4 August, 2026 | 1:49 AM

నిరసనల పర్వం

04-08-2026 12:10 AM

దేశంలోని యువత ఆకాంక్షలను విస్మరించిన సమాజాలు తగిన మూల్యం చెల్లించక తప్పదనేది చరిత్ర ఎప్పుడూ గుర్తు చేసే అంశం. ప్రజాస్వామ్యం అంటే ఐదేళ్లకు ఒకసారి వచ్చే ఓట్ల పండుగ కాదు, ప్రజల హక్కులకు భంగం కలుగకుండా, ప్రజలకు వ్యవస్థ జావాబుదారీతనంగా ఉండటం. జవాబుదారీతనం లేకుండా, ఇది ఇంతే అన్నట్టుగా పాలన సాగితే ఎదురుదెబ్బలు తప్పవు. దేశంలో వ్యవస్థీకతంగా మారిన పరీక్ష పత్రాల లీకు ల వ్యవహారం ఇదే చెప్పింది.

దాదాపు లక్షా ముప్పువేల సీట్ల కోసం 23 లక్షలకు పైగా విద్యార్థులు ‘నీట్’ పరీక్ష రాయడం, ఆ పేపరు లీకై అనేక అవకతవకలు బయటపడటం దేశవ్యాప్తంగా విద్యార్థులను కుంగదీసింది.అయితే విద్యార్థులు ఇలా కుంగిపోవడం ఇది మొదటిసారి కాదు. దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో పబ్లిక్ పరీక్షల నిర్వహణలో లోపాలు బయటపడటం సర్వసాధారణమైంది. పరీక్షల పేపర్లు లీకై, తమ సమయం, శ్రమ, ప్రతిభ గాలిలో కలిసిపోవటంపై విద్యార్థులు అనేక ఏళ్లుగా నిర్వేదంతో వున్నారు.

‘నీట్’ పేపర్ లీక్‌పై కాక్రోచ్ జనతా పార్టీ పేరిట దేశవ్యాప్త ఉద్యమం జరుగడం, కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చివరికి రాజీనామా చేయాల్సిరావడం.. నిరాశానిస్పృహల్లో ఉన్న యువతకు విజయాన్ని అందించింది. తమ భవిష్యత్‌ను చిదిమేసే అక్రమాలను తాము సహించమని ఖరాఖండిగా చెప్పినట్టయింది. ఈ ఆందోళన ఇంతటితో ఆగలేదు. జార్ఖండ్ రాజధాని రాంచీలో ఆదివారం సాయంత్రం వేలాది మంది విద్యార్థులు కదం తొక్కారు.

కాగడాలు పట్టుకొని నిరసన ప్రదర్శన జరిపారు. కారణం, జార్ఖండ్ పబ్లిక్ సర్వీసు కమిషన్ నిర్వహించిన నియామక పరీక్షలో అవకతవకలు జరగడం. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని, నియామక సంస్థలలో వెంటనే సంస్కరణలు తీసుకురావాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఆ విద్యార్థులకు, వారి నిరసనలకు బాసటగా నిలబడతామని సీజేఐ కూడా ప్రకటించింది. జంతర్‌మంతర్ వద్ద ‘నీట్’ పేపర్ లీక్‌పై జరిగిన ఆందోళన జార్ఖండ్ విద్యార్థులకు స్ఫూర్తినిచ్చింది.

జూలై 29 నుంచి ప్రారంభమైన విద్యార్థుల నిరసన అంతకంతకూ పెరిగి ఇప్పుడు రాజకీయ పార్టీలు, పౌర సమాజ సభ్యులు కూడా మద్దతునివ్వాల్సినంతగా ఎదిగింది. జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పేపర్ లీక్స్‌పై గతంలో జరిగిన విచారణలు దోషులను శిక్షించే విధంగా చర్యలకు దారితీయకపోవడంపై విద్యార్థులు నిరాశచెంది వున్నారు. ఇప్పుడు వారు ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ రాజీనామాను డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థులు ఇక నిరసనను అణచిపెట్టుకోదల్చుకోలేదని అవగతమవుతున్నది.