రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలు
- కావాలనే కేటీఆర్ సిబ్బందిని పీఎస్‌లో ఉంచారు
బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి
ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్
హైదరాబాద్, సెప్టెంబర్ 15(విజయక్రాంతి): రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ (Law and Order)పూర్తిగా విఫలమైందని, ప్రజలను కాపాడే పరిస్థితిలో పోలీసులు లేరని, మనల్ని మనమే కాపాడుకోవాలని ప్రజలను అప్రమత్తం చేస్తున్నామని బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ (BRS General Secretary Dr. RS Praveen Kumar)పేర్కొన్నారు.
సోమవారం సైఫాబాద్‌లో జరిగిన సంఘటన దేశ చరిత్రలోనే సిగ్గు మాలిన ఘటన అని అన్నారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేటీఆర్ సిబ్బందిపై జరిగిన దాడిపై ప్రవీణ్‌కుమార్ స్పందిస్తూ ఇది ప్లాన్ ప్రకారమే జరిగిన దాడి అని అన్నారు. కావాలనే పోలీసులు కేటీఆర్ పీఆర్‌ఏ,పీఏని పోలీస్ స్టేషన్‌లో ఉంచారన్నారు.
పోలీస్ స్టేషన్ ముందు 15 మంది మాస్క్ లు పెట్టుకుని అనుమానంగా తిరిగారని,వారంతా పీఎస్ లోపలికి వస్తుంటే ఎందుకు అడ్డుకోలేదని ప్రవీణ్‌కుమార్ ప్రశ్నించారు. డీజే పర్మిషన్ కోసమైతే అందమంది రారని, వారు కేటీఆర్ సిబ్బందిపై దాడి చేసేందుకే వచ్చారని పేర్కొన్నారు. వారిని అక్కడ ఉన్న ఓ ఇన్‌స్పెక్టర్ అడ్డుకున్నట్లు చేయగా.. వారు పారిపోయారని, మరి పోలీసులు ఎందుకు పట్టుకోలేదన్నారు.
డీసీపీ శిల్పవల్లి స్పందించి సమాధానం ఇవ్వాలన్నారు. మేము పెట్టిన అన్ని కేసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని, మా కేసులు నమోదుపై ప్రత్యేకంగా సిట్ వేయాలని, కేసులు నమోదు చేసే వరకు పోరాడుతామని స్పష్టం చేశారు. సమావేశంలో బీఆర్‌ఎస్ నాయకులు పల్లె రవికుమార్,అరుణ, సాయితేజరావు, కల్వకుర్తి శ్రీనివాస్ యాదవ్, ఇబ్రహీం పాల్గొన్నారు.