ఎస్సీ, ఎస్టీ సంక్షేమానికి పెద్దపీట
గురుకులాల్లో కేంద్రీకృత యంత్రాల వంటశాలలు
విద్యకు ఎంత ఖర్చయినా వెనుకాడేది లేదు
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్, సెప్టెంబర్ 15 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల సంక్షేమం, అభ్యున్నతికే ప్రజా ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తుందని, విద్యారంగ అభివృద్ధికి ఎన్ని నిధులైనా ఖర్చు చేయడానికి వెనుకాడబోమని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) స్పష్టం చేశారు.
ఇందిరమ్మ రాజ్యంలో పేద, బహుజన వర్గాల భవిష్యత్తును తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. సోమవారం హైదరాబాద్లోని ప్రజా భవన్లో ఎస్సీ, ఎస్టీ సంక్షేమంపై డిప్యూటీ సీఎం ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ హాజరయ్యారు.
సంక్షేమ పథకాల అమలు, గురుకులాల నిర్వహణ, విద్యా మౌలిక వసతులు, స్వయం ఉపాధి, స్కాలర్షిప్లు, స్టడీ సర్కిళ్లు, తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. గత పదేళ్లలో అధికారంలో ఉన్న ప్రభుత్వం యువశక్తిని నిర్వీర్యం చేసిందని, సంక్షేమ శాఖల కార్పొరేషన్ల ద్వారా యువతకు అవసరమైన ప్రోత్సాహకాలు అందించలేదని విమర్శించారు.
తమ ప్రభుత్వం యువతకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉందని, రాజీవ్ యువ వికాసం పథకానికి బడ్జెట్లో నిధులు కేటాయించామని చెప్పారు. నవంబర్ 19 నుంచి లబ్ధిదారులకు స్వయం ఉపాధి యూనిట్ల కోసం తొలి విడతగా రూ.లక్ష వరకు ఆర్థిక సహాయం అందించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎస్సీ గురుకుల పాఠశాలల్లో కేంద్రీకృత యంత్రాల వంటశాలలు ఏర్పాటు చేసే ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ ఆధునిక వంటశాలల నిర్వహణ, యంత్రాల కొనుగోలు కోసం బడ్జెట్లో ఇప్పటికే రూ. 25 కోట్లను కేటాయించినట్లు గుర్తుచేశారు. ఎస్సీ స్టడీ సర్కిళ్లపై చేసిన వ్యయం, ఎంపికైన అభ్యర్థుల సంఖ్య, వారికి అందించిన శిక్షణ, సాధించిన ఫలితాలపై ఆరా తీశారు.
సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 30 డిగ్రీ కళాశాలల్లో పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులను ప్రవేశపెట్టే అంశాన్ని అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. గిరిజన విద్యార్థులకు మెరుగైన విద్యా సదుపాయాలు అందించేలా పాఠశాలల నిర్మాణం, మౌలిక వసతులపై కూడా సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో సోషల్ వెల్ఫేర్ సెక్రెటరి విజయేంద్రబోయి, ట్రైబల్ వెల్ఫేర్ స్పెషల్ సెక్రెటరి సంతోష్ , ఎస్సీ కార్పొరేషన్ వైస్ చైర్మెన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మల్లయ్య బట్టు తదితరులు పాల్గొన్నారు.