నేరాల కట్టడికి ద్విముఖ వ్యూహం
- పాఠ్యాంశంగా ‘హౌ టు రెస్పెక్ట్ విమెన్’
- హైడ్రా తరహాలో పోలీస్ శాఖ పనిచేయాలె
- మానవ అక్రమ రవాణా నివారణ సదస్సులో సీతక్క
హైదరాబాద్, ఆగస్టు 29 (విజయ క్రాంతి): రాష్ట్రంలో నేరాల కట్టడికి ద్విముఖ వ్యూహం అనుసరిస్తున్నామని మహిళా,శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక అన్నారు. మాన వ అక్రమ రవాణా నివారణ కోసం చేపట్టాల్సిన చర్యలపై హైదరాబాద్‌లోని హెచ్‌ఐఐ సీలో తెలంగాణ ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో జరిగిన సదస్సును ప్రారంభించిన అనంతరం మంత్రి సీతక్క మాట్లాడారు. నేరం జరిగిన వెంటనే బాధితులకు సత్వర న్యాయం చేయడంతోపాటు, నిందితులకు త్వరగా శిక్ష పడేలా వ్యవస్థలను మెరుగుపరచాలని సూచించారు.
షీటీం వ్యవస్థ, టీ సేఫ్ యాప్ రాష్ట్రంలో అమ్మాయిలు, మహిళలకు భద్రత కల్పించడంతోపాటు భరోసా నిస్తున్నాయని చెప్పారు. మహిళలపై నేరాలను తగ్గించడానికి ఉమెన్స్ సేఫ్టీ వింగ్, పోలీ స్ శాఖ పనిచేస్తున్నాయని అభినందించారు. సమాజం అభివృద్ధి చెందుతున్నా మనుషుల ఆలోచన ధోరణి మారడం లేదని, మహిళల పట్ల చిన్నచూపు కొనసాగడమే హత్యలకు, అత్యాచారాలకు కారణమవుతుందన్నారు. అన్ని స్థాయిల్లో మహిళలు వేధింపులు ఎదుర్కోవడం బాధాకరమన్నారు. పురుషుల మైండ్ సెట్ మారాలన్నారు.
మహిళలను గౌరవించడాన్ని పాఠశాల స్థాయి నుంచే పాఠ్యాంశంగా బోధిస్తామన్నారు. మహిళా భధ్రత కోసం మరిన్ని కార్యక్రమాలను చేపడుతున్నట్టు మంత్రి పేర్కొన్నారు. మహిళలకు ఆర్థిక భద్రతతోపాటు సామాజిక భద్రత కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు.
వ్యసనాల నుంచి సమాజాన్ని బయటకు తీసుకొచ్చేలా డ్రగ్స్ మహమ్మారిపై తమ ప్రభుత్వం యుద్ధం చేస్తుందన్నారు. మానవ అక్రమ రవాణాపై కార్యాచరణ రూపొందిస్తే అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో డీజీపీ జితేందర్‌రెడ్డి, ఉమెన్ సేఫ్టీ వింగ్ డీజీ శిఖా గోయల్, సెర్ప్ సీఈవో దివ్యా దేవరాజన్, సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి, ప్రజ్వల ఫౌండేషన్ నిర్వాహకురాలు సునీతా కృష్ణన్, ఐదు రాష్ట్రాలకు చెందిన ఉన్నతాధికారులు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు.






