తెలంగాణలో గుండారాజ్

16-09-2026 | 05:30am

పోలీస్‌స్టేషన్లలోనే దాడులా?

  1. నా పీఏ, పీఆర్వోలపై 15 మందితో దాడులు చేయిస్తారా? 
  2. ఫిర్యాదు చేసినా ఎఫ్‌ఐఆర్ నమోదుచేయని దౌర్భాగ్యం
  3.    22 ఏ అక్రమాలపై న్యాయ విచారణ జరపాలి 
  4. ఢిల్లీలో బీఆర్‌ఎస్ నేత కేటీఆర్

హైదరాబాద్, సెప్టెంబర్ 15 (విజయక్రాంతి): రాష్ట్రంలో గుండారాజ్ నడుస్తోందని, శాంతిభద్రతలు(Law and order) పూర్తిగా దిగజారాయని.. పోలీస్‌స్టేషన్ల(Police stations)లోనే దాడులకు తెగబడే స్థాయికి కాంగ్రెస్ అరాచక పాలన చేరిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) తీవ్రస్థాయి లో ధ్వజమెత్తారు. ప్రజల చేత రెండుసార్లు ముఖ్యమంత్రి(Chief Minister)గా ఎన్నికై, తెలంగాణ సాధించిన ఉద్యమనేత(Movement leader), ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్(KCR) ఇంటిపైకి వేలమంది గూండాలను పంపించి దాడి చేయించిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు ఏకంగా పోలీస్ స్టేషన్లనే అడ్డాగా చేసుకుని హత్యాకాండకు తెరలేపిందని మండిపడ్డారు.

సైఫాబాద్ పోలీస్ స్టేషన్(Saifabad Police Station) లో కేటీఆర్ పీఆర్‌వో, పీఏలపై(KTR PRO, PAs) దాడి జరిగిందని బీఆర్‌ఎస్ నాయకులు(BRS leaders) ఆరోపించారు.  ఈ విషయంపై మంగళవారం ఢిల్లీలో ఉన్న కేటీఆర్.. అక్కడ మీడియా సమావేశంలో ప్రభుత్వ చర్యలను ఎండగట్టారు. కేసీఆర్ ఇంటిపై దాడిని అడ్డుకునేందుకు వెళ్లిన తమను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించి, అక్కడ తమపైకి గూండాలను ఉసిగొల్పారని కేటీఆర్ గుర్తుచేశారు. ఆ దుర్మార్గం చాలదన్నట్లు, నిన్న విచారణ పేరుతో స్టేషన్‌కు పిలిపించి తన పీఆర్‌ఓ మహేష్ ముదిరాజ్, పీఏ మహేందర్ రెడ్డిలపై 15 మందితో దాడి చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆ 15 మంది గూండాలా? లేక పోలీసులా? అనేది తేలాలని డిమాండ్ చేశారు. బాధితుల తరపున ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని పార్టీ నాయకులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు వెళ్లి ఐదు గంటల పాటు నిలదీసి జీరో ఎఫ్‌ఐఆర్ చేయమన్నా పోలీసులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేయలేని అత్యంత ఘోరమైన, దిగజారిన పరిస్థితులు నేడు తెలంగాణలో నెలకొన్నాయని విమర్శించారు.

న్యాయస్థానాల్లో తేల్చుకుంటాం..

తెలంగాణలో పోలీస్ శాఖ అధికార పార్టీ తొత్తుగా మారి, కాంగ్రెస్ కార్యకర్తల కంటే హీనంగా వ్యవహరిస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. ఠాణాలోనే దాడులు చేస్తున్న దుండగులకు పోలీసులు వత్తాసు పలుకుతూ రక్షణగా నిలుస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర పోలీసు వ్యవస్థను నమ్ముకుంటే న్యాయం జరగదని ప్రజలకు, తమకు పూర్తిగా అర్థమైందని, అందుకే న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నామని స్పష్టం చేశారు. కోర్టుల్లో తమకు తప్పకుండా న్యాయం జరుగుతుందన్న విశ్వాసం ఉందని పేర్కొన్నారు.

తాము ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే, ప్రజలకు సమాధానం చెప్పుకోలేక నిరాశ, నిస్పృహలతోనే రోజుకో అంశాన్ని తెరపైకి తెస్తూ ‘అటెన్షన్ డైవర్షన్’ రాజకీయాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే భౌతిక దాడులకు దిగుతోందని, ఇలాంటి బెదిరింపులకు బీఆర్‌ఎస్ కార్యకర్తలు ఎవరూ భయపడే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు. ప్రజా క్షేత్రంలోనే ఈ అరాచక సర్కారుకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని తేల్చిచెప్పారు.

న్యాయ విచారణ జరపాలి..

22 ఏ కింద లక్షల ఎకరాలను నిషేధిత జాబితాలో చేర్చి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. 30 శాతం కమిషన్ల కోసం చేస్తున్న చిల్లర ప్రయత్నాలను ప్రభుత్వం నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ పర్యటనకు ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. 22 ఏ అంశంపై అసెంబ్లీలో ప్రభుత్వం సరైన సమాధానం ఇస్తుందనుకుంటే రెవెన్యూ మంత్రి కేవలం ‘సారీ’తో సరిపెట్టారని విమర్శించారు.  తప్పు చేసింది అధికారులు కాదు.. ప్రభుత్వమే అని ఆరోపించారు.

ప్రజల సమస్యలను పరిష్కరించకుండా అధికారులపై నెపం నెట్టడం సరికాదన్నారు. ప్రజలు తమ కష్టార్జితంతో కొనుగోలు చేసిన నివాసాలను నిషేధిత జాబితా నుంచి బేషరతుగా తొలగించి, బాధితులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ధరణి వ్యవస్థ ప్రజల ఆస్తులకు రక్షణ కవచంలా ఉండేదని కేటీఆర్ పేర్కొన్నారు. యజమాని వేలిముద్ర లేకుండా ఆస్తి బదలాయింపు అసాధ్యంగా ఉండేదని, నేడు యజమానులకు తెలియకుండానే రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని ఆరోపించారు. ‘ఇది భూభారతి కాదు.. భూ హారతి’ అని వ్యాఖ్యానించారు.

రెండేళ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం వస్తుందని, తప్పు చేసిన వారిని వదిలిపెట్టమని హెచ్చరించారు. ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అంశాల నుంచి తప్పించుకునేందుకే బీఆర్‌ఎస్ సభ్యులను శాసనసభ, మండలి నుంచి సస్పెండ్ చేసిందని విమర్శించారు. అయినా తాము ప్రజల్లోనే ఉంటామన్నారు. ప్రజల సంక్షేమం కోసం పోరాడుతామన్నారు. 22 ఏ వ్యవహారంపై జ్యుడీషియల్ ఎంక్వైరీ జరిగితే అందరికీ మంచిదేనని కేటీఆర్ అన్నారు. 

మరిన్ని వార్తలు