శాశ్వత శాంతికి బాటలు!
యావత్ ప్రపంచాన్ని సుమారు నాలుగు నెలలపాటు అతలాకుతలం చేసిన పశ్చిమాసియా సంక్షోభానికి ఎట్టకేలకు తెరపడింది! రెండు దేశాల మధ్య యుద్ధం కాస్తా ప్రాంతీయ పోరుగా మారిన తరుణంలో ఇరాన్ మధ్య తాజా ఒప్పందం కుదరడం ముదావహం. జూన్ 19న సంతకాలు చేయాల్సి ఉన్న ఈ డీల్ శాశ్వత శాంతిస్థాపనకు దారితీయాలని ప్రపంచ దేశాలన్ని కాంక్షిస్తున్నాయి. అయితే, పశ్చిమాసియా యుద్ధాల గత చరిత్రను చూస్తుంటే శాశ్వత శాంతి స్థాపన సాధ్యపడు తుందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
లెబనాన్‌లోని హెజ్బుల్లాపై దాడులు కొనసాగిస్తున్న ఇజ్రాయెల్ శాంతి పవనాలను అడ్డుకుంటుం డటం ఇందుకు బలాన్ని చేకూరుస్తున్నది. కాగా, ఇరుపక్షాలు ప్రత్యక్ష దాడులను వెంటనే నిలిపివేయడం, హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడం, ఇరాన్ నౌకలపై దిగ్బంధనాన్ని ఎత్తివేయడం వంటి అంశాలు ఈ డీల్‌లో ఉన్నాయి. అయితే, ఇరాన్ అణు కార్యక్రమంపై 60 రోజుల పాటు చర్చలు జరపాలని నిర్ణయించడం శాశ్వత శాంతిస్థాపనకు ప్రతికూలంగా మారవచ్చనే వాదనలు వినవస్తున్నాయి.
మరోవైపు ఇరాన్ మిత్రపక్షాల చిక్కుముడి ఇంకా వీడలేదు. మిత్ర దేశాలపైనా యుద్ధ విరమణ అమలు చేయాలని ఇరాన్ పట్టుబడుతుండగా, లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో అమెరికా మధ్య ఒప్పందం కుదిరినా, ప్రాంతీయ ఘర్షణలు ఇంకా కొనసాగుతాయా? అన్న సందేహాలు నెలకొన్నాయి.
గతంలోనూ మొదట కాల్పుల విరమణ, తర్వాత చర్చలు, అనంతరం మళ్లీ ఉద్రిక్తతలు చెలరేగిన విషయం తెలిసిందే. ముఖ్యంగా అమెరికా ఆధిపత్య రాజకీయాలు, ఇరాన్‌పై సైనిక వర్గాల ఒత్తిడి, ఇజ్రాయెల్ ఏకపక్ష వైఖరి నేపథ్యంలో ఈ డీల్ భవితవ్యంపై అనిశ్చితి నెలకొన్నది. అయితే ఈసారి కొన్ని సానుకూలాంశాలు కనిపిస్తున్నాయి. ఇరాన్ సార్వభౌమాధికారాన్ని గౌరవించడం, ఆర్థిక ఆంక్షల సడలింపు, ఇరాన్ నిధుల విడుదల, ఆ దేశ పునర్నిర్మాణానికి సహాయం వంటి అంశాలు అమలైతే శాశ్వత శాంతికి బాటలుపడే అవకాశం ఉంది.
అందువల్ల ప్రస్తుతం ఇది మరో విఫల ప్రయత్నమేనని కొట్టిపారేయలేం. అదే సమయంలో యుద్ధం పూర్తిగా ముగిసిపోయిందని చెప్పడమూ తొందరపాటే అవుతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం తెరుచుకున్న శాంతి ద్వారాలు పశ్చిమాసియాలో శాశ్వతంగా వెలుగులను పరుస్తాయా? లేక మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకొని కారుచీకట్లు అలుముకుంటాయా? అన్నది అరవై రోజులపాటు జరుగనున్న చర్చలపై ఆధారపడి ఉందని చెప్పక తప్పదు.






