18 April, 2026 | 2:20 AM

గిరిజన గ్రామానికి రక్షణ కవచం

18-04-2026 12:00 AM

మాణిక్‌గూడలో కరకట్ట నిర్మాణానికి శ్రీకారం

కుమ్రం భీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 17 (విజయ క్రాంతి):అది ఒక గిరిజన గ్రామం. అక్కడ నివసిస్తున్న వారంతా పీవీటీజీ తెగకు చెందిన గిరిజనులు. కుమ్రం  భీం ప్రాజెక్టు నిర్మాణం సమయంలో మాణిక్గూడ గ్రామంలోని గిరిజనులకు పునరావాసం కల్పించా రు. పునరావాస ప్రాంతంలో సీసీ రోడ్డు, అంగన్వాడి కేంద్రం, పాఠశాల వంటి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేశారు.

అయితే ప్రాజెక్టు కుడి కాలువ గ్రామ సమీపం నుంచి వెళ్లడం వల్ల వర్షాకాలంలో గ్రామానికి వెళ్లే రహదారి కోతకు గురవుతూ పెద్ద సమస్యగా మారింది. అమాయకమైన గిరిజనులు తమ సమస్యను ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితిలో ఉండేవారు. ఫిబ్రవరి 24న దానాపూర్ గ్రామంలో నిర్వహించిన భూభారతి అవగాహన సదస్సుకు జిల్లా కలెక్టర్ కె. హరిత హాజరయ్యారు. ఈ సందర్భంగా మాణిక్‌గూడ గ్రామ సర్పంచ్, గ్రామస్థులు తమ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.

వెంటనే స్పందించిన కలెక్టర్ హరిత సంబంధిత అధికారులతో కలిసి గ్రామాన్ని సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. సమ స్య తీవ్రతను గుర్తించి దాని పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లా ఇన్చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు దృష్టికి సమస్యను తీసుకెళ్లి నిధుల మంజూరుకు రిక్వెస్ట్ లెటర్ పొందారు. అనంతరం ఇరిగేషన్ శాఖ సెక్రటరీని ప్రత్యేకంగా కలిసి కరకట్ట నిర్మాణానికి రూ.48 లక్షల నిధులను మంజూరు చేయించారు.

ఈ క్రమంలో మాణిక్గూడ గ్రామానికి వరద ముప్పు లేకుండా రక్షణ కరకట్ట నిర్మాణానికి శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే కోవా లక్ష్మితో కలిసి జిల్లా కలెక్టర్ కె. హరిత భూమి పూజ నిర్వహించారు. గ్రామానికి ఎన్నాళ్లుగానో ఉన్న ప్రధాన సమస్య పరిష్కారం దిశగా చర్యలు ప్రారంభమవడంతో గిరిజనులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ చొరవతో సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.