15 April, 2026 | 3:10 AM

విజ్ఞాన గని.. అంబేద్కర్

15-04-2026 12:40 AM
  1. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా నిలబెట్టిన గొప్ప దార్శనికుడు 

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్, ఏప్రిల్ 14 (విజయక్రాంతి): డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భారతదేశంలో పుట్టడం మన అదృష్టమని, ఆయన ఒక అద్భుతమైన ప్రతిభాశాలి, విజ్ఞాన గని అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. భారత రాజ్యాంగం ద్వారా ప్రజాస్వామ్య పునాదులను ఏర్పరిచి, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్‌ను నిలబెట్టిన గొప్ప దార్శనికుడు అని కొనియాడారు. దేశంలోని ప్రతి పౌరుడికి రాజ్యాంగం ద్వారా సమాన హక్కులు కల్పించారని, మహిళా సాధికారత, హక్కులను రాజ్యాంగం ద్వారా కల్పించిన దార్శనికుడు అన్నారు.

మంగళవారం అంబేద్కర్ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భట్టి మాట్లాడుతూ.. దేశ జనాభాలో సగమైన మహిళలు ఎదుర్కొంటున్న లింగ వివక్ష, ఇబ్బందుల గురించి అంబేద్కర్ మొదటిసారిగా ఆలోచించారని, స్వాతంత్య్రానికి ముందే బ్రిటిష్ వారితో పోరాడి హిందూ కోడ్ బిల్లు ద్వారా మహిళలకు హక్కులు కల్పించే ప్రయత్నం చేశారని గుర్తుచేశారు.

స్వతంత్ర భారత తొలి న్యాయశాఖ మంత్రిగా మహిళల హక్కుల కోసం హిందూ కోడ్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టారని, ఆ బిల్లు ఆమోదం కోసం తన మంత్రి పదవికే రాజీనామా చేసిన గొప్ప నాయకుడు అంబేద్కర్ అన్నారు. కుల, మతాలకు అతీతంగా ప్రతి మహిళ సంక్షేమం కోసం కృషి చేశారని, ప్రసూతి సెలవులు, లేబర్ లాస్ (కార్మిక చట్టాలు) అమలులో ఆయన పాత్ర కీలకమైందన్నారు.

కార్మికుల పని గంటలను 12 నుంచి 8 గంటలకు తగ్గించేలా పోరాడి విజయం సాధించిన గొప్ప దార్శనికుడు అని కొనియాడారు. ప్రజాస్వామ్యం మార్గంలో ఓటు హక్కు ద్వారా ప్రజలను పాలకులుగా మార్చేందుకు ప్రతి పౌరుడికి ‘ఓటు హక్కు’ కల్పించారని చెప్పారు. తన ప్రతినిధి ద్వారా తనకు కావలసిన విధివిధానాలను రూపొందించుకునే అద్భుతమైన అవకాశాన్ని అంబేద్కర్ అందించారని, రాజ్యాంగం ద్వారానే మనకు ప్రశ్నించే హక్కు, స్వేచ్ఛ, మానవ హక్కులు లభించాయని తెలిపారు. ప్రస్తుతం దేశంలో రాజ్యాంగాన్ని మార్చాలని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయాలని బీజేపీ ప్రయత్నిస్తోందని, ప్రతి పౌరుడు తమ హక్కులను కోల్పోయే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు.

అందరం ఏకమై, పిడికిలి బిగించి ‘జై భీమ్’ అనే నినాదంతో భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణలోని ఇందిరమ్మ ప్రభుత్వం బాబాసాహెబ్ ఆలోచనలతో, ఆయన చూపించిన మార్గంలోనే ప్రయాణిస్తోందని, ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం, చేసే ప్రతి చట్టం, పాలనలోని ప్రతి అడుగు అంబేద్కర్ ఆర్థిక, సామాజిక ఆలోచనలు ప్రతిబింబిస్తాయని పేర్కొన్నారు.

రాహుల్‌గాంధీ పిలుపునిచ్చిన ‘కుల గణన’ సామాజిక న్యాయం పట్ల ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, జనాభా ప్రాతిపదికన వనరులు, రాజకీయ హక్కులు అందరికీ సమానంగా పంచబడాలనే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. రాజ్యాంగం, మానవ హక్కుల పరిరక్షణ భారత రాజ్యాంగాన్ని అక్షరాలా అమలు చేస్తున్న ప్రభుత్వం మాది అని, మానవ హక్కులను కాపాడేందుకు కృషి చేస్తున్న ఈ ప్రజా ప్రభుత్వాన్ని ప్రజలందరూ ఆదరించి, కాపాడుకుంటూ ముందుకు సాగాలని కోరారు.