రూ.25.13 లక్షల కోట్ల నష్టం
- యుద్ధం మా ఖజానాను ఖాళీ చేసింది ఇరాన్
- ఇరాన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి ఫాతిమా
- ఐదు గల్ఫ్ దేశాలపై ఐరాసలో ఫిర్యాదు
టెహ్రాన్, ఏప్రిల్ ౧౪: అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా చేపట్టిన దాడుల కారణంగా ఇరాన్ దారుణంగా నష్టపోయింది. దాడుల్లో అభం శుభం ఎరుగని వందలాది మంది పిల్లలు కన్నుమూశారు. వేలాది మంది అమయాక పౌరులు మృత్యువాత పడ్డారు. ఇదంతా ఒకవైపు అయితే, మరోవైపు ఇరాన్ ఆర్థికంగానూ ఎంతో నష్టపోయింది. ప్రాథమిక అంచనాల ప్రకారం.. సుమారు నెలన్నర పాటు జరిగిన యుద్ధంలో 270 బిలియన్ డాలర్లు.. అంటే భారత కరెన్సీలో అక్షరాలా రూ.25.13 లక్షల కోట్లు నష్టపోయినట్లు ఇరాన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి ఫాతిమా మొహాజెరానీ మంగళవారం ప్రకటించారు.
యుద్ధం తమ ఖజానాను ఖాళీ చేసిందని వాపోయారు. తుది అంచనాలపై తమ ప్రభుత్వం విచారణ జరుపుతున్నదని, త్వరలోనే పూర్తి నష్టం అంచనాకు వస్తుందని వెల్లడించారు. యుద్ధం తమ దేశంలోని మౌలిక సదుపాయాలను తీవ్రంగా ధ్వంసం చేసిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్థిక నష్టాల నుంచి తాము కోలుకునేందుకు అంతర్జాతీయంగా సహాయ, సహకారాలు అవసరమని ఉద్ఘాటించారు.
హోర్ముజ్ మూసివేత ఎఫెక్ట్..
హోర్ముజ్ జలసంధి మూసివేత కారణంగా రోజుకు 435 మిలియన్ డాలర్ల చొప్పున.. అంటే భారత కరెన్సీలో అక్షరాలా రూ.౪,౦౦౦ కోట్లు నష్టపోతున్నది. జలసంధి దిగ్బంధనం వల్ల ప్రస్తుతం ఇరాన్ ఎగుమతుల్లో రోజుకు సుమారు 276 మిలియన్ డాలర్లు, దిగుమతుల్లో 159 మిలియన్ డాలర్ల నష్టాన్ని చవి చూస్తున్నది. ఇలా మొత్తంగా ఒక నెలకు 13 బిలియన్ డాలర్ల వరకు నష్టం జరుగుతుంది.
ఆ దేశ వాణిజ్యంలో 90 శాతం పర్షియన్ గల్ఫ్ ద్వారానే జరుగుతుంది. అందులో చమురు, గ్యాస్ వాటా 80 శాతం. దేశ జీడీపీలో ఈ వాటా 23.7 శాతం. ఇరాన్ అధీనంలోని ఖర్గ్ ఐలాండ్ ఒక్కటే ఏడాదికి 53 బిలియన్ డాలర్ల ఆదాయాన్నిస్తుంది. అమెరికా జలసంధిని మూసివేస్తే మొత్తంగా ఇరాన్ ఆదాయాన్ని కోల్పోవాల్సి వస్తుంది. పోర్టులు అమెరికా దిగ్బంధిస్తే నష్ట తీవ్రత ఇంకా ఊహించని రీతిలో ఉంటుంది.
3375 మంది ఇరానీయన్లు మృతి
అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా చేసిన దాడుల్లో 3,375 మంది ఇరానీయన్లు మృతిచెందినట్లు ఇరాన్ ఫోరెన్సిక్ మెడిసిన్ ఆర్గనైజేషన్ చీఫ్ అబ్బాస్ మస్జేది అరానీ ఓ ప్రకటనలో స్పష్టం చేశారు.
ఐదు దేశాల పరిహారం డిమాం
అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తం చేసిన దాడుల కారనంగా తామెంతో నష్టపోయామని, ఈ దాడులకు సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, బహ్రెయిన్, జోర్డాన్ సహకరించి అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించాయని, అందుకే తమకు ఆయా దేశాలు నష్టపరిహారం చెల్లించాలని ఇరాన్ తాజాగా ఐక్యరాజ్యసమితికి ఫిర్యాదు చేసింది. ఈమేరకు ఆ దేశాలకు నోటీసులు జారీ చేసింది.
ఫిర్యాదుపై ఐరాస ఇరాన్ రాయబారి అమీర్ సయీద్ ఇరవానీ ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. సుమారు నెలన్నర పాటు సాగిన యుద్ధంలో అమెరికా, ఇజ్రాయెల్‌కు సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, బహ్రెయిన్, జోర్డాన్ సహకరించాయని, ఆయా దేశాల భూభాగాలను, గగనతలాలను తమపై దాడి చేసేందుకు సహకరించాయని పేర్కొన్నారు. ఇరాన్‌కు జరిగిన భౌతిక, నైతిక నష్టాలకు ౫ దేశాలే పూర్తి బాధ్యత వహించి, నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.






