1300లకు చేరిన హజ్ మృతులు
- 83 శాతం యాత్రికులు రిజిస్ట్రేషన్ లేకుండానే రాక
సౌదీ అరేబియా ప్రభుత్వం వెల్లడి
సౌదీ అరేబియా, జూన్ 24: హజ్ యాత్ర మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగూనే ఉన్నది. తీవ్రమైన ఎండలు, వడగాలతో 1301 మంది మరణించారని సౌదీ అరేబియా ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. వీరిలో 83 శాతం మంది యాత్రకు ఎలాంటి రిజిస్ట్రేషన్ చేసుకోకుండా అక్రమంగా వచ్చినవారేనని తెలిపింది. మృతుల్లో ఎక్కువ మంది మండే ఎండల్లో చాలాదూరం నడుచుకొంటూ రావటం వల్ల వడదెబ్బతో మరణించారని సౌదీ అరేబియా మీడియా వెల్లడించింది. మృతుల్లో అత్యధికులు సౌదీ పక్కనే ఉన్న ఈజిప్టు పౌరులే ఉన్నారు. మొత్తం మృతుల్లో 658 మంది ఈజిప్టువారు ఉన్నారని, వీరిలో 630 మంది అక్రమంగా హజ్‌కు వచ్చారని అధికార వర్గాలు తెలిపాయి. హజ్ యాత్ర జరిగే మక్కాలో ప్రస్తుతం 51 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ ఎండలో యాత్రికులు గంటలపాటు వేచి ఉండటంతో వడదెబ్బతో చనిపోతున్నారు.
అక్రమ యాత్రికులే అధికం
సౌదీ అరేబియాలోని మక్కాలో ఏటా జరిగే హజ్‌కు ప్రపంచం నలుమూలల నుంచి ముస్లింలు వస్తారు. అయితే, యాత్రికుల సంఖ్యను నియంత్రించేందుకు సౌదీ అరేబియా ప్రభుత్వం ప్రతి దేశం నుంచి నిర్ణీత సంఖ్యలోనే యాత్రికులను అనుమతిస్తుంది. అంతమేరకే ఆయా దేశాలు యాత్రికులను పంపాలి. వారు కూడా ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నిబంధనలను ఆసరాగా చేసుకొని అనేక దేశాల నుంచి హజ్‌కు యాత్రికులను అక్రమంగా పంపేందుకు ఏజెంటు పుట్టుకొచ్చారు. హజ్ పేరుతో కాకుండా ఇతర కారణాలు చెప్పి వేలమందిని సౌదీ అరేబియాలోకి పంపుతున్నారు. వారంతా అధికారిక మార్గాల ద్వారా కాకుండా ప్రమాదకరమైన ఎడారి ప్రాంతాల గుండా నడుస్తూ మక్కాకు చేరుకొంటున్నారు. ఈ క్రమంలో ఎండలకు తాళలేక చనిపోతున్నారు. అక్రమ యాత్రికుల్లో సౌదీ చుట్టుపక్కల ఉన్న దేశాలవారే అధికంగా ఉంటున్నారు.






