07-08-2024 04:26:15 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 6 (విజయక్రాంతి): గద్దర్ వంటి వారు శతాబ్దానికి ఒక్కరే పుడతారని, గద్దర్ గ్లోబల్ మ్యాన్ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం ‘గద్దరన్న యాదిలో..’ పేరిట గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో మీడియా అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ అధ్యక్షతన నిర్వహించిన గద్దర్ మొదటి వర్ధంతి సభలో పలువురు రాజకీయ ప్రముఖులు, మేధావులు, రచయితలు, కవులు పాల్గొన్నారు. ఈ సభకు ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క హాజరయ్యారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన ఉద్యమాల్లో తన పాటలతో ప్రజల్లో చైతన్యం నింపారని గుర్తుచేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే గద్దర్ సలహాలు తీసుకోవాలనుకున్నామని, ఆయన ఆసుపత్రిలో ఉన్నప్పుడు, చనిపోయినప్పుడు మొదట స్పందించింది సీఎం రేవంత్‌రెడ్డినే అని తెలిపారు. నెక్లెస్ రోడ్డులో ఎకరం సభలో గద్దర్ స్మృతివనాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా గద్దర్ జీవితచరిత్రకు సంబంధించిన పుస్తకాలను ఆవిష్కరించారు. కాగా, ట్యాంక్‌బండ్ మీద గద్దర్ విగ్రహాన్ని, మ్యూజియం ను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా వక్తలు ప్రభుత్వాన్ని కోరారు.
కార్యక్రమంలో ప్రొ.హరగోపాల్, ప్రొ.కోదండరాం, ప్రొ.కంచె ఐలయ్య, ప్రొ.గడ్డం లక్ష్మణ్, దేశపతి శ్రీనివాస్, గోరటి వెంకన్న, గద్దర్ కుమార్తె వెన్నెల, కుమారుడు సూర్యం, సినీ దర్శకుడు బీ నర్సింగరావు, సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, విమలక్క, నల్గొండ గద్దర్ పాల్గొన్నారు.
సచివాలయంలో..
హైదరాబాద్ సిటీబ్యూరో: ప్రొఫెసర్ జయశంకర్ జయంతి, ప్రజా యుద్ధ నౌక గద్దర్ వర్ధంతిని పురస్కరించుకొని మంగళవారం సచివాలయంలో అధికారులు ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో టీఎస్‌ఎస్‌ఏ అధ్యక్షుడు సురేశ్‌కుమార్, ప్రధాన కార్యదర్శి ప్రేమ్, సరితరాణి, ప్రసాద్, స్వామి, కంచెర్ల శ్రీనివాస్‌రెడ్డి, కైలాష్, రాజేశ్వరి, శ్రీదేవి, తులసీదాస్, కిశోర్‌కుమార్, రమేశ్, శ్రీనివాస్, రవి పాల్గొన్నారు.
జయశంకర్ భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు గద్దర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
నిర్మల్: ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పట్టణంలోని టీఎన్జీవో భవనంలో నిర్వహించిన గద్దర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించారు.
రంగారెడ్డి: కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఆమనగల్లు మండల కేంద్రంలో నిర్వహించిన గద్దర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించారు.
పాటను తూటాగా మార్చిన గద్దర్
హైదరాబాద్, ఆగస్టు 6 (విజయక్రాంతి): పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా.. పోరు తెలంగాణమా అంటూ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి గద్దర్ ఆయువుపట్టుగా నిలిచారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. గద్దర్ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన సేవలను సీఎం రేవంత్‌రెడ్డి స్మరించుకున్నారు. పాటను తూటాగా మార్చిన ప్రజా యుద్ధ నౌక గద్దర్ అని, ఆయన చేసిన సాంస్కృతిక, సాహితీ సేవకు గుర్తింపుగా నంది అవార్డులను గద్దర్ అవార్డులుగా తమ ప్రభుత్వం మార్చిందని సీఎం వెల్లడించారు.