రోహిత్ కేసులో మలుపు
ఎనిమిదేళ్ల క్రితం జరిగిన హైదరాబాద్ యూనివర్శిటీ పిహెచ్‌డి విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య కేసు తాజాగా కొత్త మలుపు తిరిగింది. ఆత్మహత్య చేసుకున్న రోహిత్ దళితుడు కాదని తేలిందని, అతని ఆత్మహత్య ఘటనపై నమోదైన కేసులో సాక్ష్యాధారాలు లేవని, దీంతో కేసును మూసి వేస్తున్నట్లు పోలీసులు కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ కేసులో తనపై దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాల్సిందిగా అప్ప టి యూనివర్సిటీ వైస్ చాన్సలర్ అప్పారావు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ అవసరం లేదని కూడా న్యాయమూర్తి స్పష్టం చేశారు. అంతేకాదు, ఆయనతోపాటు నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటించారు.
దీంతో యూనివర్సిటీలో విద్యార్థులు మరోసారి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల నివేదికపై రోహిత్ తల్లి, సోదరుడు కూడా అనుమానాలు వ్యక్తం చేయడంతో కేసుపై తిరిగి విచారణ జరిసిస్తామని రాష్ట్ర డీజీపీ ప్రకటించారు. రోహిత్ తల్లి రాష్ట్ర సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి హఠాత్తుగా కేసును మూసివేస్తున్నట్లు పోలీసులు ప్రకటించడంపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కేసు పునర్విచారణ చేపట్టి తమకు న్యాయం జరిగేలా చూడాలని అభ్యర్థించారు. సీఎం కూడా రోహి త్ కేసుపై తిరిగి విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు. అయితే, రోహిత్ తల్లిని వడ్డ్డెర కులానికి చెందిన కుటుంబం పెంచుకోవడం, తమ కులానికే చెందిన వ్యక్తితో వివాహం జరిపించడంతో ఈ సమస్య తలెత్తింది. అంతేకాదు, పోలీసులు కోర్టులో క్లోజర్ నివేదికను మార్చి 21నే దాఖలు చేసిన ప్పటికీ లోక్‌సభ ఎన్నికలకు పది రోజుల ముందు ఇది వెలుగులోకి రావ డం పలు అనుమానాలకు తావిస్తోంది.
ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన రోహిత్ వేముల హైదరాబాద్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ విద్యా ర్థి. ‘అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్’ పేరుతో క్యాంపస్ లోని సమస్యలపై ఆందోళనలు చేస్తున్నారన్న ఆరోపణలపై అధికారులు 2015 జులై నుంచి అతని స్టుపెండ్‌ను నిలిపివేశారు. అదే ఏడాది ఆగస్టులో అప్పటి కేంద్రమంత్రి, బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ ఇటీవలి కాలంలో హైదరాబాద్ యూనివర్సిటీలో కులతత్వ, తీవ్రవాద ముఠాలకు నిలయంగా మారుతోందని, దీనిపై చర్యలు తీసుకోవాలని అప్పటి కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీకి లేఖ రాశారు. పలు మలుపుల అనంత రం రోహిత్‌తోపాటు ఐదుగురు విద్యార్థులను అధికారులు సస్పెండ్ చేశారు. ఇది జరిగిన నెల రోజులకు 2016 జనవరి 17న రోహిత్ తన మిత్రుడి గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు. రోహిత్ మృతిపై అప్పట్లో వర్సిటీలోని దళిత విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. కులవివక్ష కారణంగా దళితుడైన రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపిస్తూ విద్యార్థులు ఆందోళనలు చేశారు.
కులం పేరుతో బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపికి చెందిన వారు వేధించడం కారణంగానే అతను ఆత్మహత్య చేసుకున్నాడనేది కుటుంబ సభ్యులు, విద్యార్థుల ఆరోపణ. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రెండుసార్లు హైదరాబాద్‌కు వచ్చి విద్యార్థులతో సమావేశమై వారి ఆందోళనకు మద్దతు ప్రకటించడంతోపాటు పార్లమెంటులో ఈ అంశాన్ని ప్రస్తా వించారు. గచ్చిబౌలి పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఎఫ్‌ఐఆర్‌లో యూనివర్సిటీ వీసీ అప్పారావు, అప్పటి కేంద్రమంత్రి దత్తాత్రేయతోపాటు కొంతమంది బీజేపీ నేతలుకూడా ఉన్నారు. రాష్ట్రంలో కాంగ్రె స్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలకే పోలీసులు కేసు మూసి వేస్తున్నట్లు పేర్కొనడంపై రోహిత్ తల్లి, సోదరుడు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. రోహిత్ దళితుడు కాదని, ఓబీసీ వర్గమైన వడ్డెర కులానికి చెందినవాడని పేర్కొనడంపైనా అతని తల్లి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తాను దళితురాలయినప్పుడు తన కుమారుడు దళితుడు ఎలా కాకుండా పోతాడని ఆమె ప్రశ్నిస్తున్నారు. కేసుపై తిరిగి విచారణ జరపాలన్న పోలీసుల నిర్ణయంతో రోహిత్ కుటుంబానికి న్యాయం జరుగుతుందని ఆశిద్దాం.






