calender_icon.png 23 November, 2025 | 1:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పచ్చని అడవుల్లో 400 ఏళ్లనాటి మఠం

23-11-2025 12:00:00 AM

ఆదిలాబాద్‌లో పురాతన శ్రీ రామచంద్ర గోపాల కృష్ణ మఠం

చరిత్రకు నిలువెత్తు సాక్ష్యం

తొలి మఠాధిపతి పుణ్య తిథి సందర్భంగా ఈ నెల 20 నుంచి డిసెంబర్ 4 వరకు జాతర 

ఆదిలాబాద్, (విజయక్రాంతి) : పచ్చని అడవులు, సుందర జలపాతాలు, ఎత్తున కొండలు.. ఇలా ఎన్నో ప్రకృతి రమణీయతలను పొదిగి ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తున్న ప్రాచీన కట్టడాలు, నిర్మాణాలు ఎన్నో ఉన్నాయి. ప్రఖ్యాతి గాంచిన వందల ఏళ్ల పురాతన ఆలయాలు, మఠాలు ఉన్నాయి. అలాంటి ప్రాచీన మఠాల్లో ఒకటి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీ రామచంద్ర గోపాల కృష్ణ మఠం.

ఇది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే అతి పురాతనమైన ఆలయం. మఠంగా కూడా ప్రఖ్యాతి గాంచిన ఈ ఆలయానికి 400 ఏళ్ల చరిత్ర ఉంది. ఇప్పటి వరకు ఈ మఠాన్ని తొమ్మిది మంది మఠాధిపతులు పాలించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. నాలుగు శతాబ్దాలుగా ఈ మఠాన్ని ఏలిన మఠాధిపతుల మకుటాలు నేటికి ఈ మఠంలో మనకు దర్శనమిస్తాయి. సజీవ సమాధి తీసుకున్న శ్రీ పూర్ణానంద సరస్వతి మకుటాన్ని భక్తుల దర్శనం కోసం బయటనే ఉంచారు. ఆది శంకరాచార్య, మాధవాచార్య విగ్రహాలు కూడా ఇక్కడ కనబడతాయి.

400 ఏళ్ల క్రితం స్థాపన 

పూర్వం ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి పాదయాత్ర చేస్తూ వచ్చిన శ్రీ పూర్ణానంద సరస్వతి స్వామి ఇక్కడి ప్రకృతి సౌందర్యానికి ముగ్ధులై ఇక్కడ ఉన్న మర్రిచెట్టు కింద ధ్యానం చేస్తూ ఇక్కడే మఠాన్ని ఏర్పాటు చేసుకొని, తపస్సును కొనసాగించినట్లు చరిత్ర చెపుతోంది. ఇప్పటి వరకు ఈ మఠంలో ఎనిమిది మంది ఉత్తరాధి మఠాధిపతులుగా వ్యవహరించగా, ప్రస్తుతం శ్రీ యోగానంద సరస్వతి స్వామి 10వ మఠాధిపతిగా కొనసాగుతున్నారు. శ్రీ గోపాలకృష్ణ విగ్రహాన్ని గుజరాత్ రాష్ట్రంలో దేవభూమిగా పిలిచే ద్వారక నుంచి తెచ్చి కృష్ణ సంప్రదాయాన్ని పాటిస్తూ శ్రీ పూర్ణానంద స్వామీజీ సత్యభామ రుక్మిణి సమేతంగా గోపాలకృష్ణ మందిరంలో గోపా లకృష్ణ విగ్రహాన్ని ప్రతిష్ఠించారని చరిత్రకారులు చెపుతారు. 

సరస్వతీ సంప్రదాయం

జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి దశనామీ సన్యాస పద్ధతి ప్రకారం ఈ మఠం సరస్వతీ సంప్రదాయానికి సంబంధించింది. పూర్ణానంద స్వామీజీ యోగ మఠం చేత ఈ మఠాన్ని స్థాపించారు. 1956 బొంబాయి యాక్ట్ ప్రకారం దేవుడి భూమి పేరిట రిజిస్టర్ అయినట్టు రెవెన్యు రికార్డులో ఉన్నది. 1967లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే దేవాదాయ ధర్మాదాయ చట్టం ప్రకారం 38 సెక్షన్ కింద ఆలయ రిజిస్ట్రేషన్ జరిగింది.

ఆలయ నిర్మాణ చరిత్ర

ఆలయ నిర్మాణం దక్షిణ భారతదేశంలో హిందూ దేవాలయ వాస్తుశిల్ప కళ ఉట్టి పడేలా నిర్మించారు.  ఆదిలాబాద్ జిల్లాలో నే రమణీయమైన దేవాలయాల్లో ఒకటి. దేవాలయాలు అందమైన శిల్పాలతో అద్భతంగా చెక్కబడి ఉన్నాయి. ఏకశిలా విగ్ర హం ఒకే శిలపై రాముని పట్టాభిషేక దృశ్యం, ఆంజనేయ స్వా మి రాములవారి పాదాల దగ్గర సేవ చేస్తున్నట్టు చెక్కబడిన దృ శ్యాలు గోచరిస్తాయి. 1800వ సంవత్సరంలో ఏనుగుల వీరాస్వామి తన కాశీయాత్ర చరిత్ర గ్రంథాలంలో ఈ ఆదిలాబాద్ గోపాలకృష్ణ మఠం గురించి ఆధారాలున్నాయి తెలుస్తుంది. 

10మంది మఠాధిపతులు 

శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠంలో ఇప్పటి వరకు ప్రస్తుత మఠాధిపతితో మొత్తం 10 మంది తమ కర్తవ్యాలను నిర్వహించారు. తొలి పీఠాధిపతిగా శ్రీ పూర్ణానంద స్వామీజీ ఆలయంలోనే జీవ సమాధి అయ్యారు. తర్వాత మఠాధిపతులుగా కృష్ణానంద సరస్వతీ స్వామి, సచ్చితానంద సరస్వతీ స్వామి, రమానంద సరస్వతీ స్వామి, గోవిందానంద సరస్వతీ స్వామి, బ్రహ్మానంద సరస్వతీ స్వామి, బ్రహ్మానంద సరస్వతీ స్వామి, బ్రహ్మానంద సరస్వతీ స్వామి, మాధవానంద సరస్వతీ స్వామి కర్తవ్యాలను నిర్వహించారు. ఈ మఠాధిపతుల సమాధులన్నీ మఠంలోనే ఏర్పాటు చేశారు. కాగా ప్రస్తుత 10వ పీఠాధిపతిగా శ్రీ యోగానంద సరస్వతి స్వామి 2000 సంవత్సరం నుంచి కొనసాగుతున్నారు.

అమావాస్య నుంచి పౌర్ణమి వరు జాతర 

మఠం వ్యవస్థాపకుడు, తొలి మఠాధిపతి శ్రీ పూర్ణానంద సరస్వతి స్వామి పుణ్యతిథిని పురస్కరించుకొని ఏటా జాతర నిర్వహిస్తారు. ఈ నెల 20న అమావాస్య రోజున మొదలుకొని డిసెంబర్ 4వ తేదీన పౌర్ణమి వరకు ఉత్సవాలు జరుగుతాయి. ఈ జాతరలో భాగంగా అభిషేకం, అశ్వవాహన సేవ, గజ వాహన సేవ, హనుమత్, గరుడ వాహన సేవలతో పాటు రథోత్సవం నిర్వహిస్తారు. ఈ నెల 25న రుక్మిణి, సత్యభామ, గోపాలకృష్ణుడు, పూర్ణానంద సరస్వతి స్వామి వారి మూర్తులతో రథోత్సవ నిర్వహణ ఆనవాయితీగా వస్తోంది.

కొలువైన దేవతమూర్తులు

ఈ ఆలయం శివకేశవుల ఆరాధనకు జిల్లాలోనే ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో కొలువు దీరిన సత్యభామ రుక్మిణి సమేతంగా గోపాలకృష్ణడు, వినాయకుడు, శివలింగం, విష్ణువు, సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామి, దుర్గామాత, సంతోషి మాతలను ఇక్కడి ప్రజలు భక్తితో ఆరాధిస్తారు. గోవు పూజకు కూడా ఈ ఆలయం ప్రసిద్ధిగాంచింది. ఆలయ ప్రాంగణంలోనే శతాబ్దాల కాలంనాటి మర్రి వృక్షం ఉంది. శివ కేశవులతో పాటు ఈ ఆలయంలో ఉన్న అందరు దేవతామూర్తులకు పూజలు చేస్తారు. కాగా మహారాష్ట్రలోని పండరిపూర్‌లో జరిగే పూజాధి కార్యక్రమాలు కార్తీక మాసం సందర్భంగా ఇక్కడ కూడా జరుగుతాయి.