ఒక్కటైన ఉగ్రమూక
- పక్కా సమన్వయంతో చొరబాట్లు, దాడులు
- పాకిస్థాన్ కేంద్రంగా మాడ్యూల్స్ ఆపరేట్
- భారత్‌లో దాడులే లక్ష్యంగా ప్రణాళికలు
న్యూఢిల్లీ, ఆగస్టు 14: కేంద్రలో ఎన్డీయే అధికారంలోకి వచ్చిన తర్వాత గత పదేండ్లలో జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యం గా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది. ఒక్కొక్క ప్రధాన ఉగ్రవాదిని మట్టుబెడుతూ ఉగ్ర తం డాలను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టింది. ఆ తర్వాత జమ్ముకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దుచేసినా పెద్దగా ప్రతిఘటన, హింస కనిపించలేదు. దీంతో ఇక ఆ ప్రాంతం లో ఉగ్రవాదం అంతమైనట్టేనని అంతా అనుకొన్నారు. మోదీ సర్కారు కూడా అదే విషయాన్ని ప్రచారం చేసుకొన్నది. కానీ, గత 5 నెలలుగా పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే గతంకంటే భీకరంగా ఉగ్రవాదులు దాడులకు తెగబడుతున్నారు.
వారి వద్ద అభివృద్ధి చెందిన దేశాల సైన్యం వాడే అత్యాధునిక తుపాకులు కనిపిస్తున్నాయి. ప్రతి ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాదులకంటే మన సైన్యానికే ఎక్కువ నష్టం కలుగుతున్నది. ఇది ఎలా సాధ్యమవుతున్నది? అంతరించిందనుకొన్న ఉగ్రవాదం మళ్లీ పడగవిప్పి ఎలా బుసలు కొడుతున్నది? దీనికి సమాధానం ఇప్పుడు దొరికింది. పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్ర సంస్థలో గతంలో వేటికవే వేర్వేరుగా కశ్మీర్‌లో కార్యకలాపాలు నిర్వహించగా, ఇప్పుడు అవన్నీ గుంపు కట్టాయని నిఘా వర్గాలు గుర్తించాయి. వీటన్నింటినీ కలిపింది పాకిస్థాన్ సైన్యమేనని తేల్చాయి.
చేయి కలిపిన ముష్కర నేతలు
పాకిస్థాన్‌లోని బహవల్‌పూర్‌లో గత శీతాకాలానికి ముందు పలు ఉగ్రవాద సంస్థల అధినేతల సంయుక్త సమావేశం జరిగిందని భారత నిఘా వర్గాలు పసిగట్టాయి. ఇందులో జైషే మహ్మద్ అధినేత మసూద్ అజహర్, అల్‌బదర్ కమాండర్ బక్త్ జమీన్, హిజ్బుల్ ముజాహిదీన్ అధిపతి సయ్యద్ సలాహుదీన్ తదితర అంతర్జాతీయ ఉగ్రవాదులు పాల్గొన్నారు. వీళ్లంతా కలిసి ఒక కూటమిగా ఏర్పడి... భారత్‌లో ఉగ్రదాడులకు ఎవరు ఏ పనిచేయాలని పక్కా ప్రణాళిక వేసుకొన్నారు. కొందరు కొత్త ఉగ్రవాదులను చేర్చుకొనే పనిని నెత్తికెత్తుకొంటే, మరికొందరు శిక్షణ, ఆయుధాల సేకరణ, బాంబుల తయారీ, నిధుల సేకరణ, సిద్ధాంత ప్రచారం.. ఇలా ఒక్కో పనిని ఒక్కొక్కరు చేపట్టారు.
ఒక్కొక్కరికి ఒక్కో పని
అల్‌బదర్ నేత భక్త్ జమీన్‌కు నిధుల సేకరణ బాధ్యతలు అప్పగించారు. జైషే మహ్మద్ చీఫ్ ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చే బాధ్యతలు తీసుకొన్నాడు. సయ్యద్ సలాహుద్దీన్ రిక్రూట్‌మెంట్లు, సైఫుల్లా సాజిద్ జట్‌కు మనీలాండరింగ్, మాదకద్రవ్యాల చేరవేత నెట్‌వర్క్, షేక్ జమీల్ ఉర్ రెహమాన్, ఫరూక్ ఖురేషీకి క్షేత్రస్థాయిలో ఉగ్రవాదులను సమన్వయం చేసే బాధ్యతలు అప్పగించారు. ఫర్హతుల్లా ఘోరీకి సిద్ధాంత ప్రచారం, స్లీపర్ సెల్స్ ఏర్పాటు, సజ్జద్ గుర్‌కు రియల్ ఎస్టేట్, ఆయుధాలు, నిధుల సేకరణ, షహీద్ ఫైసల్, హమ్జా బుర్హాన్‌కు ఆన్‌లైన్‌లో ఉగ్రవాదుల రిక్రూట్ మెంట్ బాధ్యతలను అప్పగించినట్టు భారత నిఘా వర్గాలు గుర్తించాయి.
ఇలా ఎవరికి వారు పక్కా సమన్వయం తో ఉగ్రవాదుల కోసం భారీగా అత్యాధునిక ఆయుధాలను సమకూర్చి, కఠిన శిక్షణ ఇచ్చి భారత్‌లోకి పంపినట్టు అనుమానిస్తున్నారు. అందువల్ల నే గతానికి భిన్నంగా ప్రస్తుతం భారత సైన్యానికి ఎక్కువ నష్టం కలుగుతున్నదని సైనిక వర్గాలు చెప్తున్నాయి.




