15 July, 2026 | 12:04 AM

రష్యాలో ఉగ్రదాడి

25-06-2024 05:28 AM
  • 19 మంది కాల్చివేత 

సినగోగ్, చర్చి, పోలీస్ చెక్‌పోస్టుపై దాడులు

ఆరుగురు ఉగ్రవాదులను కాల్చి చంపిన బలగాలు

రష్యాలోని డాజెస్తాన్ ప్రావిన్స్‌లో దారుణం

మాస్కో, జూన్ 24: రష్యాలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. యూదు ప్రార్థనా మందిరం సినగోత్, చర్చిలే లక్ష్యంగా బీకర దాడులకు పాల్పడ్డారు. ఆటోమెటిక్ రైఫిళ్లతో కనిపించినవారినల్లా కాల్చేశారు. ప్రార్థనా మందిరాలకు నిప్పు పెట్టారు. ఓ పోలీస్ చెక్‌పోస్టుపై దాడి చేశారు. ఈ పాశవిక దాడుల్లో 19 మంది మరణించారు. వీరిలో 15 మంది పోలీసులు, ముగ్గురు పౌరులు, ఒక పూజారి పెద్ద కూడా ఉన్నారు. ఉగ్రవాదులు ప్రార్థనామందిరంలోకి చొరబడి అందులో ఉన్న ప్రీస్ట్ గొంతుకోసి చంపేశారు.

రష్యా దక్షిణ భాగంలో ఉన్న డాగెస్తాన్‌లోని ఉత్తర కాకసస్‌లో ఆదివారం మధ్యాహ్నం ఈ దాడి జరిగింది. ఆరుగురు నిందితులు అత్యాధునిక తుపాకులతో ఏక కాలంలో రెండు నగరాల్లో మారణహోమం సృష్టించారు. డాజెస్తాన్‌లోని అతిపెద్ద నగరమైన మఖచ్‌కలతోపాటు తీరప్రాంత నగరం దెర్బెంట్‌లో దాడి జరిగినట్టు డాజెస్తాన్ గవర్నర్ సెర్జీ మెలికోవ్ ప్రకటించారు. మఖచ్‌కలలో నలుగురు, డెర్బెంట్‌లో ఇద్దరు ముష్కరులను పోలీసులు కాల్చి చంపినట్టు అధికార వర్గాలు తెలిపాయి.

గంటపాటు భీతావహం

నలుపురంగు దుస్తులు ధరించిన ఉగ్రవాదులు కచ్చితమైన సమన్వయంతో ఈ దాడికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. గంటపాటు వారు రెండు నగరాల్లో భీతావహ వాతావరణం సృష్టించారు. పోలీసులు ఎదురుదాడి మొదలుపెట్టేవరకు వీరి స్వైరవిహారం కొనసాగుతూనే ఉన్నది.  

పశ్చిమదేశాల పనే..

ఈ ఉగ్రదాడి పశ్చిమదేశాల ప్రోద్బలంతోనే జరిగిందని మెలికోవ్ ఆరోపించారు. ‘ఈ ఉగ్రదాడి వెనుక ఎవరున్నారో, వారి లక్ష్యమేమిటో మాకు తెలుసు. మనం కచ్చితంగా తెలుసుకోవాల్సింది ఏమిటంటే యుద్ధం (ఉక్రెయిన్‌తో యుద్ధం) మన ఇండ్ల వద్దకు కూడా వచ్చింది. ఇప్పటివరకు యుద్ధాన్ని మనం చూశాం. ఈరోజు మన దానిని ఎదుర్కొన్నాం’ అని పేర్కొన్నారు. అయితే, డాజెస్తాన్‌లోని సెర్గోకలిన్సీ జిల్లా ఉన్నతాధికారి మగమోద్ ఒమరోవ్‌ను ఈ ఘటనకు బాధ్యుడిగా అరెస్టు చేశారు. దాడికి పాల్పడిన ఉగ్రవాదుల్లో ఇద్దరు ఈయన కుమారులేనని పోలీసులు గుర్తించారు.