12 May, 2026 | 12:41 PM

సమస్యల పరిష్కార శైలి

05-05-2024 12:35 AM

శాంతఫలమే ఆనందం. ఆనందానికి మూలం శాంతమే. శాంతానందాలు మానవుని దివ్యహృదయ స్పందనలు. నిజానికి అవి అభేద అమృతనదులు. అశాంతి అంటే అలజడి, అనిశ్చితి, భయం, అసంతృప్తి, బాధ. శాంతి, అశాంతి మారే ఉధృతులతో లోనసాగే ప్రవాహాలు. సుఖాలు, బాధలు ఖండాలుగా ఆయా సందర్భాలలో కలిగే అనుభవాలు. అశాంతిని కలిగించేవే అనేక రూపాలలో వచ్చే సమస్యలు. మన జ్ఞాన, ఇచ్ఛా, క్రియాశక్తులను వాటి పరిష్కారం వైపు కేంద్రీకరింపజేసే సందర్భాలు, సమస్యలు కొన్ని వుంటాయి. అవి కొన్ని స్వయంకృతాలు, మరికొన్ని అన్యకృతాలు. మన దేహ, బుద్ధి పరిమితుల వల్ల కలిగేవి, ముందుజాగ్రత్తతో నివారించుకోగలిగినవి స్వయంకృతాలు. మన అధీనంలో లేని ప్రాకృతిక, సామాజిక, రాజ్యశక్తులతో కలిగే సమస్యలు అన్యకృతాలు.

అన్యకృత సమస్యలను ఎప్పటికప్పుడు ఎదుర్కొని పరిష్కరించుకోవలసిందే. లేదా వాటి ప్రభావం నుండి దూరంగా ఉండడానికి, కనీసం అతి కనిష్ఠంగానైనా గురి అయ్యేటట్లు జీవించడానికి పూనుకోవలసిందే. అయితే, విస్తరిస్తున్న నవ్య నాగరికత వల్ల రెండవ వికల్పానికి అవకాశాలు సుమారుగా లుప్తమైనట్లే. ఏ సమస్యలకైనా గురువు, పెద్దలు, సంప్రదాయం, శాస్త్రం, స్వీయానుభవం మన బుద్ధికి అందించిన మార్గాలలోనే పరిష్కారాలు పొందవలసి వుంటుంది. ఆయా సమాజాల పరిణత సంస్కృతులు నిర్దేశించిన మార్గంలో, విచక్షణా యుతంగా  సమకాలీన సాంకేతిక సహకార వినియోగంతో జీవితాన్ని సాగిస్తే సగం సమస్యలకు అవకాశమే ఉండదు. మిగతా సమస్యలలో కూడా చాలావరకు ఇంద్రియ నిగ్రహంతో, కొంత ముందుచూపుతో, క్షమతో జీవిస్తే సులభంగా పరిష్కృతమవుతాయి. ఇక, మనం పరిష్కరించుకోలేని సమస్యలను భగవంతుడిపై భారం వేసి, జాగరూకతతో భరిస్తూ కాలానికి వదలి వేయడమే వివేకం. 

సమస్యలు, విశిష్టతలు ఉన్నా లేకున్నా ధర్మనిష్ఠ, వృత్తినిబద్ధత, కృతజ్ఞత, దైవచింతన లేదా సకలలోక హితేషణలతో జీవించాలి. పోలికలలోకి ఎంతమాత్రం పోకూడదు. వున్నంతలో సంతృప్తితో ఆర్షమార్గంలో సాగించే జీవితం శ్రేయస్కరం, ఆనందమయం, భవ్య భవిష్యత్సుపోషకం కూడా. వారివారి ప్రజ్ఞ, కృషి, కుటుంబ నేపథ్యాలు, సామాజిక పరపతి వంటివాటివల్ల ప్రాప్తించే కౌశలాలు, స్థానాలు, సంపదలు, పాండిత్యం, అధికారం, కీర్తిప్రతిష్ఠలు పై ఆర్షమార్గంలో నడిస్తే ఆ విశిష్టతలు ఆ వ్యక్తులకు, సమాజానికి మహామధుకోశమే అవుతాయి. 

అట్లా కాక మాయలో పడి అహంకారానికి లోనైతే, సకల సమస్యల విచ్ఛేదనతో విజయానికి తమ బలమే మూలమన్న అహంభావానికి వచ్చి, పరదూషణలు చేయడం వృథా. అటువంటి వారి విధానశైలి ఎంతటి పటాటోపంతో, ప్రశంసలతో సాగినా, చరిత్రలో ఎంత గొప్పగా కీర్తించబడ్డా, సంస్కార తరంగాలుగా ప్రకృతి ఋతంలో లీనమయ్యే వారి మూల్యాలు ఫలితాలను ఇవ్వవు. సత్యగతి, నిష్కుటిలత్వం, సమన్వయంతో సమస్యలను ఛేదిస్తూ భవ్యనిర్మాణ పథాలను నిర్మించుకోగలిగిన వారికి పురుషోత్తమ దివ్యగతులు సంప్రాప్తించకుండా వుండవు.

 

యముగంటి ప్రభాకర్

సెల్: 9440152258