వాగులో కొట్టుకుపోయిన వ్యక్తి మృతి
వికారాబాద్, జూన్-14(విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట్ మండలం అమ్రాద్ కలాన్ గ్రామంలో గురువారం రాత్రి ద్విచక్ర వాహనంతో పాటు వాగులో కొట్టుకుపోయిన వ్యక్తి మృతిచెందాడు. మోమిన్‌పేట్ మండలం అమ్రాద్ కలాన్ గ్రామానికి చెందిన మైతాబ్ ఖాన్(35) వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం పని నిమిత్త సదాశివాపేటకు వెళ్లిన మైతాబ్‌ఖాన్ రాత్రి 10గంటల సమయంలో ద్విచక్ర వాహనంపై గ్రామానికి బయలుదేరాడు. అప్పటికే భారీ వర్షం కురువడంతో అమ్రాద్ కలాన్ గ్రామ సమీపంలోని వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. వాగు దాటటేక కొందరు అక్కడే వేచి ఉండగా.. మైతాబ్ ఖాన్ మాత్రం ద్విచక్రవాహనం దాటుతుందనే నమ్మకంతో ముందుకు కదిలాడు.
దీంతో అందరూ చూస్తుండగానే నీటిలో వాహనంతో పాటు కొట్టుకుపోయాడు. అక్కడ ఉన్న కొందరు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రాత్రి 2గంటల వరకు వాగులో గాలించినా ఆచూకీ దొరకలేదు. శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో మైతాబ్ ఖాన్ మృతదేహం లభ్యమైంది. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు.






