జీవిత సత్యాల ‘మంగళవారాలు’
‘వాళ్లు నా శరీరా న్ని బంధించగలరు, నా ఆత్మను కాదు. వాళ్లు నన్ను చీకటి గదిలో ఉం చగలరు. కానీ, నాలోని వెలుగును ఆపలేరు’- అని జైలు గోడల మధ్య నేను చదివిన వాక్యాలు ఎప్పటికీ మరచిపోలే జీవిత సత్యాల ‘మంగళవారాలు’ను.‘ఉపా’ చట్టం అనే కఠినమైన అభియోగం మోపబడి, వందరోజుల పాటు జైలులో మగ్గాను. అకారణంగా నిర్బంధాన్ని ఎదుర్కొన్నాను. అప్పుడు నా మనసు తీవ్రమైన మానసిక సంఘర్షణకు లోనైంది. సమాజం కోసం కలం పట్టిన ఒక జర్నలిస్ట్‌గా నాకు ఎదురైన ఆ అపహరణ తరహా బంధనం నన్ను శూన్యంలోకి నెట్టేస్తున్న సందర్భమది. అలాంటి సమయంలో నా చేతికి అందిన అక్షర సంజీవని, నా అంతరంగాన్ని నిలబెట్టిన తాత్విక కాంతిరేఖ ‘మోరీతో మంగళవారాలు’.
మిచ్ ఆల్బమ్ రాసిన ఈ అమూల్యమైన గ్రంథాన్ని తెలుగులోకి డాక్టర్ తుమ్మల పద్మిని, ప్రొఫెసర్ అత్తలూరి నరసింహారావు అనువదించారు. ఏదేమైనా.. ఈ పుస్త కం గురించి నేను కొన్ని మాటలు పంచుకోదలుచుకు న్నా. ఈ పుస్తకం ఏ కల్పిత కథో, నవలో కాదు. ముక్కుసూటిగా సాగే రెండు నిజ జీవితాల సజీవ సాక్ష్యాల సం కలనం. కథానాయకుడు ప్రొఫెసర్ మోరీ శ్వాజ్ అమెరికాలోని బ్రాండెస్ వర్సిటీలో సోషియాలజీ ప్రొఫెసర్. ఆయనకు నరాల బలహీనత అనే భయంకరమైన, చికి త్స లేని జబ్బు వస్తుంది. దీంతో ఆయన శరీరం క్రమం గా చచ్చుబడిపోతుంది. మరణం అంగుళం అంగుళం దగ్గరవుతుంది. అయినప్పటికీ.. ఆయన కుంగిపోలేదు.
తన మరణాన్ని కూడా ఇతరులకు పాఠంగా మార్చాల ని నిర్ణయించుకుంటాడు. ఇలాంటి సమయంలో తన ప్రియ విద్యార్థి మిచ్ ఆల్బమ్ (పుస్తక రచయిత) జర్నలిస్టుగా వృత్తి జీవితం సాగిస్తూ ఉంటాడు. కెరీర్, డబ్బు, ఉరుకుల పరుగుల జీవితంలో పడి తన అసలు జీవితా న్ని మరచిపోతాడు. అలాంటి మిచ్‌కు ఓరోజు షాకింగ్ వార్త తెలుస్తుంది. తన గురువైన మోరీ శ్వాజ్ మరణశయ్యపై ఉన్నాడని తెలుసుకుని వెంటనే ఆయన వద్దకు వెళ్తాడు. ఆరోజు మంగళవారం. అది మొదలు ప్రతి మంగళవారమూ గురువు వద్దకు వెళ్లడం ప్రారంభించాడు మిచ్. వెళ్లినప్పుడల్లా మోరీ ‘జీవిత పరమార్థం’ అనే విషయం గురించి మాట్లాడేవాడు. అలా ౧౪ వారా ల పాటు మిచ్ విన్న బోధనలే ఈ ‘మోరీతో మంగళవారాలు’ అనే పుస్తకం.
నాకెందుకు కనెక్ట్ అయిందంటే..
పుస్తకం నాకు ఎందుకు అంతగా కనెక్ట్ అయిందో తెలుసుకోవాలంటే, పుస్తక అంతస్సూత్రాన్ని పరిశీలించాల్సి ఉంటుంది. ప్రొఫెసర్ మోరీ శరీరం అనే జబ్బు తో రోజురోజుకూ కుంచించుకుపోతుంది. ఫలితంగా ఆయన చక్రాల కుర్చీకే పరిమితం అవుతాడు. ‘నువ్వు మంచానికే పరిమితమయ్యావని కుంగిపోతే, నీ మనసు కూడా బందీ అవుతుంది. శరీరం పడిపోయినా నీ ఆలోచనలు విశ్వమంతా విహరించగలవు’ అని మోరీ ఒక చోట అంటారు. ఈ ఒక్కమాట నాలో ఆశను, ఆలోచనను పెంచింది. ‘అవును, ఇనుప కటకటాలు నా శరీరా న్ని ఆపగలవేమో కానీ, నాలోని సత్యాన్ని, సత్యాన్వేషణను ఎలా ఆపగలవు..?’ అని ఆ క్షణమే అనిపించింది.
ఆ క్షణం నుంచి జైలు నాకు బంధనంగా కాకుండా ఒక తపోభూమిగా కనిపించింది. ఈ పుస్తకం ప్రతి మంగళవారం ఒక కొత్త కోణాన్ని చర్చిస్తుంది. సామాన్య జీవితంలో మనకు చిన్న కష్టం వస్తేనే కుంగిపోతాం. జీవితం అంతమైపోయిందనుకుంటాం. కానీ, మరణానికి దగ్గరవుతున్న మోరీ ఒక వినూత్నమైన మార్గం మానవాళికి ఉపదేశించారు. ఆయన రోజూ ఉదయం లేవగానే తన చచ్చుబడిన శరీరాన్ని చూసుకుని, పడుతున్న బాధను తలుచుకుని ఐదు నిమిషాలు గట్టిగా ఏడ్చేవాడట. ఆ తర్వాత కన్నీళ్ల ను తూడ్చుకుని, ‘సరే, ఏడవడం అయిపోయింది. ఇక మిగిలిన రోజంతా నేను ఎలా సంతోషంగా ఉండాలి? ఇతరులకు ఎలా ఉపయోగపడాలి?’ అని ఆలోచించేవాడు. ‘బాధను దాచొద్దు, దాన్ని అనుభవించు.. కానీ ఆ సమయం అయిపోయాక లేచి నిలబడు.’ అంటాడు మోరీ. ఒకరకంగా జైల్లో ఉన్నప్పుడు నేను అనుభవించే మానసిక బాధను, ఆలోచనలను అధిగమించడానికి మోరీ ఉపదేశం ఎంతో ఉపకరించింది.
పరమ సత్యం ఏమిటంటే..
జీవితమనేది ఎప్పుడూ రెండు విరుద్ధ శక్తుల మధ్య సాగిఉన్న రబ్బరు బ్యాండ్ లాంటిది. మన మనస్సాక్షి ఒకటి చేయమంటుంది. కానీ క్రూరమైన వ్యవస్థలు లేదా పరిస్థితులు మనల్ని ఇంకో వైపు లాగుతాయి. ఈ ఘర్షణలో సామాన్యుడు భయపడి లొంగిపోతాడు. కానీ, మోరీ చెప్పిన పరమసత్యం ఏంటంటే.. ‘ఈ పోరాటంలో చివరికి ప్రేమ, సత్యం మాత్రమే గెలుస్తాయి’ అని. నేను జైలులో ఉండి కూడా మానసికంగా గెలవడానికి, చివరకు 2026 మే 5న కోర్టు తీర్పు ద్వారా నా నిర్దోషిత్వాన్ని సగర్వంగా చాటుకోవడానికి ఈ తాత్విక స్థైర్యమే పునాది అయింది. ‘డబ్బు, హోదా.. ఇవేవీ నీకు మనశ్శాంతిని ఇవ్వవు. సమాజం నీకు నేర్పే తప్పుడు సంస్కృతిని తిరస్కరించు.
నీకంటూ ప్రేమ, మానవత్వం తో కూడిన ఒక సొంత సంస్కృతిని నిర్మించుకో’ అం టారు మోరీ. మనం బయటి ప్రపంచంలో ఉన్నప్పుడు ఎవరికైనా ఫోన్ చేసి మాట్లాడటానికి కూడా తీరిక లేనం త బిజీగా నటిస్తాం. కానీ, జైలు గోడల మధ్య ఉన్నప్పు డో, లేదా మోరీ లాగా మంచాన పడ్డప్పుడో అర్థమవుతుంది.. అవన్నీ అశాశ్వతం అని. చివరికి మనతో మిగి లేది మనం ఇతరులకు ఇచ్చిన ప్రేమ మాత్రమే. ‘పరస్పరం ప్రేమించుకోకపోతే మనం నశించిపోతాం’ అనే మోరీ మాట ఎంత అక్షర సత్యం.
మోరీ శిష్యుడు,ఈ పుస్తక రచయిత మిచ్ కూడా ఒక జర్నలిస్టే. కెరీర్ వేగం లో పడి జీవితాన్ని యాంత్రికంగా మార్చుకున్న వాడు కాస్తా.. ఆ 14 మంగళవారాలు ఒక గురువు బోధనలు విని మారిపోతాడు. తన జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకుంటాడు. ఒక్క మిచ్ మాత్రమే కాదు.. పుస్తకం చదివే ప్రతి సామాన్య పాఠకుడి జీవితంలోనూ ఎంతో కొంత మార్పు వస్తుందనేది అక్షర సత్యం. పుస్తకం మనల్ని మనం సమీక్షించుకునేలా చేస్తుంది.
బహుశా అందుకే, ఒక జర్నలిస్ట్‌గా బాహ్య ప్రపంచాన్ని చూసే నాకు, ఈ పుస్తకం నా అంతరంగాన్ని చూసుకునేలా చేసింది. ఇక్కడ చెపపదల్చుకున్నది ఏమిటంటే? ‘మోరీతో మంగళవారాలు’ అనే పుస్తకం ఒకసారి చదివి, పక్కన పెట్టే పుస్తకం కాదు.జైలు నిర్బంధం లేదా జీవిత నిర్బంధంలో ఉన్న ప్రతి ప్రాణికి విముక్తి గీతం. పుస్తకం ఏ పెద్ద పెద్ద సిద్ధాంతాలు మాట్లాడదు. నీకు అర్థం కాని విషయాలు చెప్పదు. ఎవరో మనింటి పక్కన ఒక పెద్ద మనిషి మన భుజం మీద చేయి మంచీ చెడు చెప్తున్న ట్లు ఉంటుంది. అంతుచిక్కని నరకంలో తాము మగ్గిపోతున్నామని భావించే వారంతా ఒక్కసారి ఈ పుస్తకం చదవండి.
- rajenderdamera@gmail.com






