23-11-2025 12:17:04 AM
అహ్మదాబాద్, నవంబర్ 22: భారతదేశ విద్యా రంగాన్ని పునరుజ్జీవిం పజేయడానికి, మన నాగరికత భవిష్యత్తును కాపాడేందుకు రూ.100 కోట్ల ప్రణాళికను ప్రారంభించినట్లు అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ పేర్కొన్నారు. దేశంలో వేగంగా విస్తరిస్తున్న కృత్రిమ మేధస్సు (ఏఐ)కు వ్యతిరేకంగా భారత నాగరికత వారసత్వాన్ని బలపరచాల్సిన అవసరముందని తెలిపారు.
శుక్రవా రం విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ (ఐకేఎస్) విభాగం సహకారంతో అహ్మదాబాద్‌లోని అదానీ కార్పొరేట్ హౌస్‌లో నిర్వహించిన గ్లోబల్ ఇండాలజీ కాంక్లేవ్ సదస్సులో గౌతమ్ అదానీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జ్యోతిర్మఠ్ శంకరా చార్య అవిముక్తేశ్వరనంద సరస్వతి స్వామీజీ హాజరవ్వగా.. భారత్ సహా వివిధ దేశాల నుంచి ఇండాలజీ, టెక్నాలజీ, సంస్కృతిలో నిపుణులైన చాలా మంది మేధావులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘డిజిటైజ్, డీకోడ్, డిఫెండ్: రీక్లెయినింగ్ ఇండియాస్ నాలెడ్జ్ హెరిటేజ్’ అనే ఇతివృత్తంతో సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా గౌతమ్ అదానీ మాట్లాడుతూ.. భారతదేశ సంప్రదాయాలను అధ్యయనం చేయడం కేవలం విద్యగా మాత్రమే పరిగణించకూడదని, అది జాతీయ ప్రాధాన్యతగా గుర్తించాలన్నారు. భారతదేశ నాగరిక వారసత్వానికి ఏఐ వల్ల మూడు ప్రమాదాలు పొంచి ఉన్నాయని.. మనుస్క్రిప్ట్ అదృశ్యం, సాంస్కృతిక కుదింపు, భారత సంప్రదాయ విశిష్టత తగ్గిపోవడం జరుగుతుందన్నారు.
ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి అదానీ ఐదు వ్యూహాల అంశాన్ని ప్రతిపాదించారు. భారత నాలెడ్జ్ గ్రాఫ్‌పై ప్రామాణిక పాఠాలు నేర్చుకోవడం; భారతీయ తత్వశాస్త్రాలపై అవగాహన కలిగి ఉండ డం, ఐఏకు ప్రత్యామ్నాయంగా హ్యూమన్ లూప్‌ను అభివృద్ధి చేయడానికి పాటుపడడం, సంస్కృతం భాషలో ప్రావీణ్యం కలిగిన పండితులను ఎంపిక చేయడం,
చివరగా భారతీయ నాగరికతకు, సంస్కృతికి వారసత్వంగా నిలిచిన నలందా విశ్వవిద్యాలయాలను దేశమంతా ఏర్పాటు చేయడం లాంటివి చేయాలి. ఈ నేపథ్యంలో భారతదేశ మేధో వారసత్వాన్ని కాపాడటానికి భారత్ నాలెడ్జ్ గ్రాఫ్‌కు మద్దతు ఇవ్వడానికి, నైపుణ్యం కలిగిన పండితులకు శిక్షణ ఇవ్వడానికి తాము రూ. 100 కోట్ల వ్యవస్థాపక విరాళాన్ని ప్రకటిస్తున్నాం అని అదానీ తెలిపారు.