మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకటించాలి
- నిరుద్యోగుల డిమాండ్
- దిల్‌సుఖ్‌నగర్‌లో ఆందోళన
ఎల్బీనగర్, ఆగస్టు 11: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు 30 వేల పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకటించాలని, ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసి ప్రతి గ్రామంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని నిరుద్యోగ జేఏసీ చైర్మన్ భూక్య కుమార్, తెలంగాణ రాష్ట్ర ఏజెన్సీ సాధన సమితి ప్రధాన కార్యదర్శి సుమేష్ జాదవ్ డిమాండ్ చేశారు.
మంగళవారం సాయంత్రం దిల్‌సుఖ్‌నగర్‌లో తెలంగాణ బీఎడ్ అభ్యర్థుల సంఘం, నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో 30 వేల పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చట్టబద్ధత కలిగిన జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలన్నారు.
గిరిజన ప్రాంతాల్లో ఏజెన్సీ డీఎస్సీ తక్షణమే విడుదల చేయాలని, మోడల్ స్కూల్, గురుకులాల ఉద్యోగ నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేయాలని కోరారు. డీఎస్సీ లేని టెట్ పరీక్షలం మాకొద్దని నినదించారు. లేదంటే నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులను సమీకరించి ప్రజాస్వామ్య పద్ధతిలో మరింత ఉదృతమైన ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో కళ్యాణ్, పవన్ యాదవ్, సాయి, హరీష్, సోనీ, శ్వేత, ప్రవళిక, వరలక్ష్మి, సంధ్య పాల్గొన్నారు.






