వర్గీకరణను అమలు చేయండి
విద్యా, ఉద్యోగాల భర్తీలో న్యాయం చేయండి
మంత్రులు పొంగులేటి, కోమటిరెడ్డి, తుమ్మలకు ఎమ్మార్పీఎస్ విజ్ఞఫ్తి
మంత్రి దామోదర నేతృత్వంలో మంత్రులను కలిసిన మంద కృష్ణ మాదిగ, మోత్కుపల్లి
హైదరాబాద్, ఆగస్టు 23 (విజయక్రాంతి): ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను వెంటనే అమల్లోకి తీసుకొచ్చేందుకు ప్రత్యేక చొరవ చూపాలని రాష్ట్ర మంత్రులకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ విజ్ఞప్తి చేశారు. మంత్రి దామోదర రాజనరసింహ నేతృత్వంలో మంద కృష్ణ మాదిగ, మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు, మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేల బృందం శుక్రవారం మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావును కలిశారు.
ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలు రాష్ట్రాలకే అధికారం ఉందని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం స్వాగతించిందని, ఈ నేపథ్యంలో తక్షణమే అమల్లోకి తీసుకురావాలని విన్నవించారు. ప్రస్తుతం విద్యా, ఉద్యోగాల భర్తీ జరుగుతున్నందున ఎస్సీ వర్గీకరణ అమలు చేయడంతో మాదిగలు, మాదిగ ఉప కులాలకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం హర్యానాలో ఎస్సీ వర్గీకరణ కోసం ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకున్నదని గుర్తుచేశారు. వర్గీకరణ రద్దు అయిన తర్వాత గత 20 ఏళ్లుగా విద్యా, ఉద్యోగాల్లో మాదిగలు, మాదిగ ఉప కులాలకు తీవ్ర అన్యాయం జరిగిందని మంద కృష్ణ మాదిగ వివరించారు.
ప్రస్తుత ఉద్యోగాల మీద మాదిగ బిడ్డలు ఎంతో ఆశలు పెట్టుకుని ఉన్నారని, రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రక్రియను పూర్తి చేసి అమల్లోకి తీసుకురావాలని కోరారు. వర్గీకరణ అమలు అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి త్వరగా అమలయ్యేలా చూస్తామని మంత్రులు హామీ ఇచ్చినట్టు మంద కృష్ణ మాదిగ తెలిపారు. మంత్రులను కలిసిన వారిలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, కాలే యాదయ్య, కవ్వంపల్లి సత్యనారాయణ, తోట లక్ష్మీకాంతారావు, మందుల సామేలు, మాజీ ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ నరేశ్, కాంగ్రెస్ నేతలు కొండేటి మల్లయ్య, ముంజగళ్ల విజయ్ తదితరులు ఉన్నారు.






