసభ్య సమావేశం వాడీవేడిగా కొనసాగింది. జిల్లాలోని విద్య, వైద్యం, విద్యుత్ శాఖల అధికారుల పనితీరుపై ప్రజాప్రతినిధులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సంబంధిత శాఖల అధికారులు విధి నిర్వహణలో తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తున్నారని పలువురు జెడ్పీటీసీలు ఆరోపించారు. తమ మండలాల పరిధిలో ప్రజా సమస్యలపై సంబంధిత అధికారులను సంప్రదిస్తే కనీసం ఫోన్ కూడా ఎత్తడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
మండలాల్లో నెలకొన్న సమస్యలు తీర్చాలని జిల్లా కలెక్టర్, జెడ్పీ చైర్‌పర్సన్‌కు మొరపెట్టుకున్నారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ సమా వేశ మందిరంలో జెడ్పీ చైర్‌పర్సన్ తీగల అనితాహరినాథ్‌రెడ్డి ఆధ్యక్షతన జిల్లా ప్రజాపరిషత్ చివరి సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ శశాంక, అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ తీగల అనితారెడ్డి మాట్లాడుతూ.. ఇదే చివరి సర్వసభ్య సమావేశమని, గడచిన ఐదేళ్లు ఎన్నో సమస్యలు తీర్చామని గుర్తు చేశారు. అంతకు ముందు శాఖల వారీగా నిర్వహించిన సమీక్ష సమావేశంలో ప్రజాప్రతినిధులు పలు సమస్యలు లేవనెత్తారు.
మండలాల్లో రైతువేదికలు నిరుపయోగంగా ఉన్నాయని, వాటిని వినియోగంలోకి తీసుకురావాలని కోరారు. కల్తీ విత్తనాలను అరికట్టాలని, విత్తనాల కొరత లేకుండా చూడాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సరైన డాక్టర్లు, సంబంధిత సిబ్బంది అందుబాటులో లేరని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని విన్నవించారు. జిల్లాలో విద్య, వైద్యంకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. అన్ని శాఖల్లో డిప్యూటేషన్లను వెంటనే రద్దు చేయాలని కోరుతూ అందుకు సంబంధించి ఏకవాఖ్య తీర్మానం చేశారు.
ప్రభుత్వ పాఠశాల్లో పలు సమస్యలు నెలకొన్నాయని, ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉందని, స్కావెంజర్ల సమస్య తీవ్రంగా ఉంద ని వెంటనే వారిని నియమించాలని సభ్యు లు కోరారు. మరోవైపు, కరెంట్ సమస్య గ్రామాల్లో తీవ్రంగా ఉందని, సంబంధిత ఏఈలు, లైన్‌మెన్లు స్పందించడం లేదని విరిగిన విద్యుత్ స్తంబాలు, ఒరిగిన స్తంబాలను సరిచేయాలని సూచించారు. మిషన్ భగీరథ ద్వారా మంచినీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తున్నాయని సభ దృష్టికి తీసుకొచ్చారు. సభ్యులు లేవనిత్తిన అంశాలపై ఆయా శాఖ ల అధికారులు, కలెక్టర్ సమాధానమిచ్చారు.
ఆర్టీసీ తీరుతో మహిళల్లో వ్యతిరేకత
కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆరుగ్యారంటీల అమలు తీరుపై అధికార పార్టీ నేతలే పెదవి విరుస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఆర్టీసీ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఉచిత బస్సు ప్రయాణం పథకంపై మహిళల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుందని ఫరుఖ్‌నగర్ జెడ్పీటీసీ వెంకటారా మిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు అధికంగా బస్టాండులో నిలిచి ఉన్న చోట ఆర్టీసీ బస్సులు నిలపడం లేదని, తద్వారా ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని తెలిపారు.
నిరసనకు దిగిన కడ్తాల జెడ్పీటీసీ
కడ్తాల జెడ్పీటీసీ దశరథ్ నాయక్ సభ ఆవరణలో కొద్దిసేపు నిరసనకు దిగారు. కడ్తాల మండలంలో నూతనంగా నిర్మించిన కస్తుర్బా విద్యాలయానికి విద్యుత్ కనెక్షన్ ఇవ్వడంలో అధికారులు తీవ్ర జాప్యం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలలు పునఃప్రారంభం అవుతున్నప్పటికీ విద్యుత్ కనెక్షన్ ఇవ్వడం లేదని వాపోయారు. విద్యుత్ కనెక్షన్ కోసం నెల రోజల క్రితమే రూ.6 లక్షల డీడీ చెల్లించామన్నారు. దీనిపై స్పందించిన కలెక్టర్.. పాఠశాలకు వెంటనే విద్యుత్ కనెక్షన్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో జెడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేష్, డిప్యూటీ సీఈఓ రంగారావు, కోఆప్షన్ సభ్యులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు పాల్గొన్నారు.






