15 June, 2026 | 1:28 AM

తేటతెలుగున భావ ఝరి.. మల్లాది

15-06-2026 12:00 AM

ఉన్నదిలే.. దాగున్నదిలే

నీ కన్నుల ఏదో ఉన్నదిలే

అది నన్నే కోరుతున్నదిలే

ఈ వెన్నెలలో సై అన్నదిలే !!


కన్నెపూల వన్నెలేవో 

కన్ను గీటుతున్నవి

కన్నెపూల వన్నెలేవో 

కన్ను గీటుతున్నవి

మేనిలోన ఊహలేవో 

వీణ మీటుచున్నవి

వీణ మీటుచున్నవి !!


ఎక్కడిదీ -!

ఎక్కడిదీ అందం ఎవ్వరిదీ ఆనందం!

వెలిగే ఆనందం - చెలరేగే ఆనందం!

ఎక్కడిదీ ఆనందం!

లోకంలో కన్నెలకూ లోపాలెన్నే 

చిన్నది లోకంలో

మారుని జవరాలికైనా -

వంకలు దిద్దే వన్నెది‘మారుని

వెన్నెల దీపల్లె - మెరుపూతీవల్లె

ఏడుమల్లెపూవులెత్తు - తూగే .. అన్న గీతాలు వింటుంటే శ్రోతల గుండెల్లో అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుంది. ఇవి కేవలం చలన చిత్ర గీతాలు కావు. తెలుగు భాషా సుగంధ పుష్ప పరిమళాలను నలుదెసలా వ్యాపింపజేసిన శ్రవణ మాలికలు. ఈ అద్భుత రస గుళికలను మనకు అందించిన కవి మల్లాది రామకృష్ణశాస్త్రి. తెలుగు సాహితీ రంగంలో ఈయనది విశిష్టమైన స్థానం. పద్యమైనా, గద్యమైనా, కథ అయినా, కవిత అయి నా ఆయన కలం నుంచి జాలువారితే అది అమృత కావ్యమే అవుతుంది. సంప్రదాయ పాండిత్యాన్ని, ఆధునిక భావాలను మేళవించి రాయడం ఆయనకు మాత్రమే వచ్చిన విద్య. ఆ శైలి ఎంతో అరుదైనది.

చదివిన వెంటనే అర్థమయ్యేవి త్వరగానే మర్చిపోతారని, చదువరిని ఆలోచింపజేసేవే గుండెల్లో చిరకాలం నిలిచిపోతాయనేది మల్లాది ప్రగాఢ విశ్వాసం. అందుకే ఆయన కవిత్వం గానీ, సినీ గీతాల్లో గానీ నర్మగర్భమైన భావాలను పొందుపరుస్తారు. ఈ అక్షర మాంత్రికుడి స్వస్థలం ఏపీ లోని మచిలీపట్నం(బందరు)కు కూతవేటు దూరంలో ఉన్న చిట్టిగూడూరు. మల్లాది 1905 జూన్ 17న జన్మించారు. తల్లి కనకవల్లి, తండ్రి నరసింహశాస్త్రి. వీరిది తరతరాలుగా పండిత పరంపర. మల్లాది ఏకసంథాగ్రాహి.

చిన్నతనం నుంచే అసాధారణమైన మేధస్సు ఆయన సొంతం. కాలేజీ రోజుల్లోనే ఈయన ‘విద్యాభూషణ’ అనే బిరుదు సాధించారంటే, ఆయన ఎంతటి పండితుడో అంచనా వేయవచ్చు. మచిలీపట్నంలో బీఏ వరకు చదివిన తర్వాత మల్లాది మద్రాసు చేరుకున్నారు. సంస్కృతాంధ్ర విభాగాల్లో ఎంఏ పూర్తి చేశా రు. యడవల్లి సుబ్బావధాన్లు వద్ద వేదవిద్య నేర్చారు. నోరి సుబ్రహ్మణ్యశాస్త్రి వద్ద మహాభాష్యాన్ని అభ్యసించారు. శిష్ట్యా నరసింహ శాస్త్రి వద్ద బ్రహ్మసూత్రాలను ఒడిసిపట్టారు. అలంకార, వ్యాకరణ, తర్క శాస్త్రాలను పూర్తి గా అధ్యయనం చేశారు. వీటన్నింటితో పాటు ఖగోళ, జ్యోతిష శాస్త్రాల్లోనూ ప్రవేశం వచ్చిం ది. నాట్యం, చిత్రలేఖనం, సంగీతం వంటి కళలను కూడా ఔపోసన పట్టారు.

బహుభాషా కోవిదుడు

మల్లాదికి చాలా చిన్న వయస్సులోనే వివాహమైంది. దంపతులకు ఇద్దరు కుమారు లు, ఇద్దరు కుమార్తెలు. మామగారు విదేశాల నుంచి ఏ పుస్తకం తెప్పించినా అల్లుడి కోసం ఒక కాపీ ప్రత్యేకంగా తెప్పించేవారు. మల్లాదిలో పాఠనాభిలాష కలగడానికి మామగారు ఒక కారణమని చెప్పవచ్చు. మల్లాది తన రచనా వ్యాసాంగాన్ని తన ౧౬వ ఏట నుంచే రచనలు ప్రారంభించారు. ఆయన తొలికథ ‘భారతి’ పత్రికలో అచ్చయింది.

మల్లాది ఒక తెలుగు, సంస్కత భాషలకే పరిమితం కాలేదు. ప్రాకృతం, పాళీ, జర్మన్, సింహళ, గ్రీకు, ఫ్రెం చ్, జపానీస్ వంటి అనేక అంతర్జాతీయ భాషల్లోనూ ప్రావీణ్యం సంపాదించారు. తద్వారా ఆయన బహుభాషా కోవిదుడయ్యారు. ప్రముఖ కవి ఆరుద్ర ‘మీకెన్ని భాషలు తెలు సు?’ అని మల్లాదిని అడిగారు. అప్పుడు శాస్త్రి ఒక తాటాకు విసనకర్రను తీసుకొని, దానికి రెండు వైపులా ఉన్న ప్రతి ఆకు మీద ఒక్కో భాషలో సంతకం చేసి ఇచ్చాక, ఆశ్చర్యపోవడం ఆరుద్ర వంతైంది. మల్లాది పాండిత్యం అంతటి అపారమైనది. ఉదర, కుటుంబ పోష ణ కోసం మల్లాది మొదట ‘దేశాభిమాని’ పత్రికలో ఉపసంపాదకుడిగా పనిచేశారు.

తర్వాత ‘కృష్ణా పత్రిక’లో చేరి ‘నా కవి మిత్రు లు’, ‘చలువ మిరియాలు’ వంటి అద్భుతమైన విమర్శనా వ్యాసాలు రాశారు. 1945లో సినీ దర్శకుడు గూడవల్లి రామబ్రహ్మం ‘పల్నాటియుద్ధం’ సినిమాకు సంబంధించిన సలహా కోసం మల్లాదిని సంప్రదించారు. అలా ఆయ న సినీ రంగ ప్రవేశం జరిగింది. మద్రాసులో సముద్రాల రాఘవాచార్యతో మల్లాదికి గాఢమైన స్నేహం ఏర్పడింది. సముద్రాలకు పేరు కావాలి, మల్లాదికి ఆర్థిక ఇబ్బందుల వల్ల డబ్బు కావాలి. మల్లాది అందువల్ల చాలా కాలం పాటు సముద్రాలకు ‘ఘోస్ట్ రైటర్’గా పనిచేశారనే ప్రచారం నాడు ఉండేది. 1952 లో విడుదలైన ‘చిన్నకోడలు’ సినిమాలోని ‘పిల్లనగ్రోవి పాటకాడ’ అనే పాటతో మల్లాదికి ఎంతో పేరు తెచ్చింది. ఆ తర్వాత మల్లాది తన సొంత పేరుతో 39 చిత్రాల్లో 200కి పైగా పాటలు రాశారు.

పానగల్ పార్క్ - పండిత సభలు

ఇతర సినీ కవుల కంటే మల్లాదిది చాలా భిన్నమైన వ్యక్తిత్వం. సినీ జానపద బాణీల్లో మల్లాది సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. ‘చిటారు కొమ్మన మిఠాయి పొట్లం’, ‘చికిలింత చిగురు సంపెంగ గుబురు’, ‘ఏరు నవ్విందోయ్ ఊరు నవ్విందోయ్’, ‘భలే భలే పావురమా గడుసు పావురమా’ వంటి పాట లు జానపద సొగసులను అద్దాయి. అలతి అలతి పదాలతోనే వేదాంతాన్ని పలికించడం ఆయన ప్రత్యేకత. ఆయన పాండిత్యం, భాషపై ఉన్న పట్టు, కథను నడిపించే శైలి దర్శకులను అమితంగా ఆకట్టుకునేవి.మద్రాసులోని పానగల్ పార్క్ అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది మల్లాది వారే. అక్కడి సిమెంట్ బల్లలపై కూర్చుని వేరుశనగ కాయలు తింటూ ఉండేవారు.

సాయంత్రం వేళల్లో అక్కడ అనధికార విద్వత్సభలు నడిపేవారు. మల్లాది ప్రసంగిస్తుంటే రోడ్డు పక్కన నుంచి వెళ్లే జనం కూడా కొద్దిసేపు ఆగి ఆ ప్రసంగం వినేవారు. కొన్నిసార్లు ట్రాఫిక్ కూడా నిలిచిపోయేది. ఆరుద్ర, వీఏకే రంగారావు వంటి వారు ఈయనను గురువుగా భావించేవారు. పాటలు రాసిన సొమ్ము ఏదైనా చేతికి అందితే, మల్లాది వెంట నే పార్కులో ఆకలితో ఉన్నవారికీ అన్నం పెట్టేవారు. చెప్పులు కుట్టేవాడి బతుకు దెబ్బతిన కూడదని, పాత చెప్పులనే పదే పదే కుట్టించుకుని, ఆ చెప్పులు కుట్టేవారిని నవ్వుతూ పలక రించి, కొంత సొమ్ము చేతికి ఇచ్చి తిరిగి వచ్చే మానవతావాది మల్లాది. ఆయన సాహిత్యం లో ‘కృష్ణాతీరం’ నవల ఒక మైలురాయి.

నవలలోని ‘అప్పన్న’ పాత్రలో  ఆయన వ్యక్తిత్వమే కనిపించేదని పాఠకులు చెప్పుకునేవారు. ఆయన కథలన్నింటిలో కృష్ణా తీర నేపథ్యం ఉండటం విశేషం.  మల్లాది ‘తేజోమూర్తులు’ గ్రంథం విమర్శకుల ప్రశంసలు పొందింది. వేదాంత ధోరణి కారణంగా చివరి దశాబ్దంలో భార్యాపిల్లలకు దూరమయ్యారు. అందరినీ, అన్నింటినీ పోగొట్టుకుని కటిక పేదరికాన్ని అనుభవించారు. చివరి రోజుల్లో క్షేత్రయ్యపై గ్రంథం రాయాలనుకున్నారు. ప్రారంభించిన కొద్దికాలానికే ఆయన కన్నుమూశారు. ఆ రోజు 1965 సెప్టెంబర్ 12. తెలుగు సినిమా పాటకు కావ్య గౌరవం, సుకుమారమైన లాలిత్యాన్ని తెచ్చిపెట్టిన ఈ కవి భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన పాటలు, సాహిత్యం కలకాలం నిలిచే ఉంటా యి. తెలుగువారి గుండెల్లో గుబాళిస్తూనే ఉంటాయి.

                              అశోక