15 July, 2026 | 2:43 AM

గ్లోబల్ లీడర్ కేన్స్ కంపెనీ

24-08-2024 03:55 AM
  1. హైదరాబాద్‌లో కంపెనీ ఏర్పాటు సంతోషకరం
  2. ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
  3. కొంగరకలాన్‌లో ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం

ఇబ్రహీంపట్నం, ఆగస్టు 23 (విజయక్రాంతి): ఎలక్ట్రానిక్ సిస్టమ్ డిజైన్, మాన్యుఫ్యాక్చరింగ్ సొల్యూషన్స్‌లో గ్లోబల్ లీడర్ అయిన కేన్స్ కంపెనీ హైదరాబాద్‌లో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం సంతోషకరమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొంగరకలాన్‌లో కేన్స్ ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీని శుక్రవారం ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు.

ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. దేశంలో 7 రాష్ట్రాలలో కేన్స్ టెక్నాలజీ సంస్థ విస్తరించి ఉందని, ఇప్పుడు రాష్ట్రంలో ఏర్పాటు చేయడం శుభపరిణామమని అన్నారు. 2018 కోట్ల పెట్టుబడితో హై ఎలక్ట్రానిక్ అసెంబ్లీ, 3డీ ఆప్టికల్, ఆర్టిఫిషియల్ ఇంలిజెన్స్ ఎనేబుల్ అత్యాధునిక తనిఖీ వ్యవస్థలు, లీడ్ ఆర్‌వోహెచ్‌ఎస్  ప్రాసెస్‌లు సహా తయారీ సాంకేతికత కలిగి ఉంటుందని చెప్పారు. కొంగకరలాన్‌లో సంస్థ ఏర్పాటు చేయడం ద్వారా ఈ ప్రాంతంలోని 2 వేల మంది యువతకు ఉపాధి లభిస్తుందని తెలిపారు.

ఇటీవల ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేసిందిని, దీంతో  ఈ ప్రాంతం ఫోర్త్ సిటీగా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. కార్యక్రమంలో కలెక్టర్ శశాంక, కేన్స్ టెక్నాలజీ సంస్థ చైర్మన్ సబిత రమేశ్, ఎండీ రమేశ్ కణ్ణన్, సీఈవో రఘు పాణికర్, రాష్ట్ర మౌలిక, పారిశ్రామిక కల్పన సంస్థ వైస్ చైర్మ న్ విష్ణువర్దన్ రెడ్డి, ఆదిభట్ల మున్సిపల్ చైర్మ న్ మర్రి నిరంజన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.