ఆదర్శ వంతురాలు అశ్విని
ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పించిన ప్రభుత్వ టీచర్
కేసముద్రం, జూన్ 17 (విజయక్రాంతి): ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్న అశ్విని, వెంకటేష్ దంపతులు తమ ఇద్దరు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ఆదర్శవంతులుగా నిలిచారు. కేసముద్రం మండలం గాంధీనగర్ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులగా పనిచేస్తున్న అశ్విని, వెంకటేష్ దంపతులు తమ ఇద్దరు పిల్లలు ఈశాంత్, పూర్వజలను తాము నివసిస్తున్న కల్వల ఆవాస ప్రాంతంలో ఉన్న మండల పరిషత్ పాఠశాలలో బుధవారం చేర్పించి స్ఫూర్తిదాయకంగా నిలిచారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము కూడా చిన్నతనంలో ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నామని, తమలాగే తమ పిల్లలను కూడా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించామని, ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య బోధనతో పాటు ప్రభుత్వం ఉచితంగా అన్ని రకాల సౌకర్యాలు వసతులు కల్పిస్తుందని, ఫీజుల భారం ఉండదని, బడి ఈడు పిల్లలను ప్రభుత్వ బడిలోనే చేర్పించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో హెడ్మాస్టర్ వీరారెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.






