జాతీయ రహదారిపై సంత.. పొంచి ఉన్న ప్రమాదం!

16-09-2026 | 05:25am
  1. పట్టించుకోని ప్రజాప్రతినిధులు, అధికారులు
  2. రహదారిపైనే వ్యాపారాలు.. అస్తవ్యస్తంగా వాహనాల రాకపోకలు

బూర్గంపాడు, సెప్టెంబర్15 (విజయక్రాంతి): జాతీయ రహదారి(National Highway)పై సంత నిర్వహణ(Market Management)తో ప్రమాదం పొంచి ఉంది. బూర్గంపాడు మండలం(Burgampadu Mandal) సారపాకలో వారాంతపు సంత రహదారిపైనే కొనసాగుతుండటంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారికి ఇరువైపులా వ్యాపారులు దుకాణాలు(Traders and shops) ఏర్పాటు చేయడంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది.

సంత రోజుల్లో కూరగాయలు, పండ్లు(Vegetables and fruits), ఇతర వస్తువుల విక్రయదారులు రహదారి అంచుల వరకు దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారు. కొనుగోలుదారులు సైతం రోడ్డుపైనే నిలిచి వస్తువులు కొనుగోలు చేస్తుండటంతో వాహనాలు వెళ్లేందుకు ఇరుకైన మార్గమే మిగులుతోంది. దీంతో తరచూ ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

ఎప్పుడు ఏం జరుగుతుందో?

సారపాక మీదుగా నిత్యం భారీ సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ముఖ్యంగా బస్సులు, లారీలు, ఇతర భారీ వాహనాలు ప్రయాణించే సమయంలో రహదారిపై సంత ఉండటం ప్రమాదకరంగా మారుతోంది. వాహనం అదుపుతప్పినా, అకస్మాత్తుగా పాదచారి రోడ్డుపైకి వచ్చినా తీవ్ర ప్రమాదం జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పట్టించుకునే నాథుడేరీ?

సంత నిర్వహణకు ప్రత్యామ్నాయ స్థలం ఏర్పాటు చేయడం లేదా ట్రాఫిక్కు ఇబ్బంది లేకుండా వ్యాపారాలను క్రమబద్ధీకరించడం వంటి చర్యలు చేపట్టాల్సిన ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. సమస్యపై పలుమార్లు దృష్టికి తీసుకెళ్లినా శాశ్వత పరిష్కారం చూపడం లేదని స్థానికులు వాపోతున్నారు.

ప్రమాదం జరిగాకే మేల్కొంటారా?

జాతీయ రహదారిపై సంత నిర్వహణకు కట్టడి చేసి, వ్యాపారులకు ప్రత్యేక స్థలం కేటాయించాలని స్థానికులు కోరుతున్నారు. ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు చేపట్టడంతో పాటు రహదారిపై ఆక్రమణలను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. అధికారులు ముందస్తు చర్యలు చేపట్టి ప్రమాదాలను నివారించాలని కోరుతున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత స్పందించే పరిస్థితి రాకముందే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

మరిన్ని వార్తలు