తెలుగు రాష్ట్రాల రుచులతో హైదరాబాద్‌కు 'ఊట'
హైదరాబాద్, మే 25, 2026: 2016 నుంచి బెంగళూరులో ప్రాంతీయ వంటకాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన 'ఊట' రెస్టారెంట్, ఇప్పుడు హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో ప్రారంభమైంది. 'టోటల్ ఎన్విరాన్‌మెంట్ హాస్పిటాలిటీ' నిర్వహిస్తున్న ఈ రెస్టారెంట్‌కు 'షిబానీ+కమల్ ఆర్కిటెక్ట్స్' అద్భుతమైన ఇంటీరియర్ డిజైన్ అందించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఆహార సంస్కృతి, పాకశాస్త్ర సంప్రదాయాలకు ఈ 'ఊట హైదరాబాద్' ఒక అచ్చమైన ప్రతిబింబం. ఈ రెండు రాష్ట్రాల ఇళ్లలోని వంటగదులు, స్థానిక వర్గాల కథల ఆధారంగా, సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ, అత్యంత ప్రామాణికంగా దీనిని తీర్చిదిద్దారు.
స్థానిక దినుసులు, తరతరాలుగా వస్తున్న వంట పద్ధతులను 'ఊట'లోని ప్రతి వంటకం గుర్తుచేస్తుంది. హైదరాబాద్ మెనూను సిద్ధం చేయడానికి, ఊట వంటల బృందం 2 ఏళ్ల పాటు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా 3,637 కిలోమీటర్లు ప్రయాణించింది. స్థానిక వర్గాలు, చిన్న చిన్న హోటళ్లు, బార్‌లు, ఆహార చరిత్రకారులతో కలిసి పనిచేస్తూ 500కు పైగా వంటకాలను వారు స్వయంగా వండి నేర్చుకున్నారు. దీని ఫలితం కేవలం ఒక మెనూ మాత్రమే కాదు.. దక్కన్ ప్రాంతపు అద్భుతమైన ఆహార ప్రయాణం.
హైదరాబాద్ నిజాం వంటశాలల నుంచి స్ఫూర్తి పొందిన వంటకాల దగ్గర్నుంచి.. కోస్తా, రాయలసీమ, తెలంగాణల ప్రత్యేక వంటకాల వరకు ఈ మెనూలో విభిన్న రుచులున్నాయి. స్టార్టర్స్‌లో నిజాం వంటకాలైన షికంపురి కబాబ్స్‌తో పాటు స్ట్రీట్ ఫుడ్ తరహాలో ఉండే నెల్లూరు చేపల వేపుడు, బాపట్ల కోడి వేపుడు నోరూరిస్తాయి. మెయిన్ కోర్సులో హలీమ్-ఏ-ఖాస్, ముద్దపప్పు-పచ్చిపులుసు, నాటు కోడి పులుసు, పీతల ఇగురు లాంటి అద్భుతమైన వంటకాలున్నాయి. వంటకాల అసలు రుచి చెడిపోకుండా, అనవసర ఆడంబరాలకు పోకుండా ఎంతో జాగ్రత్తగా వీటిని వండుతారు. మచిలీపట్నంకు చెందిన బందర్ హల్వా, ఆత్రేయపురం పూతరేకులు వంటి డిజర్ట్‌లు మన ప్రాంతీయ వారసత్వాన్ని గుర్తుచేస్తాయి.
ఆహారం తరహాలోనే ఇక్కడి పానీయాలు సైతం పూర్తి స్థానికతను సంతరించుకున్నాయి. గుంటూరు ఎండుమిర్చితో తయారు చేసిన బోర్బన్ ఆధారిత 'గుంటూరు ఓల్డ్ ఫ్యాషన్డ్', తెలంగాణ ప్రసిద్ధ ఆకుకూర గోంగూర ఆధారంగా చేసే 'గోంగూర హైబాల్', నిజాం డెజర్ట్ స్ఫూర్తితో రూపొందించిన 'ఖుబానీ కీ మెహ్‌ఫిల్' వంటి ఎక్స్‌క్లూజివ్ కాక్‌టెయిల్స్ ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. స్థానిక వంటకాలు, ప్రాంతీయ పాకశాస్త్ర వారసత్వాన్ని అందరికీ పరిచయం చేయాలనే ఉద్దేశంతోనే 'ఊట'ను ప్రారంభించామనీ టోటల్ ఎన్విరాన్‌మెంట్ హాస్పిటాలిటీ వ్యవస్థాపకుడు కమల్ సాగర్ చెప్పారు. కర్ణాటక తమకు ఎంతో ఉత్సాహాన్నిచ్చిందన్నారు.






