calender_icon.png 15 July, 2025 | 6:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూసీ సుందరీకరణకు ముందడుగు

07-08-2024 04:31:19 AM

  1. వరల్డ్ బ్యాంక్ నుంచి రూ.4,100 కోట్ల రుణం పొందడానికి అనుమతి
  2. జీవో విడుదల చేసిన ప్రభుత్వం

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 6 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మూసీ సుందరీకరణ ప్రాజెక్టు పనుల పురోగతి క్రమేపీ వేగం పుంజుకుంటున్నాయి. ఇప్పటికే మూసీపై డ్రోన్ సర్వే పూర్తికాగా, ప్రస్తుతం రెవెన్యూ అధికారులు చేపడుతున్న సామాజిక సర్వే చివరి దశకు చేరుకుంది. ఈ నివేదిక ప్రభుత్వానికి త్వరలోనే అందనుంది. ఈ నివేదిక సారాంశం ఆధారంగా మూసీ ప్రాజెక్టు పనులు మరింత వేగాన్ని పెంచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఇదిలా ఉండగా రెవెన్యూ అధికారుల చేపట్టిన సామాజిక సర్వే నివేదిక అందకముందే ప్రభుత్వం మూసీ ప్రాజెక్టు సుందరీకరణకు కావాల్సిన నిధులను రాబట్టుకోవడానికి అవసరమైన వనరులపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో మూసీ ప్రాజెక్టుకు రూ.4100 కోట్లు అవసరమని ప్రభుత్వం ప్రాథమికంగా అంచనాకు వచ్చింది. 

జీవో నంబర్ 347 విడుదల..

హైదరాబాద్ నగరంలో ఈస్ట్ నుంచి వెస్ట్ దాకా మూసీ సుందరీకరణ, పరీవాహక ప్రాంతం అభివృద్ధి, మూసీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రచిస్తోంది. ఈ మొత్తం 55 కిలోమీటర్ల పరిసర ప్రాంతాల్లో దాదాపు 110 చదరపు కిలోమీటర్ల వ్యాప్తంగా అభివృద్ధి చేయనుంది. ఈ ప్రణాళికలో భాగంగా మూసీని, మూసీ పరివాహక ప్రాంతాన్ని పర్యావరణ హితంగా తీర్చిదిద్దనున్నారు. ఈ కారిడార్‌లో అనేక వాణిజ్య, పబ్లిక్ రిలేటెడ్ కేంద్రాలను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రూ. 1,500 కోట్లను బడ్జ్జెట్‌లో కేటాయించింది.

మూసీ సుందరీకరణకు సంబంధించిన మాస్టర్ ప్లాన్, డీపీఆర్ ఇంకా ఫైనల్ కానందున తాజాగా ప్రభుత్వం కేటాయించిన రూ. 1,500 కోట్లు సాధారణ వ్యయానికి మాత్రమే కేటాయించినట్టుగా పలువురు అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్‌కు మాస్టర్ ప్లాన్ సిద్ధం అయ్యేలోగానే సంబంధిత నిధులను సమకూర్చుకోవడానికి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ముందస్తుగా రూ. 4,100 కోట్ల నిధులను ప్రపంచ బ్యాంకు నుంచి రుణంగా పొందేందుకు మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఆర్‌డీసీఎల్)కు బాధ్యత ను అప్పగిస్తూ ప్రభుత్వం జీవో నంబరు 347 ను మంగళవారం జారీ చేసింది. 

కేంద్రంతో సంప్రదింపులు

ప్రపంచ బ్యాంకు రుణం పొందాలంటే రాష్ట్ర ప్రభుత్వ అనుమతి, క్యాబినెట్ తీర్మానం, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం అనుమతి కూడా కావాల్సి ఉంటుంది. ఈ మేరకు రుణం పొందడానికి అనుమతిస్తూ మున్సిపల్ శాఖ ముందస్తుగా జీవో నంబర్ 347ను జారీ చేసింది. ఈ జీవోకు అనుగుణంగా ఎంఆర్‌డీసీఎల్ అధికారులు మిగతా కసరత్తును ప్రారంభించను న్నారు. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 14న నగరానికి రానున్నారు. సీఎం రాగానే మూసీపై రెవెన్యూ అధికారులు నిర్వహించిన సామాజిక సర్వే నివేదికను పరిశీలించే అవకా శాలు ఉన్నట్టుగా సమాచారం. రుణం పొందడానికి క్యాబినెట్ సైతం తీర్మానం చేయనుంది.

ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం ఎంఆర్‌డీసీఎల్ అధికారులు ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించినట్టుగా సమాచారం. కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే మూసీ ప్రతిపాదనలను ప్రపంచ బ్యాంకుకు ఎంఆర్‌డీసీఎల్ అధికారులు నివేదించనున్నారు. ఇంకా అవసరమైన నిధుల కోసం బాండ్ల రూపంలో కూడా సేకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. సెబీ అధికారులతో కూడా అధికారులు త్వరలోనే చర్చించే అవకాశాలు ఉన్నట్టు సమాచారం.