22 June, 2026 | 3:01 AM

గమ్యం చేరాలంతే!

22-06-2026 12:01 AM

కొన్ని దార్లు అంతే

ముళ్లతో అల్లుకుంటాయి

రాళ్లతో పెనవేసుకుంటాయి

వాటిని దాటుకుంటూ

అక్కడక్కడా పూసిన పూలను చూస్తూ 

పరిమళాలను ఆస్వాదిస్తూ ముందుకు సాగాలి

అడ్డుగోడలెదురైనా ఆగిపోకుండా 

అలసిపోకుండా నడక వేగం పెంచాలి

గమ్యం చేరాలన్న ఆశయం గట్టి పడాలి..

ఒక్కోసారి..

అలసిన ఈ ప్రయాణం ఆయుష్షుతో 

ఎంతకూ బోధపడదు

ఎడారిలో నీటి ఒయాసిస్‌లా 

తూర్పు తెరమీద సూర్యుడి చిత్రం!

ప్రయాణం ముగిసే క్షణం

కళ్లముందు ప్రత్యక్షం

అప్పటికే లేత భానుడు

నదిలో దూకేశాడు

అలికిడి విని పడవ ముందుకు సాగింది

దిక్కులను స్పృశిస్తూ

నింగిలో తనను తాను దర్శిస్తూ

అవతలి గట్టుకు..

పడవ వెంటే పడమరకు

పయనమయ్యాడు సూర్యుడు !

నేడు ఆలస్యమైనా

రేపటినందుకునేందుకు

గట్టుమీద ఉండిపోయాను

తెల్లారగానే తూర్పు ముంగిట

ముగ్గులేసి ఉదయానికి స్వాగతం పలకాలి

సూర్యుడితోపాటు నదిలో దూకి

పడవ వెంటే పడమటి దిక్కుకు పయనమవ్వాలి

త్వరగా నా గమ్యం చేరుకోవాలి !!