నన్ను నేను చేరని చోటు!
చిన్నప్పుడు ఇల్లంటే
ఎండ దహించని.. చలి వణికించని
వాన తడపని చోటు---
అమ్మ హృదయం అనుకున్నాను
పెద్దయ్యాక తెలిసింది---
మనిషిని తడిపేది వర్షం కాదు
జ్ఞాపకాలే !!
అమ్మ జోలపాటల్లో.. నాన్న నీడలో
గోడల మధ్య కాదు
ఆ ప్రేమల మధ్యే పెరిగాను
కానీ వయసు పెరిగే కొద్దీ
నా లోపల పుట్టిన ప్రశ్నలకు
ఏ గదిలోనూ చోటు దొరకలేదు..
విచిత్రం కదా--- !!
మనల్ని ప్రేమిస్తున్నామని చెప్పినవాళ్ల దగ్గరే
మన నిజాలను దాచుకోవడం నే
ర్చుకుంటాం
మనల్ని వదిలి వెళ్లిపోయినవాళ్లే
కొన్నిసార్లు
మనలో శాశ్వతంగా ఉండిపోతారు
ఫుట్‌పాత్ మీద బతికే మనిషికీ
ఒక వల ఉంటుంది---
అదే అతని ఇల్లు
కానీ కొందరు
నాలుగు గోడల మధ్య జీవించినా
తలదాచుకోవడానికి
తమ మనసులోనే
ఒక చోటు వెతుక్కుంటూ ఉంటారు
అప్పుడు అర్థమైంది !!---
ఇల్లు అనేది
మనం చేరుకునే స్థలం కాదు
మనల్ని మనం దాచుకోవాల్సిన అవసరం
ఇక మిగలని క్షణం
ఎవరి ముందు నిలబడినా
మన గాయాలను దాచాల్సిన
అవసరం లేకపోవడం
ఎవరి పక్కన కూర్చున్నా
మన మౌనానికి అర్థం చెప్పాల్సిన
అవసరం లేకపోవడం..
బహుశా..
ఈ ప్రపంచంలో
అత్యంత దుఃఖకరమైన అనాథ
ఇల్లు లేని వాడు కాదు---
ఒక జీవితమంతా
ఇతరుల కోసం ఒక ఇల్లు కట్టి
చివరికి-- తనకోసం మాత్రం
ఒక వలను కూడా
మిగుల్చుకోలేకపోయిన మనిషి !!






