22 August, 2026 | 7:27 PM

రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం

01-07-2026 08:11 PM

దేవదాయ శాఖ ద్వారా ఆలయాలకు సహాయ సహకారాలు

హైదరాబాదులో బోనాల పండుగ అధికారికంగా ప్రభుత్వం నిర్వహిస్తుంది

రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

బాన్సువాడ,(విజయక్రాంతి): రాష్ట్రంలోని అన్ని గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ప్రభుత్వం తరఫున ఉత్సవాలు నిర్వహిస్తామని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం ఎత్తొండ గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలోని అమ్మవారి విగ్రహాన్ని ఆవిష్కరించి ఉత్సవాలలో పాల్గొన్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ. కోటగిరి మండలం ఎత్తోండ గ్రామంలో రేణుక ఎల్లమ్మ ఆలయ ప్రతిష్టాపన కార్యక్రమానికి ఇక్కడికి రావడం జరిగిందని అన్నారు.

వర్షాలు సమృద్ధిగా కురవాలని, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని గ్రామదేవతలను ప్రార్థించడం జరిగిందన్నారు.తెలంగాణలో అన్ని గ్రామాలలో ఆలయాలలో ప్రభుత్వం తరఫున ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.హైదరాబాదులో సైతం బోనాల కార్యక్రమం అధికారికంగా ప్రభుత్వం నిర్వహిస్తుందని, అలాగే గ్రామాలలోని గ్రామ దేవతలకు ప్రభుత్వ దేవదాయశాఖ తరఫున తగిన సహాయ సహకారాలు అందజేస్తామని ఆయన అన్నారు. ఆయనతోపాటు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి అగ్రోస్ ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్  తదితరులు ఉన్నారు.