22 June, 2026 | 2:59 AM

అపురూప బాల్యం

22-06-2026 12:04 AM

నేను రోజూ

వీధిలో ఆటలాడే పిల్లలను గమనిస్తాను

వాళ్ల ఆటలను, 

మాటలను ఆస్వాదిస్తాను

వాళ్ల నవ్వుల్ని, కేరింతలనే కాదు

గిల్లికజ్జాల్ని, ఏడుపుల్ని కూడా!

అమాయకత్వాన్నే కాదు

అల్లరితనాన్ని కూడా 

ప్రదర్శిస్తారు కదా! 

ఉక్రోషాన్నే కాదు

చిలిపితనాన్ని కూడా రంగరిస్తారు కదా! 

బాల్యపు మధురత్వాన్నే కాదు

అప్పుడపుడు పెద్దరికాన్ని కూడా 

పోగేస్తారు కదా!

షడ్రుచుల సమ్మేళనంలా

జీవితాన్ని మేళవించి 

చూపుతారు కదా!

ఈ ఆస్వాదన కోసం 

నేను వారిని గమనిస్తున్నట్లు 

తెలియకుండా 

జాగ్రత్త పడతాను

తెలిసిందా..?

లేకుంటే.. వాళ్లు కూడా 

సహజత్వాన్ని మరచి  

నటించడం మొదలెడతారు మరి !!                                   -