calender_icon.png 22 February, 2026 | 7:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అడుగడుగున ఆలయం!

23-11-2025 12:00:00 AM

  1. సర్కారు దృష్టి సారిస్తే నగునూరుకు పూర్వవైభవం
  2. హంపిలా పర్యాటక అభివృద్ధికి అవకాశం

* ‘సాధారణంగా ఏ గ్రామంలోనైనా ఒకటో రెండో ఆలయాలు ఉంటాయి. కొన్నిచోట్ల మహా అయితే 10 వరకు ఉండొచ్చు. కానీ నగనూరులో మాత్రం ఒకటి కాదు.. రెండు కాదు.. పది.. వంద కానేకాదు.. ఏకంగా 400కి పైగా ఆలయాలు ఉన్నాయి. భూమి పైనే కాదు.. భూగర్భంలో కూడా ఎన్నో ఆలయాలు ఉన్నట్లు గ్రామస్తులు, చరిత్రకారులు పేర్కొంటున్నారు. కానీ అవి శిథిలావస్థలో ఉన్నాయని, సర్కారు ఆలకించి.. అభివృద్ధి చేస్తే  ఆలయాలన్నీ పూర్వవైభంతో విలసిల్లుతాయని, చరిత్ర, కాకతీయుల కళావైభవం మళ్లీ పరిఢవిల్లుతుందని భక్తులు, గ్రామస్తులు, చరిత్రకారులు కోరుతున్నారు.”

బల్మూరి విజయసింహారావు, కరీంనగర్, విజయక్రాంతి: వారసత్వ సంపద పట్ల ప్రభుత్వాల ఉదాసీనతకు, విధుల పట్ల దేవాదాయశాఖ నిర్లక్ష్యానికి కరీంనగర్‌లోని నగునూరులో కోట, దేవాలయాలు కనుమరుగవుతున్నాయి. ‘నాల్గువాండలు’ అనే తెలుగు పదం నుంచి నగునూరు అనే పేరు వచ్చింది. ఈ గ్రామం ఒకప్పుడు 400 కి పైగా దేవాలయాలకు నిలయంగా ఉండేది. నేడు, 10 కంటే తక్కువ దేవాలయాలు కనిపిస్తాయి.

మిగిలినవి కుటుంబం గ్రామంలో భూమిని తవ్వినప్పుడు మాత్రమే బయటపడతున్నాయి. కరీంనగర్ నగరానికి ఉత్తరాన 8 కి.మీ దూరంలో ఉన్న నగునూర్ ఒకప్పుడు కాకతీయ రాజవంశానికి అద్భుతమైన సాంస్కృతిక, ఆధ్యాత్మిక కేంద్రంగా ఉండేది. నేటికీ, శిథిలమైన శిలాశాసనం కాకతీయుల కళ, వాస్తుశిల్పం గొప్పతనానికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఎర్ర రాయితో నిర్మించిన ఎర్ర గుడి ఆలయం, మూడు శివలింగాలను కలిగి ఉన్న మూడు గర్భగుడులతో పర్యాటకులను అకర్షించేది.

100కి పైగా నంది విగ్రహాలే..

ఒక్క నంది విగ్రహాలే 100కి పైగా బయటపడ్డాయంటేనే అర్థం చేసుకోవచ్చు అక్కడ శిల్ప కళావైభవం ఎలా సాగిందో! ఈ ఊరుని మొదట నన్నూర్గా తర్వాతి కాలంలో నగనూర్‌గా పిలుస్తున్నారు. ఎత్తున కొండలున్న ఈ ప్రాంతాన్ని కాకతీయులు పరిపాలించారనీ, కొండల మాటు నుంచి శత్రువుల జాడ పసిగట్టేవారనీ చరిత్రకారులు చెబుతారు. కాకతీయులు శివభక్తులు కూడా కావడంతో.. ఒకే ఆలయంలో మూడు శివలింగాలు, ఆ లింగాలకు ఎదురుగా నందుల ప్రతిష్టాపన జరిగాయని పేర్కొంటారు.

ఆలయాల ఎదుట ధ్వజ స్తంభాలు, నీటి కోసం కోనేర్లు, చేద బావులు, సైన్యం ఉండటానికి సొరంగ మార్గం.. ఇలా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రభుత్వం గత వైభవాన్ని పునరుద్ధరించగలిగితే, నగునూర్ గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా మార్చవచ్చు. ప్రభుత్వం ముందుకు రాకపోవడంతో చరిత్ర సంపదను కాపాడేందుకు ప్రముఖ వ్యాపారి కాసుగంటి ముందుకు రావడం విశేషం. త్రికూటాలయం స్థానికంగా మార్చి పనులు ప్రారంభించారు.

గ్రామంలోని ప్రసిద్ధ ఆలయాలలో ఒకటైన త్రికూటాలయం (శివుడు, విష్ణువు, సూర్యుడు) శిథిలావస్థకు చేరుకోవడంతో, దానిని ఒక ప్రైవేట్ ఏజెన్సీ పునర్నిర్మాణం కోసం ముందుకు వచ్చింది. నగునూరు శివార్లలోని ఐదు ఎకరాల స్థలంలో ఆలయ స్తంభాలు, నిర్మాణాలన్నీ పునర్నిర్మిస్తున్నారు. కానీ పునర్నిర్మిస్తున్న పనులు ఏళ్లు గడుస్తున్నా పూర్తి కావడం లేదు. నగునూర్ కాకతీయ సామ్రాజ్య శిల్ప కళా వైభానికి ప్రతీకగా నిలుస్తోంది.

ఆ గ్రామంలో సుమారు 400కి పైగా ఆలయాలు కనిపిస్తుంటాయి. ప్రభుత్వం చొరవ తీసుకుంటే మరో హంపిలా మారే అవకాశాలున్నాయని చరిత్రకారులు చెబుతున్నారు. గ్రామ చరిత్రను చూసి భక్తులు ముందుకు వచ్చి దుర్గా భవాని ఆలయాన్ని నిర్మించారు.

ఆధ్యాత్మికంగా దుర్గాభవాని ఆలయం ప్రసిద్ధి

గ్రామ చరిత్రను చూసి భక్తులు ముందుకొచ్చి దుర్గా భవాని ఆలయాన్ని నిర్మించారు. హైదరాబాద్ సంఘీ టెంపుల్ తరహాలో.. శ్రీ పరివార సమేత దుర్గా భవాని అమ్మవారి దేవాలయాన్ని కట్టారు. ఈ ఆలయం సుమారు 8 ఎకరాలలో సువిశాలంగా ఉంది. ఇక్కడ దేవీనవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రముఖ వ్యాపారి వి.లక్ష్మణ్ కలలో దుర్గాదేవి అమ్మవారు కనిపించి ‘నాకు పలానా ప్లేస్ లో గుడి కట్టిస్తే ఊరు ఊరంతా బాగుంటుంది‘ అనిని చెప్పారట.

ఈ విషయాన్ని ఆ భక్తుడు వెంటనే స్నేహితుల అందరికీ చేరవేశారు. దీంతో ముందుకు వచ్చి విరాళాలు సేకరించి పెద్ద ఎత్తున గుడి నిర్మాణానికి పూనుకున్నారు. శరన్న నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇక్కడ ప్రతిరోజూ పూజలు వైభవంగా జరుగుతాయి. వీటిని తిలకించేందుకు చుట్టుపక్కల జిల్లాల నుంచి భక్తులు తరలొస్తారు.

అమ్మవారిని దర్శించుకుంటారు. అమ్మవారే కాకుండా దుర్గాదేవి, సరస్వతి, వినాయకుడు వీరితో పాటు గాయత్రి, సంతోషిమాత దేవి, పార్వతి దేవి కొలువై ఉండడం విశేషం. నగునూర్ కు పూర్వ వైభవం తేవడానికి ప్రభుత్వం ముందుకు రాకపోయినా భక్తులు ముందుకు వస్తుండటం అభినందనీయం.