పరదా దాటిన దర్శన
అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా రూపొందుతున్న తాజా చిత్రం ‘పరదా’. ఆనంద మీడియా సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహిస్తున్నారు. మలయాళ నటి దర్శన రాజేంద్రన్, సీనియర్ కథానాయిక సంగీత ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా సోమవారం దర్శన పుట్టిన రోజు సందర్భంగా ‘పరదా’ నుంచి ఆమె పాత్రను పరిచయం చేస్తూ ఓ వీడియో విడుదల చేశారు మేకర్స్.
అమిష్ట అనే పాత్రలో ఈ చిత్రంలో కనబడనున్న దర్శన మలయాళ చిత్రం ‘హృదయం’ ద్వారా విశేష ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంది. ప్రేమకథా చిత్రంగా రూపొందిన ఈ సినిమాని ఓటీటీ వేదికల్లో చూసి ఇప్పటికే దర్శనతో ప్రేమలో మునిగి ఉన్నారు తెలుగు కుర్రకారు. కాగా తాజాగా విడుదలైన వీడియోలో “అబ్బాయిలు చేయలేనిది.. అమ్మాయిలు చేయగలిగేది.. పిల్లల్ని కనడం” అంటూ మురిపెంగ నవ్వేస్తూ వారిని మరింత కవ్విస్తోంది ఈ మలయాళీ భామ.






