6 July, 2026 | 1:52 AM

పాడి రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

06-07-2026 12:38 AM

మంత్రి వాకిటి శ్రీహరి

షాద్నగర్, జులై5(విజయక్రాంతి): విజయ డైరీ పాడి రైతుల సమస్యలను దశలవారీగా పరిష్కరించి, వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని రాష్ట్ర పశుసంవర్ధక, పాలాభివృద్ధి శాఖల మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు. ఆదివారం షాద్నగర్లో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర డెయిరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్  60వ వార్షికోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై, జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడారు.

బిల్లుల చెల్లింపులకు ప్రాధాన్యం: రైతుల ప్రధాన సమస్య అయిన బిల్లుల చెల్లింపులపై ఇప్పటికే ఉన్నత స్థాయి సమీక్షలు జరిగాయని, అవసరమైతే ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కతో చర్చించి త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో రోజుకు 20 లక్షల లీటర్లుగా ఉన్న పాల సేకరణను భవిష్యత్తులో 22 లక్షల లీటర్లకు పెంచుతామన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోళ్లు తగ్గించి, స్థానిక రైతుల పాలకే తొలి ప్రాధాన్యం ఇస్తామని ప్రకటించారు.

కర్ణాటక తరహాలో సరికొత్త పథకం: పాడి పరిశ్రమ బలోపేతానికి కర్ణాటక విధానంపై అధ్యయనం చేస్తున్నామని తెలిపారు. రైతు భాగస్వామ్యం, బ్యాంకు రుణం, ప్రభుత్వ సబ్సిడీతో కూడిన సరికొత్త పథకం కోసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక  సిద్ధమవుతోందని, త్వరలోనే దీనిని ప్రకటిస్తామన్నారు. రైతుల కష్టార్జితంతో విజయ డైరీ దేశంలోనే 5వ స్థానంలో నిలవడం గర్వకారణమన్నారు. పాడి రైతుల ఆర్థిక స్థితిని మెరుగుపరిచేందుకు ఆవులు, గేదెల కొనుగోలుకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తామని మంత్రి పేర్కొన్నారు.  స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, విజయ డైరీ చైర్మన్ అమిత్ రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ చంద్రశేఖర్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.