భద్రాచలంలో స్పెషల్ కోర్టు ఏర్పాటు చేయాలి
హైకోర్టు జడ్జి బీమాపాక నగేష్ కు వినతిపత్రం అందజేసిన భద్రాచలం బార్ అసోసియేషన్ సభ్యులు
భద్రాచలం, ఏప్రిల్ 15, (విజయక్రాంతి): భద్రాచలం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి భీమపాక నగేష్ ను బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి, భద్రాచలం ప్రాంతానికి సంబంధించిన న్యాయ సేవల అభివృద్ధి అంశంపై వినతి పత్రం సమర్పించారు. ప్రస్తుతం భద్రాచలం, మణుగూరు పరిధిలోని కేసులు దూర ప్రాంతాలకు తరలించబడుతున్న నేపథ్యంలో, స్థానిక ప్రజలు , న్యాయవాదులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బార్ అసోసియేషన్ ప్రతినిధులు న్యాయమూర్తి కి వివరించారు.
ముఖ్యంగా భద్రాచలం జూరిస్డిక్షన్ పరిధిలోనే మణుగూరు ప్రాంతాన్ని పరిగణలోకి తీసుకుని, ఇక్కడే ఒక సెషన్స్ కోర్టు లేదా కనీసం అసిస్టెంట్ సెషన్స్ కోర్టు ఏర్పాటు చేయడం అత్యవసరం అని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి భీమపాక నగేష్ ప్రతిపాదించిన అంశాలను శ్రద్ధగా ఆలకించి, సమస్య ప్రాముఖ్యతను గుర్తించి, దీనిపై సానుకూలంగా స్పందించారు.
సంబంధిత అధికారులతో చర్చించి, సాధ్యమైనంత త్వరగా తగిన చర్యలు తీసుకునేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు కొడాలి శ్రీనివాసన్ ఉపాధ్యక్షులు సున్నం రమేష్ ప్రధాన కార్యదర్శి పూసాల శ్రీనివాస చారి సంయుక్త కార్యదర్శి తాత లలిత లైబ్రరీ కార్యదర్శి పగడాల కవిత సాంస్కృతిక కార్యదర్శి కోర్స కృష్ణార్జునరావు తో పాటు సీనియర్ న్యాయవాదులు ఎం.వి. రమణరావు, కోట దేవదానం, గోడపర్తి నాగరాజు, ఎస్. కే. అక్తర్, పోకల మోహన్ కృష్ణ, ధనసరి మూర్తి, రవితేజ, ఆశ్రిత తదితరులు పాల్గొన్నారు.






