బచ్చన్ షో మొదలు
రవితేజను ‘మిస్టర్ బచ్చన్’గా ముస్త్తాబు చేస్తున్నారు దర్శకుడు హరీష్ శంకర్. వీరిద్దరి కలయికలో రూపొందుతోన్న మూడవ చిత్రమిది. విడుదలకు చేరువ అవుతున్న తరుణంలో తాజాగా ‘మిస్టర్ బచ్చన్’ సినిమాకి సంబంధించి ‘షో రీల్’ పేరిట ఒక వీడియో విడుదల చేశాయి చిత్ర వర్గాలు. దీనిని బట్టి స్టులిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా సినిమాని తీర్చిదిద్దినట్టు తెలుస్తోంది. స్వతహాగా రచయిత అయిన హరీష్ నుంచి మంచి మాస్ డైలాగులు ఆశిస్తారు అభిమానులు.
అయితే ఈ ‘షో రీల్’లో డైలాగులు ఉండవని ముందుగానే తెలియజేసిన ఆయన, తనదైన శైలి టేకింగ్‌తో ఆకట్టుకున్నారు. మిక్కీ జే మేయర్ నేపథ్యం సంగీతం కూడా సన్నివేశాలకి బలం చేకూర్చేలా ఉంది. హిందీలో అజయ్ దేవగణ్ నటించిన ‘రెయిడ్’ చిత్రానికి రీమేక్‌గా రూపొందు తున్న ఈ సినిమాని పీపుల్స్ మీడియా పతాకంపై టిజి విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఆదాయపన్ను శాఖ అధికారిగా రవితేజ, ప్రతినాయకుడిగా జగపతి బాబు కనపడనున్న ఈ సినిమాతో కథానాయిక భాగ్య శ్రీ బోర్సె తెలుగు తెరపైకి రానున్నారు. ఈ సినిమాకి మూలం అయిన హిందీ ‘రెయిడ్’ చిత్రానికి ప్రస్తుతం సీక్వెల్ తెరకెక్కుతుండగా, నవంబర్‌లో దానిని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు నిర్మాతలు.






