18 August, 2026 | 6:29 PM

జిల్లాలో 62 శాతం లోటు వర్షపాతం

18-08-2026 05:44 PM

- నీటి లభ్యతకు అనుగుణంగా పంటల వైవిధ్యీకరణపై దృష్టి సారించాలి

- రైతుల సమస్యలు, సూచనలను స్వయంగా అడిగి తెలుసుకున్న జిల్లా కలెక్టర్

- జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు

ములుగు,(విజయక్రాంతి): జిల్లాలో ఆగస్టు నెలలో 62 శాతం లోటు వర్షపాతం బోర్కడే హేమంత్ సహదేవరావు తెలిపారు. నీటి లభ్యతకు అనుగుణంగా పంటల వైవిధ్యీకరణపై రైతులు దృష్టి సారించాలని, రైతు వేదికల ద్వారా ప్రత్యామ్నాయ పంటలపై అధికారులు విస్తృత అవగాహన కల్పించాలని, సమస్యల పరిష్కారంలో స్పష్టమైన పురోగతి ఉండాలని జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అధికారులను ఆదేశించారు. మంగళవారం నూతన కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నీటిపారుదల, వ్యవసాయ, ఉద్యానవన శాఖల ఆధ్వర్యంలో సంయుక్త సలహా కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సమావేశంలో జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావం, సాగునీటి లభ్యత, పంటల సాగు పరిస్థితి, ప్రత్యామ్నాయ పంటలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్వయంగా రైతులతో మాట్లాడి ఆయా మండలాలు, గ్రామాల్లో నెలకొన్న వ్యవసాయ పరిస్థితులు, సాగునీటి సమస్యలు, పంటల సాగులో ఎదురవుతున్న ఇబ్బందులు, ప్రత్యామ్నాయ పంటలపై వారి అభిప్రాయాలు, సలహాలు, సూచనలను అడిగి తెలుసుకున్నారు. రైతులు తెలిపిన ప్రతి అంశాన్ని అధికారులు నమోదు చేసుకోవాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు మాట్లాడుతూ ములుగు జిల్లాలో అత్యధిక శాతం ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నందున రైతుల సమస్యల పరిష్కారానికి జిల్లా యంత్రాంగం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. రైతులు, ప్రజాప్రతినిధులు, వ్యవసాయ, ఉద్యానవన, నీటిపారుదల శాఖల అధికారులు ఒకే వేదికపై చర్చించడం ద్వారా క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలకు సరైన పరిష్కార మార్గాలను గుర్తించవచ్చన్నారు. మే నెల నుంచే ఎల్‌నినో ప్రభావం, వర్షపాతం లోటు పరిస్థితులపై రైతులకు రైతు వేదికలు, ప్రచార మాధ్యమాల ద్వారా నిరంతరం అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.

నీటి లభ్యతను అంచనా వేసుకోకుండా పంటలు సాగు చేసి రైతులు నష్టపోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆగస్టు నెలలో జిల్లాలో వర్షపాతం తీవ్రంగా తగ్గిందని కలెక్టర్ తెలిపారు. జిల్లా మొత్తంగా సాధారణ వర్షపాతం 218 మిల్లీమీటర్లు నమోదు కావాల్సి ఉండగా 83 మిల్లీమీటర్లు మాత్రమే నమోదై, సుమారు 62 శాతం వర్షపాతం లోటు ఉన్నట్లు కలెక్టర్ వివరించారు. ప్రస్తుత పరిస్థితులను రైతులు గమనించి నీటి లభ్యతకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. రైతులు పూర్తిగా వరి పంటపైనే ఆధారపడకుండా పంటల వైవిధ్యీకరణకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

కొంత విస్తీర్ణంలో వరి సాగు చేస్తూనే మిగతా భూముల్లో తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలను చేపట్టడం ద్వారా వర్షాభావ పరిస్థితుల ప్రభావాన్ని తగ్గించుకోవచ్చన్నారు. ఆయా ప్రాంతాల నేల స్వభావం, నీటి లభ్యత, వాతావరణ పరిస్థితులను బట్టి ఏయే ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకోవచ్చనే అంశంపై రైతులకు పూర్తి సమాచారం అందించాలని జిల్లా వ్యవసాయ అధికారులను ఆదేశించారు. అన్ని రైతు వేదికల్లో వ్యవసాయ విస్తరణ అధికారులతో సమావేశాలు నిర్వహించి, రైతులకు అనుకూలమైన పంటలు, సాగు విధానాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు.

ఉద్యానవన పంటల సాగుకు అవకాశమున్న ప్రాంతాలను గుర్తించి రైతులకు తగిన సాంకేతిక సలహాలు అందించాలని ఉద్యానవన శాఖ అధికారులను ఆదేశించారు. తక్కువ నీటితో సాగయ్యే పంటలు, ఆరుతడి పంటలు, ఉద్యానవన పంటలపై రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో నీటి కొరత ఉన్న నేపథ్యంలో అందుబాటులో ఉన్న సాగునీటిని సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. చెరువులు, కుంటల్లో పూడికతీత, వి బి జి రామ్ జి పథకం ద్వారా చేపట్టగల నీటి సంరక్షణ పనులను పరిశీలించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

రైతులు సమావేశంలో ప్రస్తావించిన సమస్యల్లో జిల్లా స్థాయిలో పరిష్కరించగల అంశాలను తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. రాష్ట్ర స్థాయిలో పరిష్కారం కావాల్సిన అంశాలను సంబంధిత ఉన్నతాధికారులు, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ప్రతి సమస్యకు సంబంధించి ఏ స్థాయిలో చర్యలు తీసుకోవాల్సి ఉందో స్పష్టంగా గుర్తించాలని అధికారులకు సూచించారు. సమావేశాల్లో కేవలం సమస్యలను ప్రస్తావించడం కాకుండా గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై సాధించిన పురోగతిని కూడా సమీక్షించాలని పేర్కొన్నారు.

ప్రతి సమావేశానికి అధికారులు స్పష్టమైన పురోగతి నివేదికతో హాజరు కావాలని, పరిష్కారమైన సమస్యలు, పెండింగ్‌లో ఉన్న అంశాలు, తీసుకున్న చర్యల వివరాలను అందించాలని ఆదేశించారు. సమావేశాలు ఫలితాల ఆధారంగా ఉండాలని, క్షేత్రస్థాయిలో స్పష్టమైన మార్పు కనిపించినప్పుడే వాటికి సార్థకత ఉంటుందని తెలిపారు. జిల్లాలో ఉన్న వర్షపాతం లోటును రైతులు గుర్తించి పరిస్థితులకు అనుగుణంగా పంటల ఎంపికపై సానుకూలంగా ఆలోచించాలని కలెక్టర్ కోరారు. ప్రజాప్రతినిధులు కూడా తమ పరిధిలోని రైతులకు వర్షాభావ పరిస్థితులు, ప్రత్యామ్నాయ పంటల అవసరం, నీటి పొదుపు అంశాలపై అవగాహన కల్పించాలని సూచించారు.

రైతులు పండించిన వరితో పాటు ఇతర పంటలకు కూడా అవసరమైన సమయంలో ప్రభుత్వ పరంగా సహకారం అందేలా చర్యలు ఉంటాయని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో వ్యవసాయ, ఉద్యానవన, నీటిపారుదల శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్ రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, రాష్ట్ర పంచాయతీరాజ్ డైరెక్టర్ బైరెడ్డి భగవాన్ రెడ్డి, సమ్మయ్య, ఆత్మ కమిటీ జిల్లా చైర్మన్ రఘు, డివిజన్ చైర్మన్లు రవీందర్ రెడ్డి, అరుణ, డిప్యూటీ ట్రైనీ కలెక్టర్, జిల్లా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ గ్రామాల రైతులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.