4 August, 2026 | 1:56 AM

కళా వైభవానికి ప్రతీక రొట్టె విశ్వనాథశాస్త్రి

04-08-2026 12:12 AM

నేడు విశ్వనాథశాస్త్రి వర్ధంతి :

తెలంగాణ ఉత్తరభాగాన గోదావరి తీరాన వెలసిన ధర్మపురి పుణ్యక్షేత్రం కేవలం శ్రీలక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రంగానే కాదు, వేద-- ఆగమ-- పౌరాణిక --సాహిత్య --నాటక సంప్రదాయాలకూ నిలయం. ఈ పవిత్రక్షేత్రం భారతీయ సంస్కృతికి అందించిన మహనీయుల్లో రొట్టె విశ్వనాథశాస్త్రి ఒకరు. కళను ఉపాధిగా కాకుండా ఉపాసనగా భావించి, రంగస్థలాన్ని ఆలయంగా ఆరాధించి, పాత్రను యజ్ఞంగా నిర్వహించిన అరుదైన కళాకారుడు విశ్వనాథశాస్త్రి.

ఆయన 1936 మార్చి 17న ధర్మపురిలో జన్మించారు. విశ్వనాథశాస్త్రి జన్మించిన చోటు కళలకు కాణాచి. పౌరాణిక నాటకాలకు ప్రసిద్ధి. అలాటటి పరిసరాల్లో పెరిగిన విశ్వనాథ శాస్త్రి తన 14వ ఏటనే రంగస్థల ప్రవేశం చేశారు.  కేవలం నటుడిగానే కాకుండా ఆయన ప్రయోక్తగా, దర్శకుడిగా, రచయితగా, పద్యవాచకుడిగా, కవిగా, భాషా పండితునిగా, పౌరాణిక సంప్రదాయ పరిరక్షకుడిగా విశిష్ట సేవలందించారు. రంగస్థలంపై ఆయన నటన అసాధారణమైంది.

భావ వ్యక్తీకరణ అయినా, రాగభావాల సమన్వయమైనా ఆయనకు కొట్టినపిండి. లవకుశ, భక్త ప్రహ్లాద, శ్రీకృష్ణ తులాభారం, చింతామణి, వీరకాపయ, వీరపాండ్య కట్టబొమ్మన, గయోపాఖ్యానం, శ్రీకృష్ణ రాయబారం వంటి వందలాది పౌరాణిక, చారిత్రక, సాంఘిక నాటకాల్లో ఆయన శ్రీకృష్ణుడు, దుర్యోధనుడు, గయుడు, బిల్వమంగళుడిగా విభిన్న పాత్రలకు జీవం పోశారు. ముఖ్యంగా శ్రీకృష్ణ రాయబారంలోని పద్యాలను ఆయన ఆలపించే తీరు ప్రేక్షకులను భావసమాధిలోకి తీసుకెళ్లేదని సమకాలీనులు పేర్కొనేవారు.

ఆంగిక, వాచిక, సాత్విక, ఆహార్య అభినయాల సమన్వయంతో భారతీయ నాట్యసూత్రాలకు అనుగుణంగా పాత్రలను ఆవిష్కరించిన అరుదైన కళాకారుడిగా ఆయన కీర్తి గడించారు. ఆయన పద్యపఠనంలోని మాధుర్యం, స్వరశుద్ధి, భావవ్యక్తీకరణ నాటి ప్రముఖులను విశేషంగా ఆకట్టుకున్నాయి. నాటి మహానటుడు ఈలపాట రఘురామయ్య సైతం పౌరాణిక పద్యాలను వినిపించుకుని సత్కరించడం విశ్వనాథశాస్త్రి ప్రతిభకు నిదర్శనం.

ప్రముఖ పండితుడు దివాకర్ల వెంకటావధాని ఆయన్ను ‘అపర పీసపాటి’గా అభివర్ణించడం ఆయన పద్యపఠన వైభవానికి లభించిన అరుదైన గౌరవం. విశ్వనాథశాస్త్రికి దిగ్గజ రాజకీయనేత, మాజీ ప్రధాని పీవీ నరసింహారావుతో అనుబంధం ఉండేది. 1959లో ఆయన నటనా ప్రతిభను ప్రత్యక్షంగా వీక్షించిన వీపీ ఆయన్ను ‘నటరత్న’ బిరుదుతో సత్కరించారు.

అనంతరం విశ్వనాథశాస్త్రి ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో నాటి రాష్ట్రపతి ఫకృద్దీన్ అలీ అహ్మద్ సమక్షంలో శ్రీకృష్ణ రాయబారంలోని పద్యాలను రాగయుక్తంగా ఆలపించి ఆకట్టుకున్నారు. రంగస్థల సేవలతోపాటు ఆధ్యాత్మిక రంగంలోనూ విశ్వనాథశాస్త్రి విశిష్ట సేవలు అందించారు. శ్రీశృంగేరి శారదా పీఠాధిపతి భారతీ తీర్థ మహాస్వామి చేతుల మీదుగా ‘ఉత్తమ పౌరాణికుడు’ బిరుదు, కుర్తాళం పీఠాధిపతి నుంచి ‘వైదిక ఆగమాలంకార’ బిరుదు అందుకున్నారు.

1995లో ఢిల్లీలో జరిగిన విశ్వసదస్సులో ఆగమశాస్త్రంపై చేసిన పాండిత్యపూర్వక ఉపన్యాసానికి విశ్వయోగి విశ్వంజీ చేతుల మీదుగా సత్కారం పొందారు. 1999 మార్చి 18న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రవీంద్రభారతి వేదికపై ఘనంగా సన్మానించారు. 2007లో తెలుగు నాటకరంగ దినోత్సవం సందర్భంగా కరీంనగర్ జిల్లా పరిపాలన ఆయనను వద్ధ కళాకారునిగా గౌరవించడం ఆయన కళాసేవకు ప్రభుత్వ గుర్తింపుగా నిలిచింది.

రంగస్థలంతో పాటు రచనా రంగంలోనూ విశ్వనాథశాస్త్రి విశిష్ట కృషి చేశారు. 1963 నుంచే ఆంధ్రప్రభ, సారస్వత జ్యోతి, జయంతి, గౌతమి, దేవాదాయ శాఖ అధికారిక పత్రిక ‘ఆరాధన’ తదితర పత్రికల్లో దేవాలయ సంస్కృతి, ఆగమశాస్త్రం, ధర్మపురి చరిత్ర, సాహిత్యం, నాటకరంగం వంటి అనేక అంశాలపై పరిశోధనాత్మక వ్యాసాలు రాశారు.

విద్యాభివృద్ధిపైనా ఆయనకు అపారమైన ఆసక్తి. 2020 ఆగస్టు 4న విశ్వనాథశాస్త్రి పరమపదించారు. మహాకళాకారులు భౌతికంగా దూరమైనా, వారి కళా సంపద కాలగర్భంలో కలిసిపోదు. విశ్వనాథశాస్త్రి వర్ధంతి సందర్భంగా ఆ మహోన్నత కళామూర్తిని స్మరించుకోవడం సాంస్కృతికాభిమానుల బాధ్యత.

రామకిష్టయ్య సంగనభట్ల,

వ్యాసకర్త సెల్: 9440595494